విమర్శలే రానీ..
ప్రపంచం ఏమైనా అనుకోనీ..
కొందరు ఎదురే తిరగనీ..
నప్పని వారు..నచ్చని వారు..
మెచ్చని వారు
పనిమాలా వేలెత్తి చూపనీ..
దెప్పి పొడవనీ
ఆమె అమ్మ..
కరుణా సముద్ర..
భరత భూమిలో*
ఆమెది ప్రత్యేక ముద్ర..!
ఎక్కడ పుట్టింది..
ఎక్కడికి చేరింది..
ఈలోగా ఎన్ని పోరాటాలు..
ఎన్నెన్ని ఆరటాలు..
ఆమె అంతరంగంలో
ఆలోచనల కెరటాలు..
సాగరాలు దాటి..
తీరాలు అధిగమించి..
తన మజిలీ
ఈ కర్మభూమి అని
ఈ గడ్డపై ప్రతి అభాగ్యుడు
తన బిడ్డయని తలపోసి
తన సేవాసంస్థలకు
ఇక్కడే నారు పోసి నీరు పోసి
ఎందరికో ప్రాణం పోసి
భరతజాతి రత్నమై
భారతరత్నమై..
ఆణిముత్యమై..
సేవకు సత్యమై..
_మంచికి నిత్యమై..
ప్రపంచంలోనే హైలేసా..
మన మదర్ థెరీసా..
ఎక్కడ కష్టం ఉందో..
ఏ వాకిలిలో ఆకలి ఉందో..
రోగమే యోగమై
నిలిచి ఉందో
అవసరం ఏదైనా కానీ
తన అవసరం ఉంది
అనుకున్న చోట
ఆమె నడిచిన బాట…
అక్కడ ప్రేమామృతాల ఊట!
నింగీ నేలా తానై..
గాలి వెలుగు తనే అయి..
ప్రేమ ఆప్యాయత తన రూపై
ఎందరో అనాథలకు
తానే కంటి పాపై..
ఇలలో వెలసిన తల్లి
కొన్ని లక్షల కుటుంబాల
పాలి జాబిల్లి..!
సేవ ఆమె ఊపిరి..
తృప్తి తన సిరి..
ఎన్ని జీవితాల్లో
దీపాలు వెలిగించిందో..!
ఆమె రూపం
దేవతకు ప్రతిరూపం..
ముడతలు పడిన
ఆ మోము_
దేదీప్యమానంగా
వెలిగే జ్యోతి..
ఒకరికి సేవ చేస్తే
ఆమె కళ్ళల్లో మెరిసే కాంతి..
పొడుగాటి ఆ వేళ్ళు..
అనురాగానికి ఆనవాళ్లు..
వాటి స్పర్శ_
ఊరట..బాసట..
నమ్మకం..ధైర్యం..!
ఆమె పలకరిపు
జీవితంపై ఆశ
ఆమె సన్నిధి_
ఆగిపోని శ్వాస..
మెగ్గేసే అయినా..
నోబులైనా
ఆమెను వరించి_
తము తరించాయి..
ఆమె చేతి గీతలై పులకించాయి..!
మరణించాక ఆమెకు
లభించిందేమో
బీటిఫికేషన్ ఘనత..
జీవించి ఉండగానే
ఆ తల్లి_
మానవత వర్షిస్తూ
ఈ పుణ్యభూమిలో* *నడయాడిన*
మరో భరతమాత!
అమ్మకి ప్రమాణాలతో..
సురేష్ కుమార్ ఎలిశెట్టి
9948546286