– ఏపీలో తొలి మంకీపాక్స్ అనుమానిత కేసు
దేశంలో క్రమేణా మంకీపాక్స్ అనుమానిత కేసులు పెరుగుతున్నాయి. కరోనా కేసులు సైతం ఒక వైపు పెరుగుతున్న వేళ..మంకీపాక్స్ అనుమానిక కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మంకీపాక్స్ అనుమానిత కేసులు రాగా.. కేరళలో నాలుగు కేసులు నిర్దారించారు. తాజాగా, ఢిల్లీ..హిమాచల్ ప్రదేశ్ లోనూ మంకీపాక్స్ నిర్దారణ అయింది. ఇక, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ బయట పడుతున్నాయి. ఏపీలో తొలి మంకీపాక్స్ అనుమానిత కేసు గుంటూరులో గుర్తించారు.
8 సంవత్సరాల బాలుడిలో..
ఒంటిపై దద్దుర్లతో ఉన్న 8 సంవత్సరాల బాలుడ్ని తల్లిదండ్రులు గుంటూరు జీజీహెచ్ లో చేర్పించారు. రెండు వారాలు గడిచినా నయం కాకపోవడంతో వైద్యులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నమూనాలు తీసి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి పంపించారు. నివేదికను అనుసరించి తదుపరి కార్యాచరణ ఉంటుందని జీజీహెచ్ అధికారులు తెలిపారు. బాలుడి తల్లిదండ్రులు….. ఒడిశా నుంచి ఉపాధి కోసం పల్నాడు జిల్లాకు వచ్చారు. ప్రస్తుతం బాలుడ్ని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.