– కేసీఆర్-జగన్‌కు ఎందుకు ఫెయిలవుతారు?
– ‘పీకే’ ఉండగా ఈ సర్వేలు ఏం పీకుతాయట?
( మార్తి సుబ్రహ్మణ్యం)
సెంటర్ ఫర్ నేషనల్ ఒపీనియన్ సర్వేలో అత్యంత జనాదరణ పొందిన ముఖ్యమంత్రులలో ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డికి 20వ స్థానం, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు 11వ స్థానం దక్కింది. ఒడిసా సీఎం నవీన్ పట్నాయక్, యోగి, ఉద్ధవ్ థాక్రే, హిమంత బిశ్వశర్మ, భగవత్‌మాన్ వరసగా ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాలు సాధించారు. ఇక ప్రధాని మోదీకి ప్రజాదరణ గతంలో కంటే కొంచెం పెరిగింది. ఇదీ తాజాగా వెలుగుచూసిన సర్వే ని వేదిక.
అయితే ఏంటట… ఇవన్నీ మేం నమ్మాలా? నో.. నెవర్.. ఇలాంటి సర్వేలను మేం నమ్మేదేలే! యస్. నమ్మమంటే నమ్మం. అంతే!! ఎందుకు నమ్మాలి? అహ.. ఎందుకు నమ్మాలంట? అవన్నీ పెట్టుడు సర్వేలు. కట్టుకథల నివేదికలు. ఎవరో ఇంట్లో, ఆఫీసులో కూర్చుని, ఏదో లెక్కలేసుకుంటే వాటిని నమ్మేయడానికి మేమేమయినా హాఫ్ టికెట్‌గాళ్లమనుకుంటున్నారా ఏంది? నిజమేనని నమ్మడానికి చెవుల్లో పూలు పెట్టుకున్నామా ఏందంట?
ఎందుకు నమ్మమంటే… అటు జగనన్నయినా, ఇటు శేఖరన్నయినా ఇద్దరూ సంక్షేమాన్ని పొంగి పొర్లిస్తున్నారు. అక్కా చెల్లెమ్మల కోసం… అక్కడ జగనన్నియ్య వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి మరీ, వారి సంక్షేమం కోసం పనిచేస్తున్నారు. క్యాష్ అవసరం పడుతుందని, ముందు జాగ్రత్తతో మందుకొట్ల దగ్గర డిజిటల్ మనీని కూడా అనుమతించడం లేదు. అక్కచెల్లెమ్మలకు పైసలు పంచేందుకు.. ఉద్యోగులకు జీతాలు కూడా సరైన టైముకు ఇవ్వకుండా, ముందు ప్రాధాన్యం సంక్షేమ పథకాలకే ఇస్తున్నారు.
ఆ అక్కచెల్లెమ్మల కోసమే చివరాఖరకు.. ఉద్యోగులు దాచుకున్న సొమ్ములను కూడా తీసుకుంటున్నారు. రోడ్లు గుంతలు పడ్డా, గోతులు పడ్డా పట్టించుకోకుండా ఠంచనుగా నొక్కే బటన్ కోసం డబ్బులు దాచిపెట్టారు. కాంట్రాక్టర్లకు బిల్లులివ్వకపోయినా.. బస్సు రేట్లు పెంచినా.. పెట్రోలు రేట్లు పెంచినా.. కరెంటు చార్జీలు పెంచినా.. ఆర్టీసీ రేట్లు పెంచినా.. చెత్తపన్ను వేసినా.. అమ్మఒడికి కతె్తర వేసినా, చివరాఖరకు మందు రేట్లు పెంచినా.. అక్కచెల్లెమ్మల కోసమే కదా?! మరి అక్కచెల్లెమ్మల కోసం తన ఇమేజ్‌ను కూడా డామేజీ చేసుకుని, అప్పులు చేసి మరీ సంక్షేమ పథకాలిస్తుంది? ప్రతి మంగళవారం ఆర్బీఐ మెట్లు ఎక్కుతుంది వారి కోసమే కదా? అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకోవాలన్న ఆలోచనలతోనే, జగనన్న 24 గంటలూ గడిపేస్తున్నారు. అందుకే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు అపాయింట్‌మెంట్లు కూడా ఇవ్వడం లేదు. ఆయన ఆశ, శ్వాస అంతా అక్కచెల్లెమ్మలకు, అవ్వా తాతలకు సంక్షేమపథకాలు ఎలా అమలుచేయాలన్న దానిపైనే.
అంత పెద్దమనసున్న జగనన్నకు, పోయి పోయి మరీ అధమంగా 20 వ స్థానం ఇవ్వడానికి ఆ సర్వే వాళ్లది గుండెనా? పాషాణమా? వాళ్లకు అసలు మనసుందా? దేశంలో అసలు ఆ స్థాయిలో సంక్షేమ పథకాలు ఇస్తున్న సీఎం ఎవరో చూపించండి. ఎన్నికల్లో విజయానికి ఈ సర్వేలు, గిర్వేలూ పనికిరావు. సంక్షేమ పథకం అందుకున్న ప్రతి అక్కచెల్లెమ్మ, ప్రతి తాతా అవ్వ, జగనన్నయ్యకు ఓటు వేసి తీరతారు. మిగతా వాళ్లు ఓటేస్తే ఎంత? వేయకపోతే ఎంత? జగనన్న ధైర్యం కూడా వాళ్లే. దట్సాల్!
ఇక దేశంలోనే అతి సంపన్న రాష్ట్రమైన తెలంగాణను.. విభజన తర్వాత మిగులు రాష్ట్రమైన తెలంగాణను.. శేఖరన్న అప్పులపాలు చేసినప్పటికీ, అదంతా ఆయన కోసం కాదు. బడుగుబలహీన వర్గాల సంక్షేమం కోసమే కదా? దళితబంధు, షాదీముబారక్, కల్యాణలక్ష్మి, రైతుబంధు, డబుల్‌బెడ్‌రూమ్, ఆరోగ్యలక్ష్మి, కేసీఆర్ కిట్.. ఇలా లెక్కలేనన్ని స్కీములతోపాటు.. మిషన్ కాకతీయ వంటి ప్రాజెక్టులు అందిస్తున్న కేసీఆరన్నకు దుర్మార్గపు సర్వే కంపెనీ వాళ్లు 11 వ స్థానం ఇవ్వడం నేరం, ఘోరం. దీన్ని గర్హించాల్సిందే.
గతంలో మాదిరి కాకుండా.. ఉద్యోగులందరికీ ఒకేసారి కాకుండా, జిల్లాల వారీ జీతాలు చెల్లిస్తున్నా, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించుకుండా పెండింగ్‌లో పెట్టినా, సర్కారు ఆసుపత్రుల్లో డాక్టర్లను నియమించకపోయినా, కార్మికులకు ఈఎస్‌ఐలలో కావలసినన్ని మందులు కొనుగోలు చేయకపోయినా, ఉద్యోగులకు రావలసిన బకాయిలు కూడా పెండింగ్‌లో పెట్టింది బలహీనవర్గాల సంక్షేమం కోసమే కదా? కొత్త అప్పుల కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నది కూడా వారి కోసమే కదా? మందు రేట్లు పెంచిందీ.. వైన్‌షాపులు, బార్ల సంఖ్య పెంచింది కూడా వారి సంక్షేమం కోసమే కదా? రోజంతా బయటకు రాకుండా కేసీఆరన్న ఫాంహౌసులో ఉండేది.. తెలంగాణ రాష్ట్రంలోని ఏ ఒక్కరూ పేదవారిగా ఉండటానికి వీల్లేదని ఆలోచించేందుకే కదా? మరి బడుగు వర్గాల కోసం ఇంత చేస్తున్న కేసీఆరన్నకు 11 వ స్థానం ఇవ్వడానికి మీకు మనసెలా ఒప్పింది? సో.. ఎన్ని సర్వేలు ఎన్ని రిపోర్టులు ఇచ్చినా.. ఎంత స్థానం ఇచ్చినా… మా ‘పీకే’ మాకున్నారు. కాబట్టి ఏ సర్వే కంపెనీ ఏం పీకలేదు. దట్సాల్.