మునుగోడు పోటీ ఆ ఇద్దరి మధ్యనే!

72

– ప్రచారంలో టీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ పోటాపోటీ
– ధనబలంలో టీఆర్‌ఎస్‌-బీజేపీ ‘ఢీ’
– కాంగ్రెస్‌కు మహిళా సెంటిమెంట్‌
– కారుకు కలసివస్తున్న పథకాలు
– కలసొచ్చిన కమ్యూనిస్టుల మద్దతు
– గ్రామాల్లో మంత్రుల మోహరింపు
– ధనప్రవాహంలో వెనుకబడ్డ స్రవంతి
– అయినా ‘పాల్వాయి’ పేరుతో జనంలోకి
– రేవంత్‌ ప్రచారంతో కాంగ్రెస్‌లో జోష్‌
– బీజేపీలో జారిపోతున్న నాయకులు
– కారెక్కుతున్న కోమటిరెడ్డి అనుచరులు
– కోమటిరెడ్డి వెంట రాని పాత కాంగ్రెస్‌ నేతలు
– మునుగోడులో కనిపించని బీజేపీ బలం
– కోమటిరెడ్డి సొంత ఇమేజీ పైనే ఆధారం
( మార్తి సుబ్రహ్మణ్యం)

munugodu-picమునుగోడు ఉప ఎన్నిక పేరుకు త్రిముఖపోరు అయినప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం టీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ మధ్యే పోటీ కేంద్రీకృతమయినట్లు కనిపిస్తోంది. ప్రతిష్ఠాత్మకంగా మారిన ఈ పోరులో జాతీయ పార్టీ అయిన బీజేపీ ఉన్నప్పటికీ, అది పార్టీ అభ్యర్ధి కోమటిరెడ్డి సొంత ఇమేజ్‌పైనే ఎదురీదుతున్న పరిస్థితి. కారణం.. మునుగోడులో మొదటి నుంచీ బీజేపీ సంస్థాగతంగా బలహీనంగా ఉండటమే. నియోజకవర్గంలోని 7 మండలాలలో ఇప్పటివరకూ జరిగిన ఎన్నిక ప్రచారం పరిశీలిస్తే.. టీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ పోటాపోటీగా సాగుతున్నట్లు స్పష్టమవుతోంది.

ఉప ఎన్నిక ప్రచార సరళి, ధన ప్రవాహం, నేతల దూకుడు, వ్యూహాలు పరిశీలిస్తే అన్ని రంగాల్లో టీఆర్‌ఎస్‌ మిగిలిన రెండు పార్టీల కంటే దూసుకుపోతున్నట్లు కనిపిస్తోంది. కమ్యూనిస్టులు టీఆర్‌ఎస్‌కు తమ మద్దతున ప్రకటించిన తర్వాత టీఆర్‌ఎస్‌లో గెలుపు ధీమా రెట్టింపయింది. నాలుగుసార్లు మునుగోడులోKOOSUKUNTLAగెలిచిన సీపీఐ బలం ఇప్పుడు టీఆర్‌ఎస్‌ అభ్యర్ధికి కొండంత అండగా మారింది. అయితే, కొన్ని మండలాలలో కిందిస్థాయి కార్యకర్తలు, కాంగ్రెస్‌తో చెట్టపట్టాలేసుకుని తిరగడం కొంత ఆందోళనగా మారింది. టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వడాన్ని స్థానిక కమ్యూనిస్టులు జీర్ణించుకోలేపోతున్నారు. ఒకప్పుడు నక్సల్స్‌కు ఆయువుపట్టయిన మునుగోడులో, ఇప్పుడు ఆ భయం లేకపోవడంతో అందరు అభ్యర్ధులూ స్వేచ్ఛగా ఎన్నిక ప్రచారం చేసుకుంటున్నారు.

ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న టీఆర్‌ఎస్‌ నాయకత్వం, గ్రామాలవారీగా మంత్రులు-ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించింది. వీరంతా సూక్ష్మస్థాయిలో ప్రజల పల్సు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో భారీగా డబ్బు నీళ్లమాదిరి ఖర్చు చేస్తున్నారు. గ్రామాలకు అవసరమయ్యే పనులను సొంత ఖర్చులతో పూర్తి చేయించి, వారిలో విశ్వాసం నెలకొల్పే యత్నం చేస్తున్నారు. ప్రధానంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పథకాలు ఉప ఎన్నికలో అభ్యర్ధి విజయానికి దోహదపడనున్నాయి.

స్థానిక సమస్యలు అనేకం ఉన్నప్పటికీ.. పించన్లు, కల్యాణలక్ష్మి, రైతుబంధు వంటి పథకాలు తమకు అందుతున్నాయన్న ఓటర్ల మాటలు, టీఆర్‌ఎస్‌ అభ్యర్ధికి విజయంపై ధీమా పెంచేవే. టీఆర్‌ఎస్‌కు రెండుకళ్లయిన కేటీఆర్‌-హరీష్‌ ఇద్దరూ ప్రచార బాధ్యతను తలకెత్తుకున్నారు. అయితే టీఆర్‌ఎస్‌ మాజీ ఎంపి డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌ బీజేపీలోకి చేరడం టీఆర్‌ఎస్‌కు షాక్‌ కలిగించే అంశమే. బీసీ నేతగా పేరున్న నరసయ్యగౌడ్‌ చేరిక, బీజేపీకి నైతికంగా కలసివచ్చే అంశమే.

ప్రధానంగా బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అనుచరులను.. టీఆర్‌ఎస్‌లోకి తెచ్చేందుకు కేటీఆర్‌ వ్యూహాలు సక్సెస్‌ అవుతుండటం, కోమటిరెడ్డికి ఆందోళన కలిగించే అంశమే. దానితో తన అనుచరులనుKomatireddy ప్రలోభపెట్టి టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నారని కోమటిరెడ్డి బహిరంగంగానే వాపోతున్న పరిస్థితి. కోమటిరెడ్డి వెంట ఉన్న ఎంపీటీసీ, కౌన్సిలర్లు, ఇతర నియోజకవర్గ-గ్రామ-మండల స్థాయి నేతలు వరస పెట్టి కారు ఎక్కుతుండటం, బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డిని కలవరపెడుతోంది. ముఖ్యంగా ఆయన వేలకోట్ల కాంట్రాక్టుల కోసమే బీజేపీలో చేరారంటూ.. టీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ చేస్తున్న ప్రచారాన్ని కోమటిరెడ్డితోపాటు, బీజేపీ నేతలు సమర్ధవంతంగా తిప్పికొట్టలేకపోతున్నారు. దానితో అది నిజమని చర్చించుకునే పరిస్థితి కనిపిస్తోంది.

ఇక కాంగ్రెస్‌ అభ్యర్ధి స్రవంతి ప్రచారంలో టీఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇస్తున్నారు. పెద్దగా ఆర్ధిక వనరులు లేకపోయినా, ఆమె క్యాడర్‌నే నమ్ముకున్నారు. గ్రామాల్లో పాతతరం కాంగ్రెస్‌ నాయకులే ఆమెకు దన్నుగా నిలిచారు. పాల్వాయి గోవర్దన్‌రెడ్డి కుటుంబంతో సాన్నిహిత్యం ఉన్న కుటుంబాలు, ఆమె కోసంpalvai-sravanthi-reddy పనిచేస్తున్నాయి. కాంగ్రెస్‌ నుంచి కొంతమంది కింది స్థాయి ప్రజాప్రతినిధులను టీఆర్‌ఎస్‌ లాగేసుకున్నా, క్యాడర్‌ బలంగా ఉండటంతో పెద్దగా నష్టం కనిపించడం లేదు. పైగా, సీనియర్‌ నేత జానారెడ్డి మునుగోడులో కాంగ్రెస్‌ ఎన్ని వ్యూహకర్తగా ఉండటం ఆమెకు లాభిస్తోంది. పాతతరం నేతలను పిలిచి జానారెడ్డి మాట్లాడుతున్న తీరు, కాంగ్రెస్‌ అభ్యర్ధిలో విజయోత్సాహం నింపుతోంది. ప్రధానంగా పోటీలో మహిళ ఆమె ఒక్కరే ఉండటం కూడా కొంత కలసివస్తోంది. మహిళల సెంటిమెంట్‌ కొంతమేరకు కనిపిస్తోంది. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ప్రచారం, పార్టీ అభ్యర్దికి నైతికబలం పెంచేదే. రేవంత్‌ ప్రచారంతో కాంగ్రెస్‌ క్యాడర్‌లో కూడా జోష్‌ స్పష్టంగా కనిపిస్తోంది. అయితే టీఆర్‌ఎస్‌-బీజేపీ అభ్యర్ధులతో పోలిస్తే, అర్ధబలంలో ఆమె చాలా వెనుకబడి ఉండటం కొంత మైనస్‌పాయింట్‌గా మారింది. ఆ రెండు పార్టీల ధనప్రవాహం ముందు కాంగ్రెస్‌ తేలిపోతున్నట్లు కనిపిస్తోంది.

ఉప ఎన్నిక ప్రచారంలో కోమటిరెడ్డి స్పీడు- టీఆర్‌ఎస్‌కు పోటీగా డబ్బు ఖర్చు చేస్తున్నప్పటికీ, మునుగోడు నియోజకవర్గంలో బీజేపీకి స్వతహాగా బలం లేకపోవడం ఆయనకు మైనస్‌పాయింట్‌గా మారింది. ఉప ఎన్నిక విజయం కేవలం కోమటిరెడ్డి సొంత గ్లామర్‌, సొంత బలంపైనే ఆధారపడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. దానికితోడు కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు, కోమటిరెడ్డి వెంట తిరిగిన పాత కాంగ్రెస్‌ నేతలెవరూ ఇప్పుడు వెంటలేకపోవడం, మరో మైనస్‌పాయింట్‌. బండి సంజయ్‌, డాక్టర్‌ లక్ష్మణ్‌, రఘునందన్‌రావు వంటి బీజేపీ అగ్రనేతలు ప్రచారబరిలో ఉన్నప్పటికీ, స్థానికంగా బీజేపీకి కార్యకర్తలు లేకపోవడం పెద్ద లోటుగానే భావిస్తున్నారు.

కేవలం కాంట్రాక్టుల కోసమే బీజేపీలో చేరారంటూ.. కోమటిరెడ్డిపై టీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ చేస్తున్న ఆరోపణలను, సమర్ధవంతంగా తిప్పికొట్టడంలో బీజేపీ విఫలమవుతోంది. కోమటిరెడ్డి అహంకారం వల్లే ఉప ఎన్నిక వచ్చిందన్న కాంగ్రెస్‌ ప్రచారాన్ని కూడా, బీజేపీ తిప్పికొట్టలేకపోతోంది. కోమటిరెడ్డి మళ్లీ గెలిచినా ఉపయోగం లేదన్న భావన.. గ్రామాల్లో తీసుకువెళ్లడంలో టీఆర్‌ఎస్‌ సోషల్‌మీడియా బృందం సక్సెస్‌ అవుతున్నట్లు కనిపిస్తోంది. అయితే తాను గెలిస్తే ఏం చేస్తానన్న అంశంపై.. అటు కోమటిరెడ్డి కూడా ఇప్పటిదాకా స్పష్టత ఇవ్వకపోవడంతో, టీఆర్‌ఎస్‌ సోషల్‌మీడియా ప్రచారం నిజమని నమ్మే పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో నియోజకవర్గంలో గౌడ సామాజికవర్గ సంఖ్య ఎక్కువగా ఉన్నందున.. టీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ డాక్టర్‌ బూర నర్సయ్య గౌడ్‌ బీజేపీలో చేరితే, పార్టీకి కొంత ప్రయోజనం ఉండవచ్చని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు.