– హాజరైన మల్లాది, వెల్లంపల్లి, రాయన, దేవినేని
నిర్మాణ రంగ పురోగతికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మల్లాది విష్ణు వర్ధన్ అన్నారు. భవన నిర్మాణ రంగానికి ఉపకరించే విధానాలను అమలు చేయటంలో ప్రభుత్వం ముందుంటుందన్నారు. విజయవాడ ఎ ప్లస్ కన్వేన్షన్ సెంటర్ లో శుక్రవారం నారెడ్కో ప్రాపర్టీ ఎక్స్ పోను మల్లాది ప్రారంభించారు.
ఈ ప్రదర్శన మూడు రోజుల పాటు జరగనుండగా, పూర్వపు కృష్ణా, తూర్పు , పశ్చిమ గోదావరి జిల్లాలకు నిర్ధేశించిన సెంట్రల్ జోన్ నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా మల్లాది మట్లాడుతూ ఇంటి కొనుగోలు దారులకు అన్ని సేవలు ఒకే చోట దొరికేలా ప్రాపర్టీ షోలు ఏర్పాటు చేయటం మంచి ఫరిణామమన్నారు.
మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుత స్నేహపూర్వక ప్రభుత్వంలో అన్ని వర్గాలకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకుంటుందన్నారు. నెరెడ్కో ప్రాపర్టీ షోను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ అందుబాటు ధరలలో అన్ని వర్గాల వారికి ఉపయిక్తం అయ్యేలా భవన నిర్మాణం సాగాలన్నారు.
వైసిపి విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ చార్జి దేవినేని అవినాష్ మాట్టాడుతూ ఎస్ బిఐ వంటి రుణ మంజూరు సంస్ధలను కూడా ఈ ప్రదర్శనలో భాగస్వాములను చేయటం ముదావహమన్నారు. నెరెడ్కో రాష్ట్ర సెక్రటరీ జనరల్ మామిడి సీతారామయ్య , క్రెడాయ్ రాష్ట్ర అధ్యక్షుడు వైవి రమణరావు తదితరులు మాట్లాడుతూ కరోనా తదుపరి ఇక్కట్ల లో ఉన్న భవన నిర్మాణ రంగానికి ప్రభుత్వ పరమైన చేయూత అవసరమన్నారు.
నెరెడ్కో సెంట్రల్ జోన్ అధ్యక్షుడు ముక్తేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం వివిధ రియల్ ఎస్టేట్ సంస్ధలలో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపటం అభినందనీయమన్నారు.
నేరెడ్కో రాష్ట్ర కార్యదర్శి పరుచూరి కిరణ్ మాట్లాడుతూ ప్రాపర్టీ షోలో దాదాపు 55 సంస్ధలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయని, కొనుగోలు దారులకు ప్రత్యేక రాయితీలు కూడా అందిస్తున్నాయని వివరించారు. కార్యక్రమంలో భాగంగా నారెడ్కో ప్రతినిధులు సందీప్ మండవ, వాసిరెడ్డి వంశీ, సుధీర్, నాదెళ్ల విజయకుమార్, పొట్టి రామకృష్ణ , అమర్ నాధ్ తదితరులు పాల్గొన్నారు.