– 151 సీట్లు పాయే.. ఫ్రస్ట్రేషన్‌లో జగన్ బుర్ర పాయే
– జగన్ నెత్తిన 31 క్రిమినల్ కేసులు!
– ఆర్థిక ఉగ్రవాదైన జగన్ రెడ్డి ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడడం విడ్డూరం
– ఐదేళ్ల విధ్వంసకర పాలన
– గాడిలో పెడుతున్న కూటమి సర్కారు
– వైసీపీ పాలనలో సుమారు రూ.9.72 లక్షల కోట్లు అప్పులు
– విలేఖర్ల సమావేశంలో శాసన మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ
మంగళగిరి: రాష్ట్ర ఆర్థిక రంగాన్ని ఛిన్నాభిన్నం చేసి, అన్ని వ్యవస్థలను పాతాళంలోకి నెట్టేసిన జగన్ రెడ్డి నేడు కూటమి ప్రభుత్వం విషం చిమ్మడం విడ్డూరంగా ఉందని శాసన మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ విమర్శించారు. చెప్పిన అబద్ధాన్నే మళ్ళీ మళ్ళీ చెప్పడం, అబద్ధాలను నిజాలుగా చిత్రీకరించడంలో జగన్ రెడ్డి ఆరితేరారని ఆమె మండిపడ్డారు.
గురువారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జగన్ రెడ్డిలాంటి నిజమైన చంద్రముఖిని తరిమేయడానికి ప్రజలు రజినీకాంత్‌లా తయారై తరిమికొట్టారన్నారు. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని సంబోధించిన తీరు జగన్ రెడ్డి సంస్కారహీనుడనడానికి అద్దం పడుతున్నాయి.
చంద్రముఖిలా ప్రవర్తించి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసిన అసలు చంద్రముఖి జగన్ రెడ్డి. నీ చంద్రముఖి ప్రవర్తనను చూసి రాష్ట్రంలోని ప్రతి ఓటరు రజనీకాంత్ అయ్యి నీ మాడు పగులగొట్టారు. చంద్రబాబుని ఏకవచనంతో జగన్ రెడ్డి సంబోధించడాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆర్థిక ఉగ్రవాదైన జగన్ రెడ్డి ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడడం విడ్డూరం. లక్షల కోట్లు లూటీలు చేసి, 31 క్రిమినల్ కేసులు నెత్తి మీద పెట్టుకొని, ప్రజలు సమాధానం చెప్పలేక పారిపోయిన వ్యక్తి విలువలు, విశ్వనీయత, విధ్వంసాల గురించి జగన్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
ప్రజలను మరోసారి మోసం చేసేందుకు గంటలపాటు జగన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై పచ్చి అబద్ధాలాడాడు. మీడియాని దొంగలముఠా అంటూ కొన్ని ఛానెళ్లపై జగన్ రెడ్డి విరుచుకుపడ్డాడు. జగన్ రెడ్డి కన్నా మరో దొంగల ముఠా ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే లేదు. 90 శాతం ఆర్థిక నేరగాళ్లు, హత్యలు, మహిళలను మోసం చేసినోళ్లకు ఎంపీ, ఎమ్మెల్యేల సీట్లిచ్చిన మీరు దొంగల ముఠా అంటూ మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు.
జగన్ రెడ్డి విధ్వంసం చేసిన ప్రజా రాజధాని అమరావతి, ఉమ్మడి గోదావరి జిల్లాల జీవనాడి పోలవరాన్ని నేడు చంద్రబాబు చక్కదిద్దుతున్నారు. ఐదేళ్లలో జగన్ రెడ్డి యువతకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. నేడు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. అది 90 శాతం పూర్తి అవుతున్నట్టు దావోస్ పర్యటనతో తేలిపోయింది. రూ.4 వేల సామాజిక పెన్షన్, వికలాంగులకు రూ.6 వేలు, మంచంపై నుంచి లేవలేని స్థితిలో ఉన్నవారికి రూ.15 వేలు పెన్షన్ అందించి దాదాపు 64 లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపింది చంద్రబాబు. లేని చట్టాలను తీసుకువచ్చి రాష్ట్రంతో జగన్ రెడ్డి ఐదేళ్లు ఆడుకున్నారు. 30 వేల మంది ఆడపిల్లలు ఏమయ్యారో తెలియలేదు.
రాష్ట్రాన్ని గంజాయికి అడ్డాగా జగన్ రెడ్డి మార్చితే నేడు గంజాయి, డ్రగ్స్ పై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. విద్యా రంగాన్ని జగన్ రెడ్డి భ్రష్టు పట్టించారు. గాడిలో పెట్టేందుకు మంత్రి నారా లోకేష్ గారు అహర్నిశలు కష్టపడుతున్నారు. 80 శాతం విధానపరమైన నిర్ణయాలను తీసుకొని విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు బడుల్లో అనువైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారు.
విశాఖలోని రుషికొండపై సుమారు రూ.500 కోట్లు విలువైన విశాలవంతమైన భవనాన్ని కట్టుకున్నారు. ప్రజాధనాన్ని వృథా చేసిన జగన్ రెడ్డి నేడు ఉత్తముడిలా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు.
రాష్ట్ర అప్పుల గురించి ఆర్థిక ఉగ్రవాది కాకమ్మ కబుర్లు చెబుతున్నారు. ప్రెస్ మీట్ పెట్టేముందు అప్పులు గురించి పూర్తి అవగాహనతో పెట్టాలని సూచిస్తున్నా. నాడు జగన్ రెడ్డి ప్రభుత్వం పెట్టిన బకాయిలు కేవలం రూ.6.46 లక్షల కోట్లు మాత్రమే అని మా బడ్జెట్ చూపించామని జగన్ రెడ్డి చెప్తున్నాడు. కానీ రూ.1.40 లక్షల కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. బడ్జెట్ ఇతర అప్పులు రూ.2 లక్షల కోట్లకు పైగా ఉంది. ఇవన్నీ కలిపితే రూ.9.72 లక్షల కోట్లకు పైగా జగన్ రెడ్డి అప్పులు చేసినట్టు తేలింది. ఇన్ని అప్పులు చేసి ఒక్క రూపాయి కూడా రాష్ట్రానికి ఆదాయం రాకుండా చేసి నాశనం చేసిన ఆర్థిక విధ్వంసకరుడు జగన్ రెడ్డి అని విరుచుకుపడ్డాడు.
వైసీపీ కార్పొరేటర్లే మా పార్టీల్లోకి వచ్చేస్తామని బతిమిలాడుకుంటున్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 16 శాతం రిజర్వేషన్‌ను తీసేసి చోద్యం చూసే జగన్ రెడ్డి… నేడు మున్సిపల్ ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు. నేడు చట్టబద్ధంగా మున్సిపాలటీల్లో మేయర్లు, డిప్యూటీ మేయర్లను కార్పొరేటర్లు ఎన్నుకున్నారు. కానీ జగన్ రెడ్డి హయాంలో మున్సిపాలిటీలు, పంచాయతీ ఎన్నికల్లో జరిగినవి ఎలెక్షన్స్ కావు సెలక్షన్స్ అని పంచుమర్తి అనురాధ ఎద్దేవా చేశారు.