Suryaa.co.in

Political News

హిందూ రాజ్యం దిశగా మోదీ అడుగులు?

హిందుత్వం వైపు రాజ్యాన్ని తీసుకెళ్ళే ప్రయత్నంలో మోడీ మరో ముందడుగు!

మన లౌకిక – ప్రజాస్వామ్య వ్యవస్థకు పార్లమెంటు ఆయువుపట్టు. పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవం సాధువులు – మఠాధిపతుల ఆధిపత్యంలో అట్టహాసంగా నిర్వహించబడింది. సాధువుల ఆశీర్వాదాల మధ్య “సెంగోల్”కు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సాష్టాంగ నమస్కారం చేశారు.
సాధువులు – మఠాధిపతులు వెంటరాగా, తాను రాజదండంగా అభివర్ణించిన “సింగోల్”ను స్వయంగా మోసుకెళ్ళి, స్పీకర్ స్థానానికి సమీపంలో ప్రతిష్టించారు. హిందుత్వ భావజాలానికి ఆద్యుడైన వినాయక్ దామోదర్ సావార్కర్ జన్మదినం కూడా అయిన మే 28న వ్యూహాత్మకంగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.

మనది మతాతీత రాజ్యమని రాజ్యాంగంలో పేర్కొన్నా, తద్భిన్నంగా పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. తద్వారా సమాజానికి పంపిన సందేశం ఏమిటి? భారత దేశం హిందుత్వ దేశమని అంతర్జాతీయ సమాజానికి మోడీగారు చెప్పదలచుకొన్నారా! అన్న భావన సహజంగా కలుగుతుంది.

భారత రాజ్యాంగం భారతీయులందరికీ శిరోధార్యం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 79 ప్రకారం పార్లమెంటు అంటే రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్ సభ కలిసిన వ్యవస్థ. ఉభయ సభల కేంద్ర స్థానం పార్లమెంటు. ప్రజాస్వామ్య దేవాలయంగా పార్లమెంటును అభివర్ణిస్తుంటారు. ప్రపంచంలోనే మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని గర్వంగా ప్రకటించుకొంటూ ఉంటాం. భారత ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి, సర్వసైన్యాధిపతి చేతుల మీదుగా పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవం చేసుకొని ఉంటే హుందాగా ఉండేది. మన ప్రజాస్వామ్య వ్యవస్థ మరియు దేశం యొక్క గౌరవం పెరిగేది.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి మరియు పెద్దల సభ అయిన రాజ్యసభ ఛేర్మన్ ను భాగస్వామిని చేయలేదు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు, ముఖ్యమంత్రులు మరియు పార్లమెంటు సభ్యులు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించారు. రాజ్యాంగ స్ఫూర్తికి, లౌకిక – ప్రజాస్వామ్య వ్యవస్థ మౌలిక స్వభావానికి తిలోదకాలిస్తూ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం మోడీగారి ఆధిపత్య – వ్యక్తి ఆరాధన – మతాన్ని రాజ్య వ్యవహారాల్లో చొప్పించే విధానాలకు పరాకాష్ట. ప్రారంభోత్సవ వేడుకను తన చుట్టే కేంద్రీకృతం చేసుకొని, తన “పర్సనాలిటీ కల్ట్”ను మోడీ సుస్థిరం చేసుకోవడానికి బాగా ఉపయోగించుకొన్నట్లు స్పష్టంగా కనిపించింది.

గత తొమ్మిదేళ్ళ పాలనలో మోడీ ప్రభుత్వం పార్లమెంటు ఉభయ సభల నిర్వహణలో జవాబుదారీతనతో వ్యవహరించలేదు. శాసనపరమైన 76% బిల్లులు ఉభయ సభల్లో ఎలాంటి చర్చకానీ, సంయుక్త పార్లమెంటరీ కమిటీల పరిశీలనకానీ లేకుండానే ఆమోదించబడ్డాయన్న విమర్శలపై మోడీ స్పందించిన దాఖలాలు లేవు.

మన ప్రజాస్వామ్య వ్యవస్థ నాణ్యతా ప్రమాణాలు పెరగాలంటే జుగుప్సాకరంగా తయారైన పార్లమెంటు పనితీరులో గుణాత్మకమైన మార్పురావాలి. కేవలం పార్లమెంటు నూతన భవన నిర్మాణంతో మన ప్రజాస్వామ్యం నాణ్యతా ప్రమాణాలు పెరగవు. మోడీగారి పోకడలు మన ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రమాదపుటంచుల వైపుకు నడిపిస్తున్నాయన్న భావన కలుగుతున్నది.

– టి. లక్ష్మీనారాయణ
సామాజిక ఉద్యమకారుడు

LEAVE A RESPONSE