(భారతీయ అంతర్జాతీయ మహిళా క్రికెటర్ )
———————
పట్టుదల….
సంకల్పం….
ఆత్మ విశ్వాసం….
ఇవే ఆమెను ముందుకు నడిపించాయి…
నల్లపురెడ్డి శ్రీచరణిరెడ్డి!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా వీరపునాయునిపల్లె మండలం ఎర్రమల్లె గ్రామానికి చెందిన నల్లపురెడ్డి చంద్రశేఖరరెడ్డి – రేణుక దంపతులకు 4 ఆగస్టు 2004న శ్రీచరణి రెడ్డి రెండో సంతానంగా జన్మించింది. పెద్ద కూతురు చరిత ఎంఎస్ పూర్తి చేసి అమెరికాలో ఉంటున్నది. ఇంట్లో అందరూ శ్రీచరణిని ‘చిన్నా’ అని పిలుస్తారు. రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌లో చంద్రశేఖరరెడ్డి ఒక సాధారణ ఉద్యోగి.
క్రీడా ప్రస్థానం
21 సంవత్సరాల శ్రీచరణికి చిన్నప్పటి నుండి క్రీడలు అంటే ఆసక్తి. ఈ క్రమంలో ఆమె మొదట ఖోఖోలో జాతీయస్థాయిలో రాణించింది. బ్యాడ్మింటన్, కబడ్డీ, బాగా ఆడేది. అథ్లెటిక్స్ ట్రైనింగ్‌కు కూడా ఎంపికయ్యింది.
ఆరో తరగతిలో చదువుతున్నప్పుడు బ్యాడ్మింటన్‌లో చేర్పించారు. అయితే, బ్యాడ్మింటన్ ఆడి, ఇంటికి వచ్చి క్రికెట్ ఆడేది. బ్యాడ్మింటన్ కోసం ప్రొద్దుటూరు అకాడమీలో కొంత కాలం శిక్షణ తీసుకుంది. కానీ ఇక్కడ కూడా. కోచింగ్ తర్వాత ఇంటికి వచ్చి విశ్రాంతి లేకుండా క్రికెట్ ప్రాక్టీస్ చేసేది. ఇట్లా చిన్నప్పటి నుండి కూడా క్రికెట్ అంటే ఆసక్తి.
పదోతరగతి చదువుతున్న సమయంలో ఈ ఆసక్తిని కెరీర్‌గా ఎంచుకుంది. అప్పట్లో గుంటూరులో ఖోఖో ఆడేందుకు వెళ్లి అక్కడ క్రికెట్ మ్యాచ్ చూసి తనలోని ఆసక్తిని పెంచుకుంది. ఆసక్తి ఉంటే చాలదు. అందుకు ముందు ప్రోత్సాహం ఉండాలి. తగిన శిక్షణ ఉండాలి. ఇందుకు వ్యయ ప్రయాసలు భరించాలి. కఠోర శ్రమ చేయాలి. అన్నింటికంటే ముందు ఫలితం సాధించాడానికి… ప్రతిభ ప్రదర్శించడానికి… సరైన మార్గం దొరకాలి. స్కూల్ పీఈటీ హైదరాబాద్‌లో కోచింగ్ ఇప్పిస్తే మంచి క్రీడాకారిణిగా రాణిస్తుందని తల్లిదండ్రులతో చర్చించి మార్గం సుగమం చేసాడు. ఆ విధంగా హైదరాబాద్ కూకట్‌పల్లిలో రంజీ మాజీ క్రికెటర్ సురేష్ దగ్గర శిక్షణ తీసుకున్నది.
క్రికెట్ జట్టు ఎక్కువగా పురుషుల క్రీడ కావడంతో తల్లితండ్రులు మొదట్లో కొంత సంశయించినప్పటికి… తర్వాత కూతురు పట్టుదలను కాదనలేకపోయారు. కానీ, క్రీడా ప్రయాణం నల్లేరు మీద నడక కాదు, కత్తి మీద సాములా ముందుకు సాగింది. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని అడ్డు తగులుతున్నా నిరాశ పడకుండా ఎదురుకుంటూ… తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ముందుకు సాగింది.
మొత్తానికి ఆర్థికంగా కుటుంబం ఇబ్బందులు పడుతున్నా కూతురు కేరిర్ విషయంలో శ్రీచరణి తల్లిదండ్రులు ఎక్కడ వెనకడుగు వేయలేదు. అన్ని తామై కూతురుని ముందుకు నడిపించారు. తల్లిదండ్రులతో పాటుగా మేనమామ కిషోర్ కుమార్ రెడ్డి పాత్ర కూడా శ్రీచరణి విజయంలో అద్వితీయమైనది. శ్రీచరణి మొదటి కోచ్ ఇతడే.
కడప నుంచి…
శ్రీచరణి మొదట ఫాస్ట్ బౌలర్‌గా కెరీర్ ప్రారంభించింది. ఆశించిన ఫలితాలు రాలేదు. స్పిన్నర్‌గా మారి అదృష్టాన్ని పరీక్షించుకుంది. 2019లో బెంగళూరు జాతీయ క్రికెట్ అకాడమీ అండర్-19 వరల్డ్‌కప్ కోసం హైలెవల్ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసి, దేశవ్యాప్తంగా ప్రతిభావంతులైన యువ క్రికెటర్లను ఆ శిబిరానికి ఎంపిక చేశారు. ఇందులో శ్రీచరణి ఎంపిక కాలేదు.పట్టుదల మరింత పెరిగింది. 2022లో ఆంధ్ర సీనియర్ జట్టులో చోటు సంపాదించుకుంది.
2023లో ముంబయిలో జరిగిన టీ20 చాంపియన్ షిప్ లో ఆడింది. 2024 లో ఆమె ప్రదర్శిస్తున్న అద్భుతమైన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్‌లోని వైవిధ్యం సెలెక్టర్ల దృష్టిని ఆకర్శించింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలంలో ఢిల్లీ జట్టు రూ. 55 లక్షలకు కొనుగోలు చేసింది. 2025 మార్చిలో జరిగిన సీనియర్ మహిళల టోర్నీలో భారత్-బి తరఫున ఆడిన శ్రీచరణి తన నైపుణ్యంతో అందరినీ మళ్ళీ రెట్టింపుగా ఆకట్టుకుంది. అవిధంగా అతి తక్కువ కాలంలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ద్వారా సెలెక్టర్ల దృష్టిలో పడింది. ఏప్రిల్‌లో శ్రీలంక పర్యటనకు ఎంపికై, భారత సీనియర్ జట్టులో ప్రవేశం పొందింది. వాస్తవానికి సెలెక్టర్లు నైపుణ్యంతో పాటుగా అనుభవాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. కానీ శ్రీచరణి విషయంలో అనుభవం కంటే నైపుణ్యానికే ప్రాధాన్యత ఇవ్వడం గర్వకారణం.
2025 – ప్రపంచ కప్ లో
అంతర్జాతీయ క్రికెట్‌కు ఎంపిక కావడం. ఐసీసీ మహిళా క్రికెట్ ప్రపంచకప్ 2025లో భారత్ మొట్టమొదటి విజేతగా నిలవడంలో శ్రీచరణి కీలక పాత్ర పోషించింది. 2025 నవంబర్ లో నవీముంబయి వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 52 పరుగుల తేడాతో విజయం సాధించడం ప్రపంచ రికార్డు. భారత్ విధించిన 299 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు నిలకడగా ఆడుతూ విజయానికి 52 పరుగుల దూరంలో ఆగిపోయింది..ఈ విజయంలో మన తెలుగుమ్మాయి శ్రీచరణి ఆటలో హైలెట్స్ గమనిస్తే…. ( ఈఎస్పీఎన్ (Entertainment and Sports Programming Network)క్రిక్ఇన్ఫో వెబ్సైట్ ప్రకారం )
– 2025లో అత్యధిక వికెట్లు తీసిన టాప్ 5 బౌలర్లలో శ్రీచరణి ఒకరు.
– శ్రీచరణి దక్షిణాఫ్రికా బ్యాటర్ ఆనికే బోష్‌ను డకౌట్ చేసి, కీలక వికెట్ తీయడంలో సహకరించింది. ఆ తర్వాత, కొద్దిసేపటికే ఆనికేను ఖాతా తెరవకుండానే శ్రీచరణి ఔట్ చేసింది. ఈ రెండు వికెట్లు పడటం భారత్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది.
– ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025లో ఆమె ఆడిన మొత్తం 9 మ్యాచ్‌లలో 14 వికెట్లు తీయడంతో ఈ జాబితాలో శ్రీ చరణి నాలుగో స్థానంలో నిలిచింది.
– ఈ జాబితాలో దీప్తి శర్మ తొలి స్థానంలో ఉంది. ఆమె తర్వాత నిలిచిన రెండో భారతీయ క్రీడాకారిణి శ్రీచరణి.
బంగారు భవిష్యత్తు
21 సంవత్సరాల శ్రీచరణిరెడ్డికి బంగారు భవిష్యత్తు ఉన్నది. “యువరాజ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టినట్టుగా ఎప్పటికైనా యువరాజ్‌లా అలా సిక్సర్లు కొట్టాలనేది ” ఆమె ఆశయం.. భారతదేశం తరపున ఆమె మరెన్నో విజయాలు అందుకుని…తన ఆశయాన్ని సాధించి…. తెలుగు నేల వెలుగుల్ని ప్రపంచ నలుమూలల ప్రసరింపజేయాలని ఆశిద్దాం
– వ్యాసకర్త : డాక్టర్ తంగెళ్ళశ్రీదేవిరెడ్డి
(వివిధ ఆంగ్ల, తెలుగు వార్త పత్రికల సౌజన్యంతో…)