– మిల్లీమ్యాగీతో మిస్‌బిహేవ్ చేసిన ఎవరా రాజ్యసభ సభ్యుడు?
– ఎవరా రాజేందర్‌నగర్ మైనారిటీ నేత?
– వారి లేకి చేష్టలతో పోటీ నుంచి వైదొలగి లండన్ వెళ్లిన అందాలభామ?
-హైదరాబాద్‌లో నిర్వహకులు తనను వ్యభిచారిలా చూశారంటూ మిస్ లండన్ మిల్లీ ఆవేదన
– ఒకే టేబుల్‌పై ఆ ముగ్గురు?
– సీసీ టీవీ పుటేజ్‌తో బట్టబయలు?
– ఇప్పటికే ఢిల్లీ హైకమాండ్‌కు చేరిన ‘ఆ ఇద్దరి’ వ్యవహారం
– హరీష్‌రావు డిమాండ్‌తో మళ్లీ రచ్చ రంబోలా
– వారిద్దరి పేర్లు బయటపెట్టాలని హరీష్ డిమాండ్
– సీసీ టీవీ విడుదలకు హరీష్ డిమాండ్
-ఇద్దరూ సీఎంకు అత్యంత సన్నిహితులే
– అందులో వారిలో ఒకరికి ఎమ్మెల్సీ కోసం యత్నం
– తెలంగాణ పరువు తీసినందుకు ఇటీవల సారీ చెప్పిన కేటీఆర్
– కాంగ్రెస్‌లో ‘కాట్రాజ్’ల కల్లోలం
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఆమె మిస్ లండన్. మిస్ వరల్డ్ కిరీటం సొంతం చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన మిస్‌వరల్డ్ పోటీలకు అంత దూరం నుంచి హైదరాబాద్ వచ్చింది. ప్రభుత్వం కూడా ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేసింది. అయితే ఓ ఇద్దరు కాంగ్రెస్ కీలక నేతల లేకి చేష్టలు, అసభ్య ప్రవర్తనకు తాళలేక.. ఆ లండన్ సుందరి ఉన్నట్లుంది అర్ధంతరంగా పోటీ నుంచి నిష్ర్కమించి, లండన్ విమానమెక్కి చెక్కేసింది.
లండన్ వెళ్లిన ఆ అందాల భామ మౌనంగా తన మానాన తాను ఉన్నా సరిపోయేది. కానీ ఆమె ఒక అంతర్జాతీయ మ్యాగజైన్‌కు.. హైదరాబాద్‌లో తనకు జరిగిన లైంగిక వేధింపుల గురించి పూసగుచ్చినట్లు వివరించింది. తనను ఒక వ్యభిచారిలా చూశారంటూ పెద్ద బాంబు పేల్చింది. దానితో కలవరపడిన నిర్వహకులు.. అబ్బే అలాంటిదేమీ లేదంటూ ఒక ప్రకటన ఇచ్చింది. కొద్దిరోజుల క్రిత ం ఇదో హాట్‌టాపిక్.
లే టయినా.. లేటె స్ట్‌గా మాజీ మంత్రి, ఆరడుగుల బుల్లెట్ హరీష్ ఇంకో బాంబుపేల్చారు. లండన్ సుందరిని ఒక ఎంపి, ఒక చైర్మన్ వేధించారని, వారి పేర్లు బయటపెట్టి వారిపై చర్యలు తీసుకునే దమ్ము సీఎం రేవంత్‌రెడ్డికి ఉందా? అని సవాల్ చేసి, మళ్లీ అందరి దృష్టిని లండన్ సుందరి మిల్లీ మ్యాగీ వైపు మళ్లించారు. దానితో ఎవరా ఎంపీ? ఏమా కథ? ఎవరా కాంగ్రెస్ కీలక నేత అన్న చర్చకు తెరలేచింది.
పార్టీ వర్గాలు, నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. చౌముల్లా ప్యాలెస్‌లో మిస్‌వరల్డ్ పోటీలకు వచ్చిన అందాలభామలకు ప్రభుత్వం విందు ఇచ్చింది. అయితే మిస్ లండన్ మిల్లీమ్యాగీ కూర్చున్న టేబుల్‌లోనే ఒక రాజ్యసభ సభ్యుడు, రాజేందర్‌నగర్‌కు చెందిన ఓ మైనారిటీ నేత కూర్చున్నారు. ఆ సందర్భంగా వారిద్దరూ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారని విచారణలో తేలినట్లు, కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
కాగా మిల్లీ మ్యాగీ లండన్‌లో చేసిన వ్యాఖ్యల అనంతరం దానిపై ఒక విచారణ కమిటీ నియమించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ నివేదికలో ఒక రాజ్యసభ సభ్యుడు, రాజేందర్‌నగర్ మైనారిటీ నేత ఆమెతో అసభ్యంగా ప్రవర్తించినట్లు తేలిదంటూ అటు కాంగ్రెస్ వర్గాలు, ఇటు సోషల్‌మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. వారిద్దరి పేర్లు ఉటంకిస్తూ ఈపాటికే పార్టీ నాయకత్వాని నివేదిక వెళ్లినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
హైదరాబాద్‌కు చెందిన ఓ యువ ప్రజాప్రతినిధి, తాజాగా ఎమ్మెల్సీ కోసం తీవ్రంగా ప్రయత్నించిన రాజేందర్‌నగర్‌కు చెందిన ఓ మైనారిటీ నేత వైపే, విచారణ మిటీ వేళ్లు చూపినట్లు పార్టీవర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. వీరిలో రాజేందర్‌నగర్‌కు చెందిన ఓ మైనారిటీ నేతకు ఎమ్మెల్సీ ఇప్పించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి.. చివరి నిమిషం వరకూ ప్రయత్నించిన విషయాన్ని కాంగ్రెస్ వర్గాలు గుర్తు చేస్తున్నాయి.
ఇద్దరూ రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితులు కావడంతో, ఈ విషయాన్ని మీడియాలో పెద్ద రచ్చ కాకుండా ప్రయత్నాలు జరుగుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే వారిద్దరి పేర్లు ఈపాటికే.. కాగల కార్యం తీర్చే గంధర్వులు, పార్టీ నాయ త్వానికి చేరవేసినట్లు ప్రచారం జరుగుతోంది.
తాజా పరిణామాల నేపథ్యంలో వారిద్దరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అసలు చర్యలు తీసుకుంటారా? లేదా? సీఎంకు సన్నిహితులయినందున వారిపై చర్యలు తీసుకునేందుకు సాహసిస్తారా? లేదా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
మీడియా మౌనమేల?
శూలశోధన జర్నలిజంలో ఆరితేరిన తెలుగు మీడియా ఈ వ్యవహారంలో, గుప్పెడు నిద్రమాత్రలు మింగినంత మత్తు-మౌనంగా ఉండటమే ఆశ్చర్యం. కేసీఆర్ కుటుంబంలో కొట్లాటలు, అంత:పుర అంతరంగ రహసస్యాలను వెలికితీస్తున్న మీడియా.. అంతర్జాతీయ స్థాయిని ఆకర్షించిన మిస్ వరల్డ్ పోటీ నుంచి, లండన్ సుందరి మిల్లీ ఎందుకు నిష్ర్కమించిందని ఇప్పటిదాకా సింగిల్ కాలమ్ వార్త రాయకపోవడమే విడ్డూరం.
ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి ప్రకటనల కోసం బాకా ఊదే మీడియా.. ఏ పాలకుడు ఉంటే ఆ పాలకుడికి రాజగురువుగా ఉండాలనుకునే మీడియా అధిపతులు.. లండన్ సుందరి హైదరాబాద్‌లో నిర్వహకులు తనను వ్యభిచారిలా చూశారంటూ అంతర్జాతీయ మ్యాగజైన్ ముందు భోరున విలపిస్తే.. ఆ అందాల సుందరిని వేధించిన కీచకులు ఎవరన్న కోణంలో ఇప్పటివరకూ ఒక్క పరిశోధన చేయకపోవడమే దారుణం.
పోనీ చౌముల్లా ప్యాలెస్‌లో ఏం జరిగిందని మీడియాకు మొదట్లో తెలియదనుకున్నప్పటికీ.. ఆ తర్వాత మిస్ లండన్ మిల్లీ ఆరోపణలు చేసిన తర్వాత కూడా, కలాలు ఝళిపించకపోవడం చూస్తే.. నేలబారు జర్నలిజం ఏ స్థాయికి దిగజారిందో సుస్పష్టం.
తాజాగా మళ్లీ ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చింది మోతబరి మీడియా కాదు. మాజీ మంత్రి హరీష్‌రావు మాత్రమే. అంటే దీన్నిబట్టి ఒక మాజీ మంత్రికి ఉన్న నెట్‌వర్క్, సమాచార వ్యవస్థ.. అటు మీడియాకు గానీ, ఇటు సర్కారుకు గానీ లేకపోవడమే వింత. మిల్లీని వేధించిన వారిలో ఒక ఎంపీ, ఒక చైర్మన్ ఉన్నారని..
వారిద్దరూ సీఎం రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితులంటూ హరీష్‌రావు చేసిన ఆరోపణకు ఇప్పటివరకూ ఎవరూ స్పందించకపోవడం బట్టి, పాలకులు ఏ స్థాయిలో ఆత్మరక్షణలో పడ్డారో అర్ధమవుతూనే ఉంది.
లేకపోతే అంతర్జాతీయ స్థాయి అంశమైన ఈ వ్యవహారంలో.. హరీష్ ఆరోపణలు చేసిన వెంటనే సర్కారు దిద్దుబాటు చర్యలకు దిగాలి. అలాంటివేమీ లేదు. ‘‘కావాలంటే సీసీ టీవీ పుటేజీ చూసుకోండి.
మేం పులుకడిగిన ముత్యాలం’’ అని తమ పాతివ్రత్యాన్ని రుజువుచేసుకోవాలి. హరీష్‌రావును దోషిగా నిలబెట్టాలి.
కానీ ఇప్పటిదాకా ఇవేమీ జరగలేదంటే.. హరీష్‌రావు ఆరోపణలు నిజమేనని భావించాలా? మౌనం అంగీకారం అంటారు కదా? ఇప్పటికయినా..హరీష్‌రావు కోసం కాకపోయినా, చౌముల్లాప్యాలెస్‌లో మిస్ లండన్ కూర్చున్న టేబుల్ దగ్గర ఎవరున్నారని ప్రజలకు తెలిసేందుకయినా.. ఆ సీసీ టీవీ పుటేజ్ విడుదల చేసి, సర్కారు తన పాతివ్రత్యం నిరూపించుకోకపోతే.. ‘కాట్రాజ్’ల కథ కాంగ్రెస్‌కు శాపంగా మారక తప్పదన్నది ఆ పార్టీ సీనియర్ల మనోగతం! మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. పెట్రోలుబంకులు ఎన్ని ఇచ్చినా.. ఇలాంటి అనైతిక వ్యవహారాలను మహిళలు క్షమించరన్నది గుర్తిస్తే మంచిది.