– ‘ఆర్థిక రాజధాని’ పేరుతో జనాన్ని మాయచేయలేరు
(వి.విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యులు)
విశాఖపట్నాన్ని ఆంధ్రప్రదేశ్ పాలనా రాజధానిగా చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించి దాదాపు మూడేళ్లు అవుతోంది. తన మూడు రాజధానుల ప్రణాళికలో విశాఖకు ఎనలేని ప్రాధాన్యం ఇస్తోంది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం. తెలుగుదేశం చర్యలు, కోర్టు కేసుల కారణంగా మూడు రాజధానుల ప్రక్రియను అమలు చేయడం ఇంకా సాధ్యం కాలేదనే వాస్తవం అశేష ఆంధ్ర ప్రజలకు తెలుసు.
‘29 గ్రామాల్లో కొలువైన’ అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలనే మొండి పట్టుదలకే పరిమితమయింది మాజీ సీఎం ఎన్.చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ. చారిత్రకంగా వెనుకబడిన ఉత్తరాంధ్రలో ఉన్న విశాఖను రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఇంజన్ గా పనిచేసే పాలనా రాజధానిగా చేయాలనే కృత నిశ్చయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పదే పదే ప్రకటిస్తోంది. అంతేకాదు, శనివారం ఉత్తరాంధ్ర ప్రజల అభిలాషను వ్యక్తం చేయడానికి ‘విశాఖ గర్జన’ పేరిట ప్రజా కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా నిర్వహించింది.
పాలకపక్షం ఇలా విశాఖపట్నం, ఇంకా వివరంగా చెప్పాలంటే ఉత్తరాంధ్ర అభివృద్ధే తన లక్ష్యమని చెబుతూనే ఉంది. ఈ పరిణామాల వల్ల ఉత్తరాంధ్ర ప్రజానీకం, విశాఖపట్నం ప్రజలు నవ చైతన్యంతో జగన్ గారి ప్రభుత్వం వెనుక మరోసారి కొత్త ఆశలతో నిలడుతున్నారు. దీంతో విశాఖపట్నం ప్రగతికి తాము వ్యతిరేకం కాదని ప్రజలకు చెప్పుకోవాల్సిన పరిస్థితి టీడీపీకి ఏర్పడింది. ఈ నేపథ్యంలో వైజాగ్ నగరం వేదికగా ఈ దివాళాకోరు రాజకీయపక్షం కొత్త నాటకాలకు తెరతీసింది.
‘ఆర్థిక రాజధాని’ పేరుతో వైజాగ్ నగరాన్ని హైజాక్ చేసే కుతంత్రాలు!
వైఎస్సార్ కాంగ్రెస్ ఎప్పటి నుంచైతే విశాఖపట్నం నగరాన్ని కార్యనిర్వాహక రాజధానిగా చేస్తానని ప్రకటిస్తూ వస్తోందో అప్పటి నుంచి టీడీపీకి ఉత్తరాంధ్రలో ఆదరణ తగ్గడం మొదలైంది. పోయిన జనాదరణ మళ్లీ సంపాదించడానికి ఇప్పుడు తమ హయాంలోనే ఈ పోర్ట్ సిటీకి మేలు జరిగిందని, అభివృద్ధి ప్రాజెక్టుల అమలు మొదలయిందని అంటూ అబద్ధాల ప్రచారం మొదలుబెట్టారు చంద్రబాబు గారి పార్టీ నేతలు. ‘రౌండ్ టేబుల్’ వంటి ఆకర్షణీయమైన పేర్లతో కొన్ని కార్యక్రమాల ద్వారా టీడీపీ నేతలు విశాఖలో బలపడడానికి నానాపాట్లు పడుతున్నారు.
ఉత్తరాంధ్రపైన, ప్రత్యేకించి విశాఖ ప్రగతిపైన ఫోకస్ పెట్టిన పాలకపక్షాన్ని బలహీన పరచడానికి తెలుగుదేశం నేతలు ప్రయత్నించి బొక్కబోర్లాపడ్డారు. స్వార్ధ ప్రయోజనాల కోసం వైజాగ్ నగరాన్ని ‘హైజాక్’ చేసి తన గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి తెగబడిన టీడీపీ పథకాలు భగ్నమయ్యాయి. చైతన్యవంతులైన ఉత్తరాంధ్ర ప్రజలను మాయ మాటలతో వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి వేరు చేసి పబ్బంగడుపుకోవడం కుదిరేపని కాదని చంద్రబాబు పార్టీకి అనుభవంలో తెలిసొచ్చింది.