-
భారతరత్న అవార్డుకు ఎన్టీఆర్ అనర్హులా?
-
ఇప్పటివరకూ ప్రకటించిన వారికంటే ఎన్టీఆర్ అనామకులా?
-
ఎన్టీఆర్ తెలియని మొఖాలు ఎంపిక కమిటీలో ఉన్నాయా?
-
ఆంధ్రా-తెలంగాణను కేంద్రం అవమానించిందా?
-
తెలంగాణపై వివక్ష సమంజసమేనా?
-
కాంగ్రెస్ ఉంది కాబట్టే అవార్డులివ్వలేదా?
-
తెలుగు వెలుగులకు గుర్తింపు ఇదేనా?
-
అవార్డులలో రాజకీయ వాసనలపై విమర్శలు
( మార్తి సుబ్రహ్మణ్యం)
పద్మ అవార్డులు సిఫార్సు చేసే కమిటీలోని పెద్దలకు చరిత్ర తెలియదా? లేక చరిత్ర తెలియని వారిని కమిటీలో నియమించారా? వ్యక్తుల ఎంపికకు కమిటీలో కూర్చున్న మహానుభావులు ఎంచుకున్న ప్రాతిపదిక ఏమిటి? అవార్డుల ఎంపిక రాజకీయం కోణంలో జరిగిందా? లేక ఫలానా వారికి ఇస్తే భవిష్యత్తులో తమకు అక్కరకు వస్తారన్న ప్రతిఫలాపేక్షతో జరిగిందా? దేశ రాజకీయాలను మలుపు తిప్పి, మదరాసీగా తెలిసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలను, దేశానికి తెలుగువారిగా పరిచయం చేసిన దివంగత మహానేత నందమూరి తారకరామారావు ఎవరో.. కమిటీలో తిష్ఠవేసిన మహానుభావులకు తెలియదా? అవార్డులకు తెలంగాణ ప్రముఖులు అనర్హులా? కవులు, కళాకారులు, రచయిత, మేధావులు తెలంగాణలో చచ్చిపోయారనుకున్నారా? మీరు ఏ కళ్లజోడుతో ఎంపిక నిర్వహించారు?.. ఇదీ ఇప్పుడు పద్మ అవార్డుల ప్రకటన తర్వాత తెలుగువారిలో కట్టలు తెగిన ఆగ్రహం.
కేంద్రం ప్రకటించిన ‘పద్మా’లు, సగటు తెలుగువారిని పెద్దగా మెప్పించలేదన్నది సర్వత్రా వినిపిస్తున్న ఆవేదన. ప్రధానంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలుగును వెలిగించిన ఎన్టీఆర్ ఇప్పటిదాకా భారతరత్నకు నోచుకోకపోవడం విచారకరం. దాన్నిబట్టి అవార్డుల ఎంపికలో కూర్చున్న వారి స్థాయి, మేధస్సు, తెలివితేటలేమిటో సులభంగానే అర్ధమవుతుంది.
అసలు ఎన్టీఆర్ గురించి తెలియని మొహాలు కమిటీలో ఉంటే.. అవార్డుల ప్రకటన ఇంతకంటే భిన్నంగా ఎలా ఉంటుందన్న విమర్శలు, సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లువెత్తడంలో తప్పులేదు. ఆ విమర్శలకు కేంద్రం అర్హురాలే. ప్రకటనలో కొందరి ఎంపిక పరిశీలిస్తే.. ఇప్పటివరకూ తమకు చేసిన ఉపకారానికి ప్రతిఫలంగానో, భవిష్యత్తులో అక్కరకు వస్తారన్న ముందుచూపుతోనే వారిని ఎంపిక చేసినట్లుందన్న అనుమానాలను కొట్టివేయలేం.
ప్రధానంగా మరణించిన ఆ మహనీయులను గుర్తు పెట్టుకోవాలన్న సోయి, అటు పాలకులకూ లేకపోవడం విచారకరం. లేకపోతే వారిని ‘భారతరత్నా’లను చేసినందువల్ల, తమకు వచ్చే ఓట్లు-రాజకీయంగా వచ్చే లాభమూ లేదన్న రాజకీయ కోణమూ, ఒక కారణం కావచ్చన్నది మేధావుల ఉవాచ. తెలుగువారి ఖ్యాతిని విస్తరింపచేసిన ఎన్టీఆర్ కాకుండా, భారతరత్నకు మరెవరు అర్హులో తెలివికల ఎంపిక కమిటీనే సెలవివ్వాలి!
అఖిలభారత అన్నగా జగద్విఖ్యాతిగాంచిన నందమూరి తారకరామారావుకు, అవార్డుల కమిటీ ప్రతిసారీ అన్యాయం చేస్తోంది. ఈసారి కూడా దానిని కొనసాగించిందంతే! నిజానికి అన్నగారికి భారతరత్న అవార్డు ఎప్పుడో రావలసింది. ఆ మేరకు సీఎంగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, చాలాసార్లు కేంద్రాన్ని కోరినా ఫలితం శూన్యం. టీడీపీ కేంద్రాన్ని శాసించిన రోజుల్లో కూడా, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడికి అవార్డు దక్కకపోవడం అన్యాయమే కాదు. అన్యాయంన్నర!
మరి లోపం ఎక్కడ? ఎవరిది? ఎన్టీఆర్‌కు భారతరత్న ఇస్తే ఎవరికి లాభం? ఎవరికి నష్టం? ఆ అవార్డు ఎవరు అందుకుంటారన్న చచ్చు పుచ్చు ఇచ్చకాలను పక్కనబెడితే.. తెలుగువారి కీర్తిని దిగ్దిగంతాలకు చాటిన ఎన్టీఆర్ అనే ఒక చరిత్రకారుడికి, ఆ అవార్డు ఇవ్వకపోవడమంటే, తెలుగువారిని ఉత్తరాది రాజకీయులు అవమానించినట్లే లెక్క! టీడీపీ బలంపై ఆధారపడి మనుగడ సాగిస్తున్న ఎన్డీఏ సర్కారు.. అదే టీడీపీని పుట్టించిన అఖిల భారత అన్నకు, భారతరత్న అవార్డు ఇచ్చేందుకు చేతులురాకపోవడం బట్టి.. తెలుగుజాతి ఇంకా చేవచచ్చి, చైతన్యరహితంగా ఉన్నట్లు కనిపిస్తోందన్నది సగటు తెలుగువాడి భావన.
ఇక ఏపీకి అవార్డులిచ్చిన కేంద్రం, తెలంగాణపై సీతకన్నేసిందన్న తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విమర్శలు సహజం.. సమంజసమే. కవులు, కళాకారులు, రచయితలు, సామాజికవేత్తలకు కొదవలే ని తెలంగాణ గడ్డ చేసిన పాపమేమిటో అర్ధం కాదు. పోనీ అసలు తెలంగాణ సర్కారు ఎవరి పేర్లనూ సిఫారసు చేయలేదా అంటే, అదీ కాదు.
గద్దర్, చుక్కా రామయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయధీర్ తిరుమలరావుకు అవార్డులివ్వాలని రేవంత్ సర్కారు సిఫార్సు చేసినా, వాటిని కేంద్రం బుట్టదాఖలు చేసినట్లు కనిపిస్తూనే ఉంది. విద్యారంగంలో లబ్ధప్రతిష్ఠుడైన చుక్కా రామయ్య ఎవరో తెలియని మొఖాలు కమిటీలో ఉండటం విద్యావంతులు చేసుకున్న ఖర్మ. పోనీ పద్మాలు అందుకున్న వారిలో చాలామంది తెలుగువారిలో హైదరాబాద్‌లోనే ఉంటున్నప్పటికీ, వారి మూలాలన్నీ ఏపీవన్న చర్చను పరిగణనలోకి తీసుకోవలసిందే. అయితే వారిలో చాలామంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్‌లో నివసిస్తున్న వారన్నదీ విస్మరించకూడదు.
పోనీ చుక్కా రామయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయధీర్ తిరుమలరావు, గద్దర్ గురించి తెలంగాణ సమాజానికి తెలియదా అంటే, వారంతా ఆయా రంగాల్లో లబ్ధప్రతిష్ఠులే. గద్దర్‌కు వామపక్ష తీవ్రవాద నేపథ్యం ఉంది కాబట్టి, ఆయనకు అవార్డు ఇవ్వలేదంటే అర్ధం చేసుకోవచ్చు. రేవంత్ సర్కారు ఏదో ఆశించి ఆయన పేరిట సినిమా అవార్డులు పెడితే పెట్టి ఉండవచ్చు. సినిమాలతో ఎలాంటి సంబంధం లేని ఆయన పేరిట అవార్డులిచ్చి, ఎవరినో మెప్పించే ప్రయత్నం చేసి ఉండవచ్చు. కానీ బీజేపీ నాయకత్వంలోని కేంద్రం, ఆయనను వామపక్ష తీవ్రవాద మద్దతుదారుగానే చూసి ఉండటంలో తప్పులేదు. ఎవరి కోణం వారిది. ఆ కోణాన్ని తప్పు పట్టడానికి లేదు.
మరి మిగిలిన వారంతా తెలంగాణకే కాదు, యావత్ తెలుగువారందరికీ తెలిసిన ముఖాలే కదా? మరి కమిటీలో ఉన్న ఆ ముఖాలు వారినెందుకు గుర్తించలేదు? బహుశా తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఉండటమే దానికి కారణమనుకోవాలా? మరి అదే నిజమైతే మందకృష్ణకు అవార్డు ఎలా ఇచ్చారన్న ప్రశ్నలకు, సమాధానం ఇవ్వాల్సింది కమలదళాలే. గత ఎన్నికల్లో మంద కృష్ణ, బీజేపీకి బాజాప్తా భాజాపాకు మద్దతునిచ్చినందుకే అవార్డు ఇచ్చారా? అన్న ప్రశ్నలకూ కేంద్రమే సమాధానం ఇచ్చుకోవాలి.
దళిత నేత మందకృష్ణకు అవార్డు ఇచ్చిన కేంద్రం, బీసీ నేత ఆర్.కృష్ణయ్యకూ అదే చేత్తో అవార్డు ఇస్తే పోయేదికదా? ఆయనేం పాపం చేశారు? బీసీల కోసం చేస్తున్న ఉద్యమాలు సరిపోవా? బంతిలో వలపక్షం ఎందుకు? రేవంత్ సర్కారు సిఫార్సు చేసింది కాబట్టి, అర్హులను విస్మరించడం మంచిదికాదన్న మేధావుల ప్రశ్నలకు బదులిచ్చేదెవరు?