పోలీస్ ల కళ్ళల్లో కారం కొట్టి… రాడ్డుతో దాడి చేసి!
తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజవర్గం రామచంద్రపురం ఆర్దీఓ సింధు సుబ్రహ్మణ్యం, డిఎస్పీ బాల చంద్రారెడ్డి ల సమక్షంలో ఓ మహిళ మరో మహిళ కానిస్టేబుల్ పై, రాడ్డుతో దాడి చేయడంతో పాటు కళ్ళల్లో కారం కొట్టి అందరిని నివ్వెరపోయేలా చేసింది. ఇక వివరాల్లోకి వెళితే రాయవరం మండలం నదురుబాధ కు చెందిన మిర్తిపాటి జ్యోతి కి చెందిన రేషన్ డిపో గత కొంత కాలంగా కోర్ట్ వివాదంలో ఉంది. కాగా సదరు డిపోను లలితా మహిళ స్వశక్తి సంఘం సభ్యురాలికి అందజేయాల్సిందిగా కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.
దీంతో రెవిన్యూ అధికారులు స్వాధీనం చేసుకునేందుకు వెళ్లినప్పటికి ఆమె నుండి సరైన స్పందన రాకపోవడంతో సాక్ష్యాత్తు ఆర్దీవో సింధు సుబ్రహ్మణ్యం, డిఎస్పీ బాల చంద్రారెడ్డి లు రంగం లోకి దిగారు. తమ సిబ్బందితో కలిసి వారు మహిళ ఇంటికి చేరుకున్నారు. రేషన్ సరుకులు, మిషన్ తదితర వాటిని స్వాధీనం పర్చుకోవాలని సింధు ఆదేశాలు జారీ చేయగా ఆమె తలుపులు మూసుకుని ఎవ్వరినీ లోనికి రానీయలేదు.
దీంతో తలుపులు విరగ్గొట్టి స్వాధీనం చేసుకోవాలని ఆర్డీవో అదేశించగా తలుపులు తీసేందుకు వెళ్లిన మహిళా పోలీస్, ఇతర సిబ్బందిపై రాడ్డుతో దాడి చేయడంతో పాటు కళ్ళల్లో కారం కొట్టింది. దీంతో ఆమెపై కేసు నమోదు చేయాల్సిందిగా రాయవరం పోలీస్ లను డిఎస్పీ ఆదేశించారు. కాగా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.