– సినిమా ఆపించి కుట్ర చేశాడు
– ‘ఇంద్రజిత్’ ను ఆరోజుల్లోనే రూ.45 లక్షలు ఖర్చుపెట్టి తీశా
– జిత్తులమారి వ్యక్తులు ఎత్తులు, పై ఎత్తులు వేయడంతో ఎంతో ఇబ్బంది పడ్డా
– సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకుండా ఆపించారు
– ‘ఆలీతో సరదాగా’ షోలో గిరిబాబు ఆవేదన
– వైరల్ అవుతున్న గిరిబాబు వీడియో
హైదరాబాద్: చిరంజీవికన్నా పరిశ్రమలోకి ముందుగా ప్రవేశించి మంచి పేరు తెచ్చుకున్నారు గిరిబాబు. హీరోగా, విలన్ గా, సహ నటుడిగా, హాస్యనటుడిగా అనేకరకాల పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు.
ఆలీ హోస్ట్ గా ప్రసారమవుతున్న ‘ఆలీతో సరదాగా’ షోలో పాల్గొన్న గిరిబాబు చిరంజీవి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కొడుకు హీరోగా గుర్తింపు తెచ్చుకోలేకపోవడానికి కుట్ర చేశారని ఆరోపించారు. గిరిబాబు కొడుకు రఘుబాబు ప్రస్తుతం హాస్యనటుడిగా పలు సినిమాలు చేస్తున్నారు. ఆయన మరో కొడుకు బోస్ బాబు హీరోగా ఇంద్రజిత్ సినిమాను గిరిబాబు తెరకెక్కించారు. ఆ విషయాలను వివరించారు.
రూ.45 లక్షలు ఖర్చుపెట్టి తీశా
తన కొడుక్కి చిన్నతనం నుంచి నటపై ఆసక్తి ఎక్కువ. మనిషి కూడా చూడటానికి బాగుంటాడు. దీంతో బోసుబాబును హీరోగా పరిచయం చేస్తూ కౌబాయ్ సినిమా ‘ఇంద్రజిత్’ ను ఆరోజుల్లోనే రూ.45 లక్షలు ఖర్చుపెట్టి తీశాను. దర్శకత్వం కూడా నేనే చేశాను. ఈ సినిమాలో సీనియర్ నటులు చాలామంది నటించారు. ట్రెజర్ హంట్ నేపథ్యంలో సినిమా సాగుతుంది. అయితే పరిశ్రమలో కొంతమంది జిత్తులవారి వ్యక్తులు ఎత్తులు, పై ఎత్తులు వేయడంతో ఎంతో ఇబ్బంది పడ్డాను. తాను తీసిన ‘ఇంద్రజిత్’ సినిమా విడుదలైన నెలరోజుల తర్వాత చిరంజీవి హీరోగా చేసిన ‘కొదమ సింహం’ సినిమా విడుదల కావాల్సి ఉంది. ఆ సినిమాలో కూడా చిరంజీవి కౌబాయ్ గా నటించారు.
సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకుండా ఆపించారు
‘ఇంద్రజిత్’ సినిమాకు హైదరాబాద్ లో సెన్సార్ జరిగింది. సెన్సార్ జరుగుతున్న సమయంలో వారు వచ్చి ‘ఇంద్రజిత్’ సినిమాను చూసి సర్టిఫికెట్ రాకుండా ఆపించారు. ‘ఇంద్రజిత్’ విడుదలైన నెలరోజుల తర్వాత విడుదల కావాల్సిన ‘కొదమ సింహం’ సినిమాను ముందుకు మార్చి విడుదల చేయగా అది అట్టర్ ఫ్లాప్ అయింది. ‘కొదమ సింహం’ ఫ్లాప్ కావడంతో మా సినిమాపై ఎఫెక్ట్ పడింది. అప్పటికే నేను భానుచందర్‌తో చేసిన ‘రణరంగం’ సినిమా సూపర్ హిట్ అయింది. దాంతో ‘ఇంద్రజిత్’ సినిమా కొనడానికి వచ్చిన బయ్యర్లు, చిరంజీవి సినిమా ముందుకి జరిపారని కొనుగోలు చేయలేదు.
అది ఫ్లాప్ అయిన తర్వాత తమ సినిమా కోసం బేరాలు సాగించారు. పెట్టిన పెట్టుబడి కన్నా చాలా తక్కువకు రూ.20లక్షలకే అమ్మాం. సినిమా సూపర్ హిట్ అయి కొన్నవారికి రూపాయికి రూపాయి లాభం తెచ్చిపెట్టింది. అయినా ‘ఇంద్రజిత్’ సినిమా ఫ్లాప్ అంటూ ప్రచారం చేయించారు. చిరంజీవిది ఫ్లాప్ అయి, తమది హిట్ అయితే బాగోదని అలా చేశారు.
పరిశ్రమలో పెద్దవారు చిన్నవారిని తొక్కడం అనేది ఆనవాయితీగా వస్తోంది. అయినా సినిమా ఫ్లాప్ అనే ప్రచారం రావడంతో రెండు మూడు సినిమాలు చేసి నటన వద్దన్నాడు. ప్రస్తుతం కొన్ని సీరియల్స్ లో నటిస్తున్నాడు అని గిరిబాబు చెప్పారు.