హైదరాబాద్: 2019-2024 మధ్య జరిగిన సహకారాన్ని కొనసాగిస్తూ, తెలంగాణలో డేటా ఆధారిత పాలనను బలోపేతం చేయడం మరియు ప్రజా పాలన వ్యయాల పనితీరును మెరుగుపరచడంలో భాగంగా ఈరోజు రాష్ట్ర సచివాయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమక్షంలో రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక శాఖ అధికారులు, సిఇజిఐఎస్ ఫౌండేషన్ తో రాబోయే ఐదు సంవత్సరాలకు గాను అవగాహన ఒప్పందాన్ని పునరుద్ధరించారు.
ఈ సమావేశం సోమవారం రాష్ట్ర సచివాలయంలోని ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు, ప్రణాళికా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, సెంటర్ ఫర్ ఎఫెక్టివ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రొఫెసర్ కార్తీక్ మురళీధరన్, ప్రాజెక్టు డైరెక్టర్ హరినారాయన్, ప్లానింగ్ డైరెక్టర్ ఓం ప్రకాష్ లు అవగాహన ఒప్పందం పై సంతకాలు చేశారు.
సిఇజిఐఎస్ ప్రాథమికంగా రాష్ట్ర ఆదాయం పెంచడంలో విశ్లేషణాత్మక మద్దతు అందిస్తుంది. అంతేకాకుండా, సిఇజిఐఎస్ విద్యుత్ వినియోగ సమర్థతను విశ్లేషించడంలో కూడా ప్రభుత్వానికి మద్దతు ఇవ్వనుంది, దీనిలో భాగంగా సరఫరా వ్యయాన్ని తగ్గించడం, పవర్ పర్చేస్ అగ్రిమెంట్ల సమర్థతను పెంచడం, చివరి వినియోగదారుల కోసం సమర్థవంతమైన విద్యుత్ వినియోగం అందించదానికి తోడ్పడనుంది.
2019 నుండి, సిఇజిఐఎస్ ఫౌండేషన్ తెలంగాణ ప్రభుత్వ ప్లానింగ్ మరియు ఆర్థిక విభాగాలతో పాటు విద్య, మహిళాభివృద్ధి మరియు శిశుసంక్షేమం, వ్యవసాయం తదితర విభాగాలతో కలిసి, పాలన పరిష్కారాలను రూపొందించి, సమర్థవంతమైన పాలనను బలోపేతం చేయడంలో సహకరించింది.
సిఇజిఐఎస్ ఫౌండేషన్ ప్రస్తుతం తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, అస్సాం ప్రభుత్వాలతో మరియు కొన్ని భారత ప్రభుత్వ సంస్థలతో సహకరించి పెద్దఎత్తున పాలన సంస్కరణలను తీసుకురావడంలో సహాయపడుతోంది. ఈ క్రమంలో రాబోయే ఐదు సంవత్సరాలు సంయుక్తంగా పనిచేయాలని ఆర్థిక ప్రణాళిక శాఖ అధికారులు CEGIS బృందం సభ్యుల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.