ఏపీఐఐసీ ఆధ్వర్యంలో పారిశ్రామిక పార్కులకు కొత్త సొబగులు

-మారనున్న ఆటోనగర్లు, పారిశ్రామిక పార్కుల రూపురేఖలు
-పారిశ్రామిక పార్కుల్లో పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేకడ్రైవ్‌
-స్థానిక సంస్థలతో కలిసి ఘన, ద్రవ్య వ్యర్థాల నిర్వహణ
-ఆదేశాలు జారీ చేసిన ఏపీఐఐసీ
-స్టేట్ ల్యాండ్ అలాట్ మెంట్ కమిటీ (ఎస్ఎల్ఏసీ) సమావేశంలో 9 దరఖాస్తులకు ప్రతిపాదన
– ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం జవ్వాది

అమరావతి, జూన్, 17 : ఏపీఐఐసీ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పారిశ్రామిక పార్కుల్లో పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేకడ్రైవ్‌ కు రంగం సిద్ధం చేసింది. జూన్‌ 20 నుంచి జూలై 5 వరకు 15 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం జవ్వాది ఆదేశాలిచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో ఏపీఐఐసీ పారిశ్రామిక పార్కుల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు ఎండీ వెల్లడించారు.

జూన్ 20వ తేదీ నుంచి ఏపీ వ్యాప్తంగా అన్ని పారిశ్రామిక పార్కులు, ఆటోనగర్లలో ఇండస్ట్రియల్ ఎన్విరాన్ మెంట్ ఇంప్రూవ్ మెంట్ డ్రైవ్ (ఐఈఐడీ) ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతీ పరిశ్రమ నుంచి వెలువడే వ్యర్థాలపై ప్రతీ నెలా రికార్డు నమోదుకు ఆయన దిశానిర్దేశం చేశారు. మురుగు, వరద కాలువల పరిశుభ్రతతో పాటు పచ్చదనం పెంపుకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు ఎండీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని తిరుపతిలో పరిశ్రమల మంత్రి అమర్ నాథ్ చేతుల మీదుగా ఆరంభించనున్నట్లు వెల్లడించారు. అనంతపురంలో ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి ప్రారంభిస్తారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏపీఐఐసీ పార్కుల నిర్వహణకు సంబంధించిన ఈ ఐఈఐడీలో స్థానిక నాయకులు, కలెక్టర్లు, మీడియా భాగస్వామ్యానికి ఆయన ఆదేశాలిచ్చారు.

స్టేట్ ల్యాండ్ అలాట్ మెంట్ కమిటీ (ఎస్ఎల్ఏసీ) సమావేశంలో 9 యూనిట్లకు భూ కేటాయింపుల ఆమోదం : ఏపీఐఐసీ వీసీ&ఎండీ సుబ్రమణ్యం జవ్వాది
ఏపీఐఐసీ వీసీ&ఎండీ సుబ్రమణ్యం జవ్వాది అధ్యక్షతన స్టేట్ ల్యాండ్ అలాట్ మెంట్ కమిటీ (ఎస్ఎల్ఏసీ) సమావేశం జరిగింది. మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఎస్ఎల్ఏసీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటిదాకా భూములు కావాలని ఏపీఐఐసీకి 50 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. వీటిలో 5 ఎకరాలకు పైగా భూకేటాయింపులకు 10 దరఖాస్తులు, 5 ఎకరాలలోపు భూముల కోసం 40 దరఖాస్తులు ఉన్నాయి.

వీటిలో అత్యధికంగా బాపట్ల జిల్లా చీరాల పార్కులో భూముల కోసం 12 దరఖాస్తులు, అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం స్పెషల్ జోన్ నుంచి 9 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తులలో ఫార్మా, ఆహార , ఆటోమొబైల్, ఫాబ్రికేషన్, సిమెంట్, ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీ, కోల్డ్ స్టోరేజ్ లు, లారీ మెకానికల్ వర్క్స్, ఎలక్ట్రానిక్, టెక్స్ టైల్, కెమికల్ యూనిట్ల నుంచి దరఖాస్తులు వచ్చినట్లు ఎండీ తెలిపారు. జిల్లాలవారీగా జోనళ్ళలో ఏపీఐఐసీ పార్కులు, ప్లాట్ల వివరాలపై ఎండీ సుబ్రమణ్యం జవ్వాది ఆరా తీశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం దరఖాస్తులకు సంబంధించి తొమ్మిదింటిని స్టేట్ ల్యాండ్ అలాట్ మెంట్ కమిటీ (ఎస్ఎల్ఏసీ) ప్రతిపాదించింది.

ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్, సీజీఎం (ఎసెట్ మేనేజ్ మెంట్) లచ్చిరామ్, సీజీఎం (ఫైనాన్స్) సుబ్బారెడ్డి, సీజీఎం(పర్సనల్, అడ్మిన్) జ్యోతి బసు, చీఫ్ ఇంజనీర్ వివేకానందరెడ్డి, జనరల్ మేనేజర్లు గెల్లి ప్రసాద్, నాగకుమార్, ఎసెట్ మేనేజ్ మెంట్ కు చెందిన డిప్యూటీ జోనల్ మేనేజర్లు, ఏపీపీసీబీ, ఏపీఎస్ఎఫ్ సీ ప్రతినిధులు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన ఏపీఐఐసీ జోనల్ మేనేజర్లు పాల్గొన్నారు.