మోదీకి ముఖం చెల్లలేదేమో?

మోదీ ప్రసంగంపై నా స్పందనేమిటని కొందరు మిత్రులు అడిగితే, 25 లోక్ సభ సీట్లపై కన్నేసి, “అవసరార్థం చేసిన ప్రసంగం” అన్న భావన నాకు కలిగిందని చెప్పాను.

సభకొచ్చిన జనాన్ని హెలికాప్టర్ ద్వారా మరియు వేదిక మీద నుండి మోడీగారు వీక్షించారు కదా! ఆ జనం చేతుల్లో తన పార్టీ జెండాలు కనపడలేదేమో! అంటే, ఆ జనంలో తన పార్టీ వాళ్ళ శాతం పెద్దగా లేదని, తన కోసం వచ్చిన వాళ్ళు పెద్దగా లేరన్న భావన కలిగి ఉండవచ్చేమో! అలాగే, జగన్మోహన్ రెడ్డితో పెనవేసుకున్న ఐదేళ్ళ అనుబంధం! వాటన్నింటి ప్రభావం ఆయన ప్రసంగంపై పడి ఉండవచ్చేమో!

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం మేరకు హక్కుగా ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వాల్సిన ఇవ్వలేదు. కడప ఉక్కు కర్మాగారాన్ని, రాయలసీమ – ఉత్తరాంధ్ర అభివృద్ధి పథకాన్ని, ఓడ రేవును ఎగ్గొట్టారు. రైల్వే జోన్ ను నేటికీ ఏర్పాటు చేయలేదు. పోలవరం డిపియర్ కు ఆమోద ముద్ర వేయలేదు. తాను స్వయంగా శంకుస్థాపన చేసిన అమరావతి రాజధానిపై గోడ మీద పిల్లిలా వ్యవహరించారు.

రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సంపూర్ణ సహకారాన్ని అందించారు. ప్రత్యేక తరగతి హోదా కల్పించి పారిశ్రామికాభివృద్ధికి తోడ్పాటు అందించకపోగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని వంద శాతం ప్రయివేటీకరిస్తామని నిర్ద్వందంగా ప్రకటించారు. ఇంత చేసిన మోడీగారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలతో మాట్లాడడానికి మొఖం చెల్లకపోయి ఉండవచ్చని నాకు కలిగిన అభిప్రాయాన్ని మిత్రులతో పంచుకున్నాను.

– టి. లక్ష్మీనారాయణ
సామాజిక ఉద్యమకారుడు,
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక

Leave a Reply