తెలుగు రాజకీయాల్లో నారా లోకేష్ కు ఇంటర్న్ షిప్ పూర్తి అయింది. ఆ విషయాన్ని ఎవరో పెంటపాటి పుల్లారావు చెప్పడం కాదు.
సూపర్ జీ ఎస్ టీ… సూపర్ సేవింగ్స్ సభ సందర్భంగా మొన్న కర్నూల్ వచ్చిన భారత ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా చెప్పారు.లోకేష్ ప్రొబేషన్ ను ఆయనే డిక్లేర్ చేశారు. “త్వరలోనే మీ నాన్నలాగా అవుతావు…” అంటూ సర్టిఫికెట్ ప్రదానం కూడా చేసేశారు.
“ఇక, మీ నాన్న చెప్పుల్లో నీ కాళ్ళు పెట్టె సమయం వచ్చేసింది. గుడ్ లక్ ” అంటూ నరేంద్ర మోడీ నర్మ గర్భితం గా చెప్పారు. పనిలో పనిగా, మీరు తప్పుకోగుడదూ అనే సందేశాన్ని చంద్రబాబుకు కూడా ప్రధాని ఇచ్చారు.
తెలుగుదేశం పార్టీ కి సంబంధించినంత వరకు, లోకేష్ కే ప్రధానమంత్రి ఎక్కువ (మొదటి ) ప్రాధాన్యం ఇస్తున్నట్టు కనబడుతున్నది. మొన్న సెప్టెంబర్ 5 వ తేదీన నారా లోకేష్ ను ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఢిల్లీ పిలిపించుకుని ; దాదాపు 45 నిముషాలు ఆత్మీయంగా మాట్టాడారు.
అంతకు ముందు, ఈ ఏడాది మే 17 న లోకేష్, ఆయన భార్య బ్రహ్మణి, కుమారుడు దేవాన్ష్ ప్రధాన మంత్రితో గంటసేపు ఢిల్లీ లో ఆత్మీయంగా గడిపారు.ఇది చిన్న విషయం కాదు. చంద్రబాబు నాయుడే ఇంతవరకు భువనేశ్వరితో కలిసి ప్రధానమంత్రిని కలవలేదు.
బీజేపీ ముఖ్యమంత్రులకు కూడా ప్రధాన మంత్రి అప్పాయింట్ మెంట్ ఓ పట్టాన దొరకదు. దొరికినా…. “ఎస్… నో… ఆల్ రైట్…” అన్నట్టుగా, “కట్టే… కొట్టే… తెచ్చే…” రీతిలో ఉంటుంది.
ప్రధానితో లోకేష్ సమావేశం ఆ విధం గా జరగలేదు. దీనిని బట్టి, తెలుగుదేశం పార్టీ కి నారా లోకేష్ ను మూడోతరం అధినేత గా బీజేపీ అధినేతలు గుర్తించారనే భావించవచ్చు.
విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఆ సంస్థ తో ఒప్పందం విషయం లో కూడా నారా లోకేష్ లీడ్ తీసుకుని, వ్యవహరించిన తీరును ; ఇతర ఐ టీ కంపెనీలను విశాఖకు తీసుకు రావడానికి చేస్తున్న కృషిని రాష్ట్రం గమనిస్తున్నది.
పాలనా పరంగా దూసుకుపోతున్న నారా లోకేష్ ; రాజకీయ పరంగా కూడా తండ్రిని మరిపిస్తున్నారు. మంగళగిరి నియోజక వర్గం నుంచి 90 వేలకు పైబడిన ఆధిక్యతతో విజయం సాధించడమే ఇందుకు నిదర్శనం. రాయలసీమ లోని కుప్పం తో పాటు ; కోస్తా ఆంధ్ర లోని కృష్ణా- గుంటూరు బెల్ట్ కు గుండెకాయ వంటి మంగళగిరిని కూడా నారా వారి కాంపౌండ్ కు చేర్చిన ఘనత నారా లోకేష్ దే కదా!
దీనికి తోడు, వైసీపీ కాంగ్రెస్ లోని అక్రమార్కుల పట్ల కఠినం గా వ్యవహరించడం లో గానీ, ఆ పార్టీ విసురుతున్న సవాళ్ళ ను ధృడంగా ఎదుర్కొనడంలో గానీ చంద్రబాబు నాయుడు ప్రదర్శిస్తున్న అలసత్వపు తీరు కూడా దారుణం గా ఉన్నదని టీడీపీ కార్యకర్తలు వాపోతున్నారు. అదే… నారా లోకేష్ ఐతే ఆ క్లెప్టోక్రసీ గ్యాంగ్ లను తొక్కి నార దీస్తారని ఒక పరిశీలకుడు వ్యాఖ్యానించారు.
పేర్ని నాని, జోగి రమేష్ ను సమాజం నుంచి బహిష్కరించాలని గన్నవరం ఎం ఎల్ ఏ యార్లగడ్డ వెంకట్రావు రెండు రోజుల క్రితం బహిరంగంగా ప్రకటించారు. ముఖ్యమంత్రి స్పందించలేదు. యార్లగడ్డ వెంకట్రావు చెప్పింది తప్పు అయితే, వెంకట్రావ్ ను మందలించాలి.” అంతంత పెద్ద మనుషుల్ని పట్టుకుని అలా అనవచ్చా వెంకట్రావు? ” అంటూ సీ ఎం – క్లాస్ తీసుకోవాలి. లేదా, వెంకట్రావు చెప్పింది కరెక్టే అనుకుంటే, వారిద్దరినీ ఏం చేయాలో అది చేయాలి.
ముఖ్యమంత్రి ఈ నిష్క్రియాపరత్వమే టీడీపీ శ్రేణులకు మింగుడు పడడం లేదు.
అందుకే, తెలుగుదేశం మూడో తరం యువ కార్యకర్తలు…. ప్రధాన మంత్రి చెప్పినంత స్మూత్ గా “ఆ ” విషయం చెప్పడం లేదు. లోకేష్ ముఖ్యమంత్రి కావాలి అని డైరెక్ట్ గానే చెబుతున్నారు, ఆయా జిల్లాల్లో జరుగుతున్న పార్టీ సమావేశాల్లో. చంద్రబాబు ఇంకెంతకాలం అని కూడా వారు ప్రశ్నిస్తున్నారు.
ఇక్కడి దాకా రావడానికి, నిజానికి లోకేష్ చాలా… చాలా శ్రమించారనే చెప్పాలి .
ఎన్నికలకు ముందు, సభ్యత్వాల రూపంలో కార్యకర్తల కు ఇన్సూరెన్సు సౌకర్యం కల్పించడం తో పాటు, మెంబర్షిప్ డ్రైవ్ చేపట్టి, సభ్యుల సంఖ్యను ఒక కోటి దాటించారు. 2024 లో ఈ సంఖ్య 73 లక్షలే. యువ గళం పాదయాత్ర…. లోకేష్ వ్యక్తిత్వాన్ని బాగా సానబట్టింది. ‘రాజకీయ నడవడిక ‘ ను రాటుదేల్చింది.ఈ విషయాన్ని లోకేష్ మాతృమూర్తి భువనేశ్వరి ధ్రువీకరించారు కూడా. “లోకేష్ ఈ పాదయాత్ర తో బాగా ముదిరిపోయాడు ” అంటూ సర్టిఫికెట్ ఇచ్చారు.
లోకేష్ ను హేళన చేయడానికి…. గాలికి ఎగిరి అమరావతి వచ్చిన వారు… ఆ గాలికే కొట్టుకుపోయారు.
ఇప్పుడు ఈ గాలి సరుకు ఎక్కడా కనపడడం లేదు. కానీ, లోకేష్ అప్పుడూ ఉన్నారు, ఇప్పుడూ ఉన్నారు. తెలంగాణకు ముఖ్యమంత్రిగా కేసీఆర్ పనిచేసే రోజులలో ( అంటే… గతించిన కాలం లో ) కేసీఆర్ కుమారుడు కేటీఆర్ పని తీరుతో… లోకేష్ పని తీరును పోల్చుతూ పలు రకాల వ్యాఖ్యానాలు రాజకీయాల్లో షికార్లు చేసేవి. కేటీర్ హీరో అని ; లోకేష్ జీరో అంటూ టీడీపీ వ్యతిరేక మీడియా లో ప్రచారం గట్టిగా సాగింది.
కేటీఆర్…. రేపో మాపో ముఖ్యమంత్రి కాబోతుంటే; లోకేష్ ఎక్కడ అనే ప్రచారం కూడా ఉదృతం గా సాగింది.
కానీ, ముఖ్యమంత్రి పదవి కేటీఆర్ కు అందని ద్రాక్ష గానే మిగిలిపోతే ; ఆ పదవి ముంగిట్లో లోకేష్ నిలబడి ఉన్నారు.
లోకేష్ ఇప్పుడే ముఖ్యమంత్రి కావాలని టీడీపీ శ్రేణులు బలం గా కోరుకోవడానికి కారణాలు లేకపోలేదు.
అన్నింటికన్నా ముఖ్యంగా…. అసత్యమేవ జయతే అంటూ అబద్దాలతో చెలరేగిపోతున్న వైసీపీ గ్యాంగులను చంద్రబాబు కట్టడి చేయలేక పోతున్నారనే భావం టీడీపీ శ్రేణుల్లో బలంగా ఉంది. మంత్రులు, శాసనసభ్యుల వ్యవహార శైలి పై చంద్రబాబు హెచ్చరికల వరకే పరిమితం అవ్వడం టీడీపీ శ్రేణులకు ఆందోళన కలిగిస్తున్నది.
అందుకే, లోకేష్ కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించాలని కార్యకర్తలు అంటున్నారు.
తమ కొడుకు… తమ కళ్ళ ముందే…ముఖ్యమంత్రిగా శత్రుమూకలపై వీర విహారం చేయడాన్ని చూడడాన్ని మించిన జీవిత సాఫల్యం చంద్రబాబు నాయుడు కు, భువనేశ్వరి కి ఏమి ఉంటుంది!?
*ఆలస్యం అమృతం విషం*
*భోగాది వేంకట రాయుడు*