* ఆదరణ 3.0తో ఆధునిక పరికరాలు అందజేత
* చైర్మన్లు, డైరెక్టర్ల గౌరవాన్ని పెంపొందిస్తాం
* ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
* రెండో రోజు ఏడు కార్పొరేషన్ పాలక మండళ్లతో మంత్రి సవిత భేటీ
విజయవాడ: ప్రస్తుత పోటీ ప్రపంచంలో కుల, చేతివృత్తిదారులు నిలదొక్కుకునేలా ఆధునిక పరికరాలు అందజేసి, వారికి శాశ్వత ఉపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. కార్పొరేషన్ చైర్మన్లకు నిధులు, విధులతో పాటు వారి గౌరవాన్ని పెంపొందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. బీసీ కులాల కార్పొరేషన్ చైర్మన్లతో ఆత్మీయ సమావేశాల సందర్భంగా విజయవాడలోని గొల్లపూడి బీసీ భవన్ లో మంగళవారం ఏడు కార్పొరేషన్ చైర్మన్లతోనూ, డైరెక్టర్లతోనూ మంత్రి సవిత భేటీ అయ్యారు.
ఆదరణ 3.0 పథకం అమలులో భాగంగా తమ కుల వృత్తులకు ఏవిధమైన పరికరాలు కావాలో..? ఆయా కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్ల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, టీడీపీతోనే బీసీలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక గుర్తింపు లభించిందన్నారు. ఆనాడు అన్న ఎన్టీఆర్, నేడు సీఎం చంద్రబాబునాయుడు బీసీల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. బీసీ బిడ్డలకు ఆరోగ్యభద్రతతో కూడిన నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు.
బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో ఇన్వర్టర్లు, సీసీ కెమెరాలు, ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. బీసీ హాస్టల్ విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సాహించేలా స్పోర్ట్స్ కిట్లతో పాటు ట్రాక్ సూట్ లు కూడా అందజేయనున్నామన్నారు. బీసీ నిరుద్యోగ యువతకు డీఎస్సీ, సివిల్ సర్వీసెస్ కోచింగ్ లను ఉచితంగా అందజేసి, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నత స్థానాల్లో నిలపేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గతంలో ఆదరణ, ఆదరణ 2.0 అమలు చేసిన సీఎం చంద్రబాబునాయుడు ఇప్పుడు రూ.1000 కోట్లతో ఆదరణ 3.0 పథకానికి శ్రీకారం చుట్టారని మంత్రి సవిత వెల్లడించారు.
ఆధునిక పరికరాలతో శాశ్వత ఉపాధి
బీసీ కులాల్లో ఉన్న చేతివృత్తిదారులకు శాశ్వత ఉపాధి కల్పించాలని సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయించారని మంత్రి సవిత తెలిపారు. ప్రస్తుత అభిరుచులకు అనుగుణంగా చేతి, కులవృత్తులకు మేలు కలిగేలా ఆధునిక పరికరాలు అందజేసేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఏయే వృత్తులకు ఏయే పరికరాలు కావాలో…? వివరాలు అందజేయాలని చైర్మన్లను, డైరెక్టర్లను కోరారు. చైర్మన్లు, డైరెక్టర్ల నుంచి అభిప్రాయాలు సేకరించి, సీఎం చంద్రబాబుకు నివేదించనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు.
మీ గౌరవాన్ని పెంపొందిస్తాం
ఆయా కులాల కార్పొరేషన్లకు నిధులు కేటాయించడంతో పాటు చైర్మన్లు, డైరెక్టర్లకు వారి గౌరవాన్ని పెంపొందించేలా చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి సవిత తెలిపారు. గత ప్రభుత్వం మాదిరిగా కార్పొరేషన్ల పాలక మండళ్లను ఉత్సవ విగ్రహాల మాదిరిగా కాకుండా వారికి బాధ్యతలు కూడా అప్పజెబుతామన్నారు. 16 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత చైర్మన్లపైనా, డైరెక్టర్లపైనా ఉందన్నారు. అనంతరం ఆయా కార్పొరేషన్ల వారీగా మంత్రి ముఖాముఖి సమావేశం నిర్వహించి, వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.
ఈ సమావేశంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.సత్యనారాయణ, ఆయా కులాల కార్పొరేషన్ చైర్మన్లు రెడ్డి అనంతకుమారి, రుద్రకోటి సదాశివం, చిలకలపూడి పాపారావు, మల్లెల ఈశ్వరరావు, పీవీజీ కుమార్, పాలవలస యశస్వి, నర్సింహయాదవ్, ఆయా కార్పొరేషన్ డైరెక్టర్లు, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, బీసీ సంక్షేమ శాఖాధికారులు పాల్గొన్నారు