– మహానాడులో చంద్రబాబుకు ‘యువగళం’ కాఫీ టేబుల్ బుక్ అందజేసిన లోకేశ్
– రెండో రోజు కొనసాగిన టీడీపీ మహానాడు-2025
– చంద్రబాబుకు యువగళం కాఫీ టేబుల్ బుక్ బహూకరించిన లోకేశ్
– ఈ పుస్తకంలోని కథనాలు గత స్మృతులను, బాధ్యతను గుర్తు చేస్తున్నాయన్న మంత్రి
– తన యాత్రకు మద్దతిచ్చిన ప్రజలకు, టీడీపీ శ్రేణులకు లోకేశ్ హృదయపూర్వక కృతజ్ఞతలు
– చంద్రబాబే తనకు స్ఫూర్తి అని పునరుద్ఘాటించిన నారా లోకేశ్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్, ఇవాళ మహానాడు 2025 ప్రాంగణంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ‘యువగళం’ పాదయాత్ర కాఫీ టేబుల్ బుక్‌ను అందజేశారు. ఈ సందర్భంగా లోకేశ్ తన పాదయాత్ర అనుభవాలను, ప్రజల ఆదరాభిమానాలను గుర్తుచేసుకున్నారు.
ఈ పుస్తకాన్ని తనకు స్ఫూర్తిప్రదాత అయిన చంద్రబాబుకు అందించడం ఎంతో సంతోషంగా ఉందని లోకేశ్ తెలిపారు. పుస్తకంలోని అనేక కథనాలు, చిత్రాలు తనకు గత జ్ఞాపకాలను గుర్తుకు తెస్తున్నాయని, అదే సమయంలో తనపై ఉంచిన అపారమైన బాధ్యతను కూడా స్ఫురణకు తెస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. యువగళం పాదయాత్ర ఆసాంతం తనకు అండగా నిలిచి, నాపై ప్రేమ, ఆప్యాయతలను కురిపించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నారా లోకేశ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. మహానాడు వంటి కీలకమైన సందర్భంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం, తొలి ప్రతిని చంద్రబాబుకు అందించడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు. ఈ పుస్తకాన్ని ప్రధాని మోడీ చేతులమీదుగా ఇటీవల ఆవిష్కరించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కి అందజేశారు.
– గోళ్లపల్లి రఘునాధ్