పీఎం ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ ని ప్రారంభించిన మోదీ

మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్ లో ప్రధాని మోదీ వరుస పర్యటనలు చేస్తున్నారు. సోమవారం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్‌ను మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ఆనంది బెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్య నాథ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ…నేడు కాశీ హృదయం ఒకటే, మనస్సు కూడా అదే, కానీ శరీరాన్ని మెరుగుపరచడానికి నిజాయితీగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. పీఎం ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పథకం భారత దేశ ఆరోగ్య రంగంలో ఆత్మవిశ్వాసాన్ని, స్వయంసమృద్ధిని నింపుతుందన్నారు. దేశ ఆరోగ్య సదుపాయాలకు నూతన జవసత్వాలు వస్తాయన్నారు. అతి పెద్ద, అత్యుత్తమ పెట్టుబడులలో ఒకటైన ఆరోగ్య రంగంలో పెట్టుబడులని మనం ఎప్పుడూ విశ్వసిస్తామన్నారు. ఆరోగ్యవంతమైన భారతదేశం కల నెరవేరుతోంది.. మీ అందరికీ అభినందనలు అని ప్రజలనుద్దేశించి మోదీ అన్నారు.
రీసెర్చ్ ల్యాబ్ లు మరియు వైరల్ డయాగ్నస్టిక్స్ కేంద్రాల సరికొత్త నెట్‌వర్క్ మరియు పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయనున్నట్లు మోదీ చెప్పారు. ‘వన్ హెల్త్’ కోసం ఈ కొత్త సంస్థ మన ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుందన్నారు. పీఎం ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్.. ఆరోగ్య సౌకర్యాలను అభివృద్ధి చేయడమే కాకుండా వివిధ రంగాలలో యువతకు చాలా ఉద్యోగ అవకాశాలను కూడా సృష్టిస్తుందన్నారు. ఉత్తరప్రదేశ్ లో కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభించడం వల్ల మెడికల్ సీట్లు మరియు డాక్టర్ల సంఖ్యపై సానుకూల ప్రభావం ఉంటుందన్నారు.
సీట్ల సంఖ్య ఎక్కువగా ఉన్నందున, ఇప్పుడు పేద తల్లిదండ్రుల పిల్లలు కూడా డాక్టర్ కావాలని కలలు కనడంతో పాటు మరియు దానిని నెరవేర్చుకోవచ్చన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన 70 ఏళ్లలో వైద్య కళాశాలల నుంచి బయటకు వచ్చిన డాక్టర్ల సంఖ్య కంటే వచ్చే 10-12 ఏళ్లలో దేశం చాలా మంది వైద్యులను అందుకోబోతోందని మోదీ అన్నారు.
కోవిడ్-19 పోరాటంలో దేశంలో 100 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ మైలురాయిని దాటినందుకు దేశ ప్రజలకు మోదీ అభినందలు తెలిపారు. కాశీ విశ్వనాథుడు, గంగమ్మ తల్లి, కాశీ ప్రజల ఆశీర్వాదాల వల్ల ‘అందరికీ టీకా, ఉచిత టీకా’ కార్యక్రమం విజయవంతంగా సాగుతోందన్నారు. దీపావళి, ఛాత్ తదితర పండుగలను దేశమంతా సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ.. శుభాకాంక్షలు తెలిపారు.
పీఎం ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కార్యక్రమాన్ని వారణాసి నుంచి ప్రారంభించడంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హర్షం వ్యక్తం చేశారు. 64 వేల కోట్ల రూపాయల ఆరోగ్య ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ ను ప్రధాన మంత్రి ఉత్తరప్రదేశ్ భూమి అయిన కాశీ నుంచి ప్రాజెక్టును ప్రారంభించడం గొప్ప విషయం అని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. కాశీ పట్ల అనుబంధం, కాశీ అభివృద్ధి, కాశీ వారసత్వ సంపద పట్ల ప్రధాన మంత్రి అభిప్రాయాలు అందరికీ తెలుసని యోగి అన్నారు. ఈరోజు రూ. 5,100 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులు కాశీలో ప్రారంభించబడుతున్నాయన్నారు.