భూ బకాసురుల నుంచి పార్టీలకతీతంగా రాష్ట్రాన్ని రక్షించుకుందాం

– ఎంపీ రఘురామకృష్ణం రాజు

భూ బకాసురుల నుంచి పార్టీలకతీతంగా రాష్ట్రాన్ని రక్షించుకునే ప్రయత్నం చేద్దామని నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు పిలుపునిచ్చారు. ఈరోజు జనసేనకు కష్టం వచ్చిందని, గతంలో తనకు కష్టం వచ్చిందన్నారు. టీడీపీ కార్యకర్తలను ప్రతివారం  సిఐడి పోలీసులు తీసుకువెళ్లి కస్టడీలో నిర్బంధించి బాదు తున్నారన్నారు. అయితే, ప్రస్తుతం టిడిపి కార్యకర్తల పైనుంచి దృష్టి మరలచిన సిఐడి పోలీసులు, సోషల్ మీడియాలో చురుకుగా వ్యవహరిస్తున్న జనసైనికులపై దృష్టి సారించే అవకాశం ఉందన్నారు. ఇకపై జన సైనికులను టార్గెట్ చేసే అవకాశం లేకపోలేదని చెప్పారు .

తుఫాన్ హెచ్చరిక కేంద్రం మాదిరిగా, తాను సిఐడి హెచ్చరికను చేస్తున్నానని, జనసైనికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం క్లిష్ట పరిస్థితులలో ఉన్నదని తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు, ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రపతికి, కేంద్ర న్యాయ మంత్రిత్వ మంత్రిని కలిసి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని కోరుతూ వినతి పత్రాలను అందజేయాలని సూచించారు. రాజకీయ పార్టీల, సామాజిక కార్యకర్తలపై తప్పుడు కేసులను బనాయించి వేధిస్తున్న పోలీసు అధికారులపై చర్యలు తీసుకొని మెజిస్ట్రేట్ లపై మనము ఫిర్యాదులు చేసి, న్యాయ వ్యవస్థలను బాగు చేసుకోవలసిన అవసరం ఉందని అన్నారు. ప్రతిపక్షాలు ఐక్యంగా, ప్రజాస్వామ్య పరిరక్షణకు నడుం బిగించాలని సూచించిన రఘురామకృష్ణం రాజు, ఎన్నికలలోనూ, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూసుకోవాలన్నారు.

ప్రజలంటే ప్రేమ, గౌరవం ఉంటే, ప్రజలని భక్షించే వారి నుంచి రక్షించుకోవడానికి… ప్రజారక్షకులంతా ఒకటి కావలసిన అవసరం ఉందని అన్నారు. సోమవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… గత రెండు రోజులుగా విశాఖపట్నం ను పోలీసు రాజధానిగా మార్చారని మండిపడ్డారు. పోలీసులే విధ్వంసం సృష్టించి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలుసుకోవడానికి వచ్చిన ప్రజలను తరిమికొట్టారని విమర్శించారు. విశాఖపట్నంలో పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉందని, బుల్లి, బుల్లి సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించడానికి కూడా వీలులేదని పవన్ కళ్యాణ్ కు నోటీసు జారీ చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించడానికి విశాఖపట్నం చేరుకున్న పవన్ కళ్యాణ్ ను నోవాటెల్ హోటల్ కే పరిమితం చేసేందుకు పోలీసులు శతవిధాలా ప్రయత్నం చేశారని మండిపడ్డారు. అయితే, విశాఖ నగరంలో పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నప్పుడు విశాఖ గర్జన నిర్వహణకు ఎలా అనుమతి ఇచ్చారని పోలీసులను ప్రశ్నించిన ఆయన, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆ మినహాయింపు ఉంటుందని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేతలను రాష్ట్రంలో ఎక్కడ తిరగనివ్వవద్దనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి ఉన్న ఈపాటి జ్ఞానం, గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉండి ఉంటే… ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసి ఉండేవారా? అంటూ రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష నేతల చేపడుతున్న కార్యక్రమాలను అడ్డుకోవాలని కోవడం అవివేకమే అవుతుందన్నారు.

పవన్ గో బ్యాక్ అనడానికి వచ్చారట?
విశాఖపట్నం ప్రజలు విమానాశ్రయానికి, దారి పొడవునా, నోవాటెల్ హోటల్ వద్దకు పవన్ కళ్యాణ్ గో బ్యాక్ అని అనడానికి వచ్చారని సాక్షి దినపత్రిక వార్తా కథనాన్ని ప్రచురించడం హాస్యాస్పదంగా ఉందని రఘురామకృష్ణంరాజు అన్నారు. ఒకవేళ సాక్షి దినపత్రిక రాసిన కథనమే నిజమైతే… పవన్ గో బ్యాక్ అని అనడానికి రోడ్లపైకి వచ్చిన వారిపై కేసులు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ పై గో బ్యాక్ అని అనడానికి వచ్చిన ప్రజలు ఆయన పై దాడి చేస్తారని చెప్పి వెయ్యి మంది పోలీసులను రక్షణగా పెట్టారా? అంటూ నిలదీశారు.

తమపై హత్యాయత్నం చేసేందుకు ప్రయత్నించారని మంత్రి రోజా రెడ్డి పేర్కొనడం విడ్డూరంగా ఉందన్న ఆయన, పవన్ కళ్యాణ్ గో బ్యాక్ అని నినదించడానికి వచ్చిన ప్రజలు, రోజాపై ఎందుకు దాడి చేస్తారని ప్రశ్నించారు. అంటేరోజా అయిన తప్పు చెప్పి ఉండాలని, లేదంటే సాక్షి దినపత్రిక కథనం అయినా తప్పై ఉండాలని అన్నారు. సాక్షి దినపత్రిక కథనాన్ని చూసి విశాఖవాసులే గందరగోళానికి గురవుతున్నారని రఘురామ కృష్ణంరాజు అన్నారు. తాము పవన్ కు మద్దతుగా వెళ్ళామా?, వ్యతిరేకంగా రోడ్డుపైకి వెళ్ళామా?? అంటూ డైలమాలో ఉన్నారని చెప్పారు.

ప్రతిపక్ష నాయకుడిగా ఒక పార్టీ అధినేతకు రక్షణ ఇవ్వగలిగితే ఇవ్వాలన్నారు. అంతేకానీ పోలీసు వ్యవస్థ ద్వారా అడ్డుకోవాలని చూస్తే ప్రజలు హర్షించరన్నారు. పవన్ కళ్యాణ్ కు రాష్ట్రమంతా రక్షకులు ఉన్నారని పేర్కొన్న ఆయన, పవన్ అభిమానులే ఆయనకు రక్షణ కవచం అని పేర్కొన్నారు. విశాఖలో పవన్ పర్యటన సందర్భంగా 26 మంది పై ఐపీసీ సెక్షన్ 307 కింద కేసులు బుక్ చేయడం తో, మెజిస్ట్రేట్ కు చిరాకు అనిపించినట్లు ఉందన్నారు. ఐపీసీ 307, 326 కింద కేసులు బుక్ చేయగా, ఇప్పుడు 9 మంది కేసులు నిలిచాయని , అందులో జనసేన కార్పోరేటర్ మూర్తి యాదవ్ ఒకరిని పేర్కొన్నారు. ఇటీవల మూర్తి యాదవ్ రుషికొండ ప్రకృతి విధ్వంసం పై, హయాగ్రీవ, దస పల్లా భూముల అక్రమాల పై గట్టిగా పోరాడుతున్నారని చెప్పారు. అందుకే మూర్తి యాదవ్ ను ఓ 14 రోజులపాటు జైల్లో ఉంచేందుకు ఆయనపై తప్పుడు కేసులు నమోదు చేసినట్లుగా తెలుస్తోందన్నారు.

ప్రాథమిక హక్కులను ఉల్లంఘించవద్దు
పోలీసులు తప్పుడు కేసులను బనాయించి, ప్రాథమిక హక్కులను ఉల్లంఘించవద్దంటూ రఘురామకృష్ణంరాజు హితవు పలికారు. ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే వ్యర్థ ప్రయత్నాలను మానుకోవాలని సూచించారు. ఇక విశాఖ గర్జన సభలో మంత్రి రోజా మాట్లాడుతూ… నటన నేర్చుకోవడానికి విశాఖ కావాలి… వివాహం చేసుకోవడానికి విశాఖ అమ్మాయి కావాలి, కానీ పవన్ కళ్యాణ్ కు విశాఖ రాజధానిగా వద్దట అంటూ చేసిన వ్యాఖ్యలు విస్మయాన్ని కలిగించాయన్నారు. ఇంకొక మరొక మూర్ఖపు మంత్రి మాట్లాడుతూ… మా విధానం మూడు రాజధానులయితే… పవన్ కళ్యాణ్ విధానం మూడు వివాహాలు అంటూ చేసిన వ్యాఖ్యలపై రఘురామకృష్ణంరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పవన్ కళ్యాణ్ నాలుగు వివాహాలు చేసుకుంటే, నాలుగు రాజధానులను ఏర్పాటు చేస్తారా?, ఇవేమీ పైత్యపు మాటలు అంటూ మండిపడ్డారు. మంత్రులు నోటికొచ్చినట్లు మాట్లాడితే, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అభిమానులు ఉన్నట్లుగానే, పవన్ కళ్యాణ్ కు కూడా అభిమానులు ఉంటారన్నారు. జగన్మోహన్ రెడ్డి అభిమానుల కంటే పవన్ కళ్యాణ్ అభిమానులు ఘాటుగానే స్పందిస్తారన్నారు. సినీ కథానాయకుల అభిమానులు కాసింత వైలెంట్ గానే వ్యవహరిస్తారని పేర్కొన్నారు. రాజకీయ నాయకుల కంటే, సినీ కథా నాయకులకే ఎక్కువమంది అభిమానులు ఉంటారన్నారు.

విశాఖ గర్జన అట్టర్ ఫ్లాప్… మంత్రి బొత్సను అభినందించాల్సిందే
తమ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విశాఖ గర్జన సభ అట్టర్ ఫ్లాప్ అయిందని, 5000 మందికి మించి ప్రజలు ఈ సభకు హాజరు కాలేదని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఈ సభకు హాజరైన జనాలను చూసి ఇకనైనా బుద్ధి కోవాలంటూ చేసిన వ్యాఖ్యలను అభినందించి తీరాల్సిందేనని అన్నారు.

మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా ధర్మంగానే ఉన్నారని, మంత్రి పదవి కావాలా?, విశాఖ రాజధాని కావాలా?? అని అడిగితే… తాను విశాఖ రాజధానిని కోరుకుంటానని పేర్కొన్నారని గుర్తు చేశారు.మాజీ సైనికులకు చెందిన 77 ఎకరాల భూములను ధర్మాన కుటుంబం, కోరమండల్ సంస్థ తరుపున ఆయన ఇచ్చిన జీవో ప్రకారమే కొనుగోలు చేసినట్లు రాసుకున్నారన్నారు . విశాఖలో తనకు భూములు ఉన్నాయి కాబట్టి… విశాఖ నే రాజధానిగా కోరుకుంటున్నానని చెప్పగలిగిన ధర్మాన ప్రసాదరావును అభినందనలకు అర్హుడేనని అపహాస్యం చేశారు. ఉత్తరాంధ్రలో తమ పార్టీ పరిస్థితి కొడిగట్టిన దీపంలా ఉందని, పవన్ కళ్యాణ్ జోలికి వెళ్ళవద్దని సూచించారు.

భావోద్వేగాలతో ఎటువంటి దాడులు చేసిన తప్పు కాదని గతంలో మీరే చెప్పారని, మాజీ డిజిపి సవాంగ్ సైతం ఇదే విషయాన్ని చెప్పారని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో, జన సైనికులు దాడులకు దిగితే మీరే బాధ్యులవుతారని రఘురామకృష్ణంరాజు హెచ్చరించారు. ప్రతిపక్ష నాయకులకు కనీస గౌరవం ఇస్తే కొద్ది శాతం మంది ప్రజలైన మనల్ని గౌరవిస్తారని అన్నారు. పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి ప్రభుత్వం సహకరించాలని సూచించారు.

నీ అల్లుడు కంపెనీ అని చెప్పడానికి కుదరదు
అరబిందో ఫార్మా లిస్టెడ్ కంపెనీ అని దాన్ని నీ అల్లుడు కంపెనీ అని చెప్పడానికి కుదరదని రాజ్యసభ సభ్యుడు, ప్రాంతీయ పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయి రెడ్డికి రఘురామకృష్ణంరాజు హితవు పలికారు. అయినా నీ అల్లుడు భూములను అరబిందో ఫార్మా పేరిట కొనుగోలు చేయలేదని అన్నారు. విశాఖలో భూముల బహిరంగ మార్కెట్ ధర ఎంతో… మీ అల్లుడు, కూతురు కొనుగోలు చేసింది ఎంత కో వివరాలతో సహా ప్రముఖ దినపత్రికలలో వార్తా కథనాలు ప్రచురించడం జరిగిందన్నారు. ఎన్సీసీ భూములను కేటాయించగా, వారే వెనక్కి ఇచ్చేశారన్న రఘురామకృష్ణంరాజు , ఇప్పుడు ఆ భూములకు సంబంధించి పేపరు మీద ఉన్నది ఎవరు?, వెనక ఉన్నది ఎవరంటూ ప్రశ్నించారు.

ఎంపీ అగర్వాల్ కు భూములు కేటాయించారని , నిబంధనలను పాటించలేదని, వేరే నిబంధనలను పాటిస్తూ ఇప్పుడు ఆ భూములను అభివృద్ధి చేస్తున్నది ఎవరని నిలదీశారు. ఆ భూముల అభివృద్ధి వెనక ఉన్నది ఎవరన్నది విశాఖ ప్రజలు అధ్యయనం చేయాలని సూచించారు. తమ పార్టీ వాళ్లు విశాఖపట్నం రాజధానిగా ఎందుకు కోరుకుంటున్నారో, దీన్ని బట్టి స్పష్టం అవుతుందని అన్నారు. దీన్ని ఇన్ సైడర్ ట్రేడింగ్ అని అనకపోతే మరేం అంటారని ప్రశ్నించారు.

విశాఖ భూ బకాసురులు ఎవరు?
రామానాయుడు స్టూడియో వద్ద 30 ఎకరాల భూములను అడిగి, 20 ఎకరాలు తీసుకున్నట్లు తెలుస్తోందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఫెమా సెంటర్ వద్ద భూములు కొనుగోలు పారిశ్రామికవేత్త ఎవరని ప్రశ్నించిన ఆయన, విశాఖలో భూములు కొట్టేసిన భూ బకాసురులు ఎవరంటూ నిలదీశారు. ఎవరైతే రాజధాని కావాలని తెర వెనుక నుండి నడిపిస్తున్నారో, రాజధాని పెద్దలుగా మాట్లాడుతున్నారో, వారే విశాఖ భూములను కొట్టేసి, బలవంతంగా లాక్కున్నారన్నారు. అమరావతిలో చిన్న చిన్న రైతులకు అన్యాయం జరిగిందని అంటే, విశాఖలో భూములు కొట్టేసిన మా సంగతి ఏమిటంటూ వారు ప్రశ్నిస్తున్నారని అన్నారు. ఇక్కడ మాకు అన్యాయం జరిగితే మాకు దిక్కేవరని ప్రశ్నిస్తున్నారని చెప్పారు.

విశాఖలో రిహాబిలిటేషన్ సెంటర్, రామానాయుడు స్టూడియో వద్ద భూములను, హయాగ్రీవా ఫామ్స్, దసపల్లా భూములను కొట్టేసినవారు… తమకు అన్యాయం జరిగితే, రేపు తాము కూడా అమరావతి రైతుల మాదిరిగా పాదయాత్ర చేయాలా? అంటూ ప్రశ్నిస్తున్నారని అన్నారు. విశాఖను రాజధానిగా చేయాలని వీళ్లు ఎందుకు కోరుకుంటున్నారో, ప్రజలకు ఇప్పటికే అర్థం అయ్యిందని… ఈ దొంగల కోసం మనం పోరాటం చేయడమేమిటంటూ వారు తమలో తామే ప్రశ్నించుకుంటున్నారని చెప్పారు. రాజధాని రాకముందే తమ ఆస్తులను కొట్టేశారని, రేపు రాజధాని వస్తే తమని ప్రశాంతంగా బతకనిస్తారా అంటూ ఆందోళన చెందుతున్నారని అన్నారు. విశాఖలో తమకు మిగిలిన ఆస్తులను కాపాడుకునే ప్రయత్నాన్ని స్థానికులు చేస్తున్నారని పేర్కొన్న రఘురామకృష్ణం రాజు, రాజధాని అంటూ వస్తే, తమని ఇళ్లల్లో నుంచి తరిమి వేస్తారని విశాఖ ప్రజలు అనుమాన పడుతున్నారని అన్నారు. అవును… మీ అనుమానం నిజమే, అందుకే విశాఖ నగరాన్ని ఈ భూ బకాసురుల నుంచి రక్షించుకునేందుకు ” సేవ్ విశాఖపట్నం” ఉద్యమాన్ని చేద్దామన్నారు.

బొత్స వ్యాఖ్యలు విడ్డూరం
రాజధాని నగర ఏర్పాటు కోసం సీ పోర్టు ఉండాలని సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉందని రఘురామ కృష్ణంరాజు అన్నారు. దేశ రాజధాని ఢిల్లీకి సీ పోర్టు ఎక్కడ ఉందని ప్రశ్నించారు. గతంలో ఎంపీగా పనిచేసిన బొత్స సత్యనారాయణ కు ఈ విషయం బాగానే తెలుసునని ఎద్దేవా చేశారు. అమరావతిలో భూమి, నీరు పుష్కలంగా ఉన్నాయని, ప్రాంతాల మధ్య విద్వేషం రెచ్చగొట్టడం ఇష్టం లేదు కాబట్టే రాజధానిగా అమరావతిని అంగీకరిస్తున్నానని గతంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుతం ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించిన విషయాన్ని ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు గుర్తు చేశారు.

ముఖ్యమంత్రి గతంలో సిపిఎస్ రద్దు అని ఇచ్చిన హామీ మాదిరిగా, రాజధానిపై కూడా తెలియక మాట్లాడారని బొత్స సత్యనారాయణ అనుకుంటున్నారా? అంటూ ఎద్దేవా చేశారు. ఇక రాజధాని నగరంలో విమానాశ్రయం ఉండాలన్న బొత్స వాదన సహేతుకం కాదని అన్నారు. 20 కిలోమీటర్ ల దూరం లో ఉన్న గన్నవరం విమానాశ్రయం దూరమేమీ కాదన్నారు. అమరావతి భౌగోళికంగా రాష్ట్ర ప్రజలందరికీ అందుబాటులో ఉంటుందని చెప్పారు. విశాఖలో సచివాలయం, కర్నూలులో న్యాయ స్థానం ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయా?అంటూ ప్రశ్నించారు.

ఇదే విషయంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తే పాల్గొనడానికి తాను సిద్ధ మేనన్న ఆయన, ముఖ్యమంత్రి కూడా హాజరయ్యేలా చూసుకోవాలని అన్నారు. ఇక దక్షిణాఫ్రికా దేశ మోడల్ తీసుకుని వచ్చి, రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని చెప్పడం అవివేకమేనని విమర్శించారు. వాళ్ళు మూడు ప్రాంతాలను కలిపి వారి పాత రాజధాని నగరాలను మూడు రాజధానుల గా ఏర్పాటు చేసుకున్నారు. విడిపోకుండా ఉండడానికి మూడు రాజధానులు అనటం నవ్వొస్తుంది అన్నారు

 

Leave a Reply