– ఏపీ సురక్ష యాప్‌కి విశేష స్పందన
– స్కాన్ చేసిన తరువాతే మద్యం విక్రయాలు జరపాలని ఆదేశాలు
అమరావతి : నకిలీ మద్యం నియంత్రణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మధ్య నిషేధ, ఎక్సైజ్ శాఖ చేపట్టిన చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. ఇటీవల ప్రారంభించిన “ఏపీ ఎక్సైజ్ సురక్ష” మొబైల్ యాప్ ప్రజల్లో విశేష ఆదరణ పొందింది. ఈ యాప్ ద్వారా వినియోగదారులు తమకు అందిన మద్యం బాటిల్‌పై ఉన్న క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేసి దాని ప్రామాణికతను నిర్ధారించునే అవకాశం కలిగింది.
మరోవైపు స్కాన్ చేసిన తరువాతే మద్యం విక్రయాలు జరపాలని ఎక్సైజ్ కమీషనర్ ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్ 13 నుండి 18 వరకు యాప్‌ను 79 వేల మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ కాలంలో మొత్తం 1,81,738 స్కాన్లు జరగగా, వాటిలో 1,74,687 లేబుల్స్ నిజమైనవిగా తేలాయి. మిగిలిన 3,152 స్కాన్ల పరంగా డ్యామేజ్ లేబుల్స్, తప్పు అక్షర-సంఖ్యా కోడ్లు వంటి కారణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిని వియోగదారులకు విక్రయించకుండా వెనక్కి పంపించారు.
ఎక్సైజ్ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం, యాప్ ద్వారా సేకరించిన సమాచారం నకిలీ మద్యం కదలికలను గుర్తించడంలో ముఖ్యపాత్ర పోషిస్తోంది. ఈ యాప్ వినియోగదారుల ద్వారా వచ్చిన నివేదికలను విశ్లేషిస్తూ, అధికారులు ప్రతి ప్రాంతంలో లేబుల్స్‌ను ధ్రువీకరిస్తున్నారు. నకిలీ లేదా చెల్లని కోడ్ కనుగొనబడిన వెంటనే సిస్టమ్ స్వయంచాలకంగా అలర్ట్ ఇస్తుందని అధికారులు పేర్కొన్నారు. యాప్ పారదర్శకతను పెంచడమే కాకుండా, వినియోగదారుల అవగాహనను కూడా పెంచుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా నకిలీ మద్యం దందా నియంత్రణలో భాగంగా ఇప్పటి వరకు 5000 శాంపిల్స్ ను ఎక్సైజ్ శాఖ తనిఖీ చేసింది. అన్ని సక్రమంగానే ఉన్నట్టు గుర్తించారు. మొలకల చెరువు, ఇబ్రహీంపట్నం కు సంబంధించి గుంటూరులోని ప్రయోగశాలకు 45 మద్యం శాంపిళ్లను పంపించింది. ల్యాబ్‌లో నిర్వహించిన రసాయన పరీక్షల్లో కొన్ని నమూనాలు నాణ్యత ప్రమాణాలు అందుకోలేకపోయినట్లు తేలింది. ఆల్కహాల్ శాతం తక్కువగా ఉన్న విషయాన్ని గుర్తించారు. ఈ ఫలితాల ఆధారంగా మరింత లోతుగా పరిశోధనలు కొనసాగుతాయని, నాణ్యత ప్రమాణాలు ఉల్లంఘించిన తయారీదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని శాఖ ప్రకటించింది.
అధికారికంగా సీల్ చేసిన బాటిల్స్ మాత్రమే కొనుగోలు చేయాలని, అనుమానాస్పద బాటిల్ కనిపించినప్పుడు వెంటనే సురక్ష యాప్ ద్వారా స్కాన్ చేయాలని సూచించింది. నకిలీ లేదా చెల్లని కోడ్ గుర్తిస్తే దాన్ని వెంటనే తిరస్కరించాలని ప్రజలను కోరింది. నకిలీ మద్యం తయారీ, నిల్వ, సరఫరా లేదా అమ్మకాలలో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పారదర్శకతను పెంచే దిశగా ఎక్సైజ్ శాఖ తీసుకున్న ఈ చర్య రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు పొందుతోంది. సురక్ష యాప్ ద్వారా ప్రజల భాగస్వామ్యం పెరగడం, వ్యవస్థపై నమ్మకం మరింత బలపడడం మద్యం నియంత్రణలో పెద్ద ముందడుగుగా నిలుస్తోంది.