– అయితే బడికి రావాలి లేదంటే ఉద్యోగం చేయాలి
– తల్లుల కన్నీళ్లు తుడిచే పత్రాలు ఇవి
– యువత ఆశలు, కోరికలు నెరవేర్చడమే ఈ ప్రభుత్వ సంకల్పం
– పదేళ్లు గత పాలకులు రాష్ట్రాన్ని దోపిడీ చేశారు
– నా రాజకీయ అనుభవంలో ఏనాడు ఇంతమందికి ఉద్యోగ పత్రాలు ఇవ్వలేదు
– గ్రూప్ 2 కొలువుల పండుగలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
హైదరాబాద్ : అయితే బడికి వెళ్లాలి లేదంటే ఉద్యోగం చేయాలి… రాష్ట్రంలో ఏ ఒక్కరు ఖాళీగా ఉండొద్దని ఆలోచనతో ప్రజా ప్రభుత్వం ముందుకు పోతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం శిల్పకళా వేదికలో గ్రూప్ 2 నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలోని ప్రతి బిడ్డ బడికి రావాలి వచ్చిన ప్రతిబిడ్డ ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి నైపుణ్యాలు పొందాలి ప్రతి బిడ్డ ఉద్యోగం పొందాలనేదే మా ప్రభుత్వ లక్ష్యం అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కార్పొరేట్ వ్యవస్థలో ఉద్యోగాలు పొందేందుకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మిస్తున్నామని తెలిపారు.
ప్రతి పాఠశాలను 25 ఎకరాల్లో 200 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మిస్తున్నామని తెలిపారు. ఫ్యూచర్ సిటీలో స్కిల్ యూనివర్సిటీ పనులు శర వేగంగా జరుగుతున్నాయి, రాష్ట్రంలోని ఐటిఐ లను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చి యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వివరించారు. ఒకే రోజు 783 మందికి గ్రూప్ 2 నియామక పత్రాలు అందించడం చరిత్రలో సువర్ణాక్షలతో లిఖించదగిన రోజు ఇది అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేసిన తన రాజకీయ అనుభవంలో ఏనాడు ఇంతమందికి ఒకేసారి నియామక పత్రాలు అందించిన దాఖలాలు లేవు అన్నారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఆత్మగౌరవంతో మన ఉద్యోగాలు మనమే సాధించవచ్చు అన్న ఆశతో దశాబ్ద కాలం పాటు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం చేశాం అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం త్యాగాలు చేసిన అమరుల ఆశయాలు నెరవేరుతాయి అని కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో పదేళ్లపాటు చూసి చూసిన తల్లిదండ్రుల ఆశలు నెరవేరలేదు అన్నారు. కూలి చేసి రూపాయి రూపాయి పోగేసి తమ బిడ్డలను హైదరాబాదులోని కోచింగ్ సెంటర్లకు పంపారు ఆ నిరుద్యోగ బిడ్డలు నోటిఫికేషన్ల కోసం చూసి చూసి అలసిపోయారు.
గత పది ఏళ్ల కాలంలో నోటిఫికేషన్లు రాలేదు ఒకటి, అర వచ్చిన అవి సక్రమంగా జరగలేదు అన్నారు. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి సీఎల్పీ నేతగా తాను తల్లిదండ్రులు పడిన ఆవేదనను ప్రత్యక్షంగా చూసామని తెలిపారు.
తెలంగాణ ప్రజల కోరిక నెరవేర్చాలన్న ఆశతో సోనియా గాంధీ కేంద్రంలో బలం లేకపోయినా ఇతర పార్టీలతో మాట్లాడి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తు చేశారు. దురదృష్టం గత సంవత్సరాలు అధికారంలో ఉన్నవారు రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు వారి కుటుంబం మాత్రం బాగుపడితే చాలు అని రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోపిడీ చేశారని ఆ విషయాలను రాష్ట్ర ప్రజలకు వివరంగా చెప్పాం రాష్ట్ర ప్రజలు ఆలోచన చేసి ఇందిరమ్మ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చారని వివరించారు.
యువత ఆశలు నెరవేర్చాలి వారి కోరికలు తీర్చాలి అనే ఏకైక సంకల్పంతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేసాం, గ్రూప్ వన్, గ్రూప్ టు నియామకాలు చేపడితే వారి కాలంలో జరగని పనులు మా ప్రభుత్వంలో ఎట్లా జరుగుతాయని కోర్టు కేసులతో అనేక ఇబ్బందులు సృష్టించారని అయినా వాటన్నిటిని ఎదుర్కొని, కోర్టుల్లో వాదించి గెలిచి నియామక పత్రాలు అందజేస్తున్నామని తెలిపారు. ఇది రాష్ట్ర యువత పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత సంకల్పం అన్నారు. లక్షల మంది తల్లులు మా బిడ్డలు చదువుకొని ఎదగాలి కుటుంబం బాగుపడాలని హైదరాబాద్ కు పంపారు, ఈ నియామక ఉత్తర్వులు తల్లుల కన్నీళ్లు తుడిచే పత్రాలు అన్నారు.
బాధ్యతతో సమాజ సేవ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యువతకు అద్భుతమైన అవకాశం కల్పించింది అని వివరించారు. ఆర్డర్ పొందిన నాటి నుంచి రిటైర్మెంట్ వరకు సంకల్పంతో రాష్ట్రానికి సేవలు అందించాలి అన్నారు. 2047 వరకు తెలంగాణ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా వృద్ధి చెందాలని ప్రపంచంతో పోటీ పడాలని రూపాయి రూపాయి పోగేసి రైజింగ్ తెలంగాణ నినాదంతో ముందుకు పోతున్నామని డిప్యూటీ సీఎం వివరించారు. నియామక పత్రాలు పొందిన అధికారుల ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని మూడున్నర కోట్ల మంది ప్రజలు ప్రయోజనం పొందాలని ఆశిస్తున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు.