-దళితుడైన ప్రకాష్ పై తప్పుడు కేసులు బనాయించి ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయడం జగన్ రెడ్డి దుర్మార్గానికి నిదర్శనం
-మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు
తనకు రావాల్సిన బకాయిలపై నిరసన తెలిపినందుకు దళితుడైన ప్రకాష్ పై తప్పుడు కేసులు బనాయించి ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయడం జగన్ రెడ్డి దుర్మార్గానికి నిదర్శనమని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంగళవారం ఏర్పాటు చేసిన (జూమ్ కాల్) విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…కానిస్టేబుల్ ప్రకాష్ ను డిస్మిస్ చేయడం చాలా బాధాకరమన్నారు. దళితుడైనందుకు ప్రకాష్ మీద జగన్ రెడ్డి ప్రభుత్వం కక్షగట్టి ఉద్యోగం నుంచి తొలగించడం అప్రజాస్వామికం, అమానవీయం అన్నారు. ఈ విషయాన్ని ప్రధాన ప్రతిపక్షపార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం నుంచి న్యాయ బద్ధంగా రావాల్సిన బకాయిల గురించి ప్రశ్నించకూడదా? అతన్ని ఉద్యోగం నుంచి తొలగించడం క్షమార్హం కాదు.
ఇటువంటి ప్రభుత్వానికి సరైన సమయంలో ప్రజలే బుద్ది చెబుతారు. దళితుడుగా ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ వారికి రావాల్సిన బకాయిలు, పడుతున్న ఇబ్బందుల గురించి తెలియజెప్పడం తప్పా? బకాయిల సాధనకై నిరసన కార్యక్రమం చేపట్టాడమే అతను చేసిన నేరమా? ఇందుకు తట్టుకోలేని ప్రభుత్వం అతన్ని ఉద్యోగం నుంచి తొలగించే వరకు నిద్రపోలేదు. ఇలాంటి అమానవీయ చర్యలు దేశంలోని ఏ ప్రభుత్వం తీసుకోదు.
దళితుల ఓట్లను దండుకొని ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి దళితుల విషయంలో వ్యవహరిస్తున్న తీరు నోటితో పలకరించి నొసటితో వెక్కిరించినట్టుంది. ఎన్నికల ముందు కపట ప్రేమ ఒలకబోసి నేడు ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. లక్ష్మి అనే మహిళ వద్ద దళిత కానిస్టేబుల్ ప్రకాష్ డబ్బు తీసుకుని చంపడానికి ప్రయత్నించారని ప్రభుత్వం కేసు నమోదు చేసింది. అతనిని ఉద్యోగం నుంచి తప్పించేందుకు అనేక అభాండాలు మోపారు. నిజానికి లక్ష్మీ అనే మహిళ దళిత కానిస్టేబుల్ ప్రకాష్ పై ఏ ఫిర్యాదు చేయలేదు. వారంతకువారే సుమోటోగా తీసుకొని అతన్ని దండించడానికి పన్నాగం పన్ని కక్షపూరితంగా వ్యవహరించడం ప్రభుత్వం సిగ్గుమాలిన చర్యే.
అదే జిల్లాలో ఎంపీ మాధవ్ న్యూడ్ వీడియో కాల్ మాట్లాడి మహిళలని వేధించిన సంఘటనను ప్రజలందరూ చూశారు. పార్లమెంటు సభ్యుడి అసభ్య ప్రవర్తన చూసి అందరూ సిగ్గుతో తలదించుకున్నారు. తప్పు చేసిన ఎంపీకి రాచ మర్యాదలు చేసి ఊరిగింపులు చేశారు. న్యాయం బద్ధంగా రావాల్సిన బకాయిలపై ప్రశ్నించిన వ్యక్తిని డిస్మిస్ చేశారు. ఇదెక్కడి న్యాయం? దళితులు
నమ్మి ఓట్లు వేసినందుకు శిక్ష ఇదా? వారు వైసీపీకి ఓట్లు వేసి పాశ్చాత్తాపపడుతున్నారు. పొరపాటున జగన్ రెడ్డిని అధికారంలోకి తీసుకొచ్చి తప్పుచేశాం అని మదనపడుతున్నారు. కరోనా సమయంలో మాస్కులు అడిగిన సుధాకర్ ను వేధించి చంపేశారు. ప్రశ్నించిన డాక్టర్ అనితారాణిపై వైసీపీ నేతలు అసభ్యంగా ప్రవర్తించారు. జడ్జి రామకృష్ణపై దేశద్రోహం నేరం మోపి జైలుకి పంపించి హింసించారు. ఇసుక గురించి ప్రశ్నించిన రాజమండ్రిలోని వరప్రసాద్ అనే వ్యక్తిని శిరోముండనం చేసి అనేకరకాలుగా ఇబ్బందులకు గురిచేశారు. దీనిపై సాక్షాత్తు రాష్ట్రపతి కార్యాలయం స్పందించినా నేటికీ చర్యలు లేవు. చిత్తూరు జిల్లాలో నాసిరకం మద్యంపై ప్రశ్నించిన ఓంప్రతాప్ అనే దళితుడిపై జగన్ రెడ్డి కక్షపూరితంగా వ్యవహించారు. మాస్కు పెట్టుకోనందుకు చీరాలలో కిరణ్ కుమార్ ని పోలీసులు కొట్టి చంపారు.
జగన్ రెడ్డి దుర్మార్గాలకు, దారుణాలకు, రాక్షసత్వానికి అంతులేకుండా పోయింది. దళితుల పట్ల కర్కషంగా వ్యవహరిస్తున్నారనడానికి కానిస్టేబుల్ ప్రకాష్ ఉదంతమే సాక్ష్యం. దళితులకు అందుతున్న సంక్షేమ పథకాలను రద్దు చేశారు. పేదలకు అందే పథకాలను అందకుండా చేసి ద్రోహం చేసిన రాజ్యాంగ వ్యతిరేకి జగన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పాలి. కానిస్టేబుల్ ప్రకాశ్ కి న్యాయం జరిగేవరకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది.
అతనిపై తప్పుడు కేసులు బనాయించి అనవసరంగా ఇబ్బందులు పెట్టిన ఉన్నత అధికారులను వదిలిపెట్టేది లేదు. దళితులు ఓట్లేసి గెలిపించడంతో ఏం చేయడానికైనా హక్కు కల్పించారనే రీతిలో ఉన్నారు. మీ ఇష్టానుసారం ప్రవర్తిస్తామంటే కుదరదు. మీ విధానాలు ఇలాగే కొనసాగితే ఎదుర్కొంటాం. ప్రకాశ్ కి జరిగిన అమానవీయ సంఘటనలు మరొకరి జరగకుండా తెలుగుదేశం పార్టీ నిరంతరం పోరాటం చేస్తుంది.