Suryaa.co.in

National

మోదీకి భూటాన్‌ ‘ఆర్డర్‌ ఆఫ్‌ ది డ్రూక్‌ గ్యాల్పో’ పౌర పురస్కారం

థింపూ: భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం భూటాన్‌ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్‌ ఆఫ్‌ ది డ్రూక్‌ గ్యాల్పో’ను అందుకున్నారు. భూటాన్‌ రాజు జిగ్మే ఖేసర్‌ నాంగ్యేల్‌ వాంగ్‌చుక్‌ దీన్ని ప్రదానం చేశారు. దీంతో ఈ పురస్కారాన్ని అందుకున్న తొలి విదేశీ ప్రభుత్వాధినేతగా నిలిచారు. ఈ అవార్డును మోదీకి 2021లోనే ప్రకటించారు.

ఇరుదేశాల సంబంధాలను బలోపేతం చేయడంతోపాటు కొవిడ్‌ సమయంలో 5 లక్షల టీకాలను అందజేయడం వంటి చర్యలకు గుర్తింపుగా ఇచ్చారు. ఈ అవార్డు అందుకోవడం గౌరవంగా ఉందని, దీన్ని 140 కోట్ల మంది భారతీయులకు అంకితం ఇస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.

భూటాన్‌ ప్రధాని దాషో షెరింగ్‌ తోబ్గేతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. పునరుత్పాదక ఇంధనం, వ్యవసాయం, పర్యావరణం, పర్యటకం తదితర రంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకోవడంపై అవగాహన కుదుర్చుకున్నారు.

రెండు రోజుల అధికార పర్యటనకు ప్రధాని మోదీ శుక్రవారం ఉదయం భూటాన్‌కు చేరుకున్నారు. వాస్తవానికి నిన్ననే ఈ పర్యటన ప్రారంభం కావాల్సింది. అనివార్య కారణాలతో ఒకరోజు జాప్యం జరిగింది. 2014లో భారత ప్రధానిగా అధికారం చేపట్టినప్పటినుంచి ఈ దేశంలో పర్యటించడం ఇది మూడోసారి. థింపూలో భారత నిధులతో నిర్మించిన ఆస్పత్రిని ప్రారంభించనున్నారు

LEAVE A RESPONSE