తెలంగాణలో కుల ఉన్మాదులు, ప్రాంతీయతా ఉన్మాదులు చెప్పుదెబ్బ కాదు చావుదెబ్బ తిన్నారు! తెలంగాణా ప్రజలు కుల ఉన్మాదుల్ని, ప్రాంతీయతా ఉన్మాదుల్ని చెప్పుదెబ్బ కాదు చావుదెబ్బ కొట్టారు! మహా గాయకుడు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ప్రతిష్ఠ వివాదంలో తెలంగాణా ప్రజలు పూర్తిగా కుల, ప్రాంతీయతా ఉన్మాదానికి అతీతంగా స్పందించారు. తెలంగాణా ప్రజలకు కృతజ్ఞత, అభినందనలు. తెలంగాణా వాదం ముసుగులో ఉన్న తెలంగాణా ప్రజా విరోధ దుష్ట శక్తులకు బుద్ధి చెప్పారు ప్రజలు. కుల, ప్రాంతీయతా ఉన్మాదానికి అతీతంగా తెలంగాణా ప్రజలు ఒక గొప్ప కళాకారుణ్ణి గొప్పగా ఆదరించారు; బాలు విగ్రహ ప్రతిష్ఠకు సానుకూలంగా నిలబడ్డారు.
దేశమంతా అసహ్యించుకునే పని చేశారు తెలంగాణా కుల, ప్రాంతీయతా వాదులు. నిజానికి ఈ కుల, ప్రాంతీయతా ఉన్మాదులు తెలంగాణా ప్రజల మనుషులు కారు; తెలంగాణా తెలుగు ప్రజలు వీళ్లను అసహ్యించుకుంటున్నారు. రవీంద్రభారతిలో ఎస్. పీ. బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ప్రతిష్ఠ విషయంగా జరిగిన రచ్చ తెలంగాణా వాదాన్ని, కుల ఉన్మాదాన్ని, ప్రాంతీయతా ఉన్మాదాన్ని రగిలించే కుట్ర అని తెలుసుకోవడం పెద్ద విషయమేమీ కాదు. ‘ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం తెలంగాణా జాతీయ గీతం పాడడానికి ఒప్పుకోలేదు’ అన్న ఆరోపణ రాద్ధాంతంలో ప్రధానంగా ఉంది. బాలు తెలంగాణా గీతం పాడడానికి ఒప్పుకోలేదు అనడం పూర్తిగా అబద్ధం. ‘ఒకటి జరిగితే మరొకటి చెప్పడం’ అనే నీచత్వం ఇది.
తెలంగాణా ఉద్యమం ప్రారంభ దశలో అంటే ఉద్యమం ఉద్ధృతం అవడానికి ముందు ‘ఒక పార్టీ గీతం’గా అందెశ్రీ తాను రాసిన గీతాన్ని పాడమని అడిగితే పార్టీలు, ప్రాంతీయతలు, రాజకీయ వేర్పాటు వాదాలకు తాను అతీతంగా ఉండాలనుకున్న ఒక సరైన కళాకారుడిగా బాలు ఆ పాటను పాడను అన్నారు. అప్పటికి తెలంగాణా రాష్ట్రం, ఆ రాష్ట్ర నిర్మాణం, రాష్ట్రం రూపురేఖలు అన్నవి సాకారం కాలేదు; రాష్ట్రం ఏర్పడుతుందో లేదో తెలియని స్థితి. ఆ పరిస్థితిలో ఒక రచనను తెలంగాణా రాష్ట్ర గీతం అనడమే పెద్ద తప్పు. బాలు దాన్ని ఒక పార్టీ గీతంగానే చూశారు కనుక పాడలేదు. ఒక ఉద్యోగి తన ఉద్యోగ పరిమితులతో పనిచేయాల్సి ఉంటుంది; ఒక ఉపాధ్యాయుడు సిలబస్, పాఠశాల విధానాలకు లోబడి పని చెయ్యాలి.
ఒక కళకు, ఒక పరిశ్రమకు సంబంధించిన వ్యక్తిగా బాలు ఆ పనే చేశారు. తాను ఒక గాయకుడిగా రాజకీయాలలోనూ, వివాదాలలోనూ, చిక్కుల్లోనూ ఇరుక్కోకూడదన్న సరైన ఆలోచనతో బాలు ఆ పాటను పాడలేదు. ఈ మామూలు విషయాన్ని కూడా అర్థం చేసుకోకపోవడం అజ్ఞానం, మూర్ఖత్వం, దుష్టత్వం, దారుణం అవుతుంది. (బాలు ఇతరత్రా కూడా కొన్ని పాటలను పాడనని పాడలేదు) అందెశ్రీ తెలంగాణా గీతాన్ని తొక్కిపట్టింది కె.సీ.ఆర్! బాలు కాదు; అందెశ్రీ తెలంగాణా గీతాన్ని నిరాకరించింది కె.సీ.ఆర్! బాలు కాదు. ఒక తెలంగాణా ఉద్యమకారుడు కె.సీ.ఆర్. అందెశ్రీ రాసిన తెలంగాణా గీతాన్ని తిరస్కరించారు.
ఇవాళ్టి కులోన్మాదులు, తెలంగాణా ప్రాంతీయతా వాదులు కె.సీ.ఆర్.ను ఈ విషయంలో ఎందుకు దోషిని చెయ్యడం లేదు? తెలంగాణా గీతాన్ని పాడని బాలు విగ్రహాన్ని అడ్డుకుంటున్న శక్తులు ఆ గీతాన్ని తిరస్కరించి తొక్కిపట్టిన కె.సీ.అర్.ను ఏం చెయ్యాలి? (ఈ తెలంగాణా గీతం ప్రభుత్వ ఆధికారిక గీతంగా కీరవాణి సంగీతం చేసిన సందర్భంలో అందెశ్రీ పెద్ద ఎత్తున దూషించబడుతున్నప్పుడు అందెశ్రీని సమర్థిస్తూ నేను జాతీయ, అంతర్జాతీయ ఉదంతాల ఉదాహరణలతో బహిరంగంగా ‘దిశ’ పత్రికలో వ్యాసం రాశాను. సాధికారికంగా, సోదాహరణంగా అందెశ్రీని సమర్థించింది నేనే) ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ప్రతిష్ఠ అన్న ఆలోచన, ప్రయత్నాలు, సన్నాహాలు ఇప్పటివి కావు. ఆరేడేళ్ల క్రితంవి. ఇది ప్రభుత్వ నిధులతో జరుగుతున్నది కాదు. పలువురు సంగీత కళాకారులు తమ డబ్బుతో బాలుకు సంగీత నివాళిగా ఈ పనికి పూనుకున్నారు. గత తెలంగాణ ప్రభుత్వం ఈ బాలు విగ్రహ ప్రతిష్ఠను తొక్కిపట్టింది. ఇప్పటి ప్రభుత్వం ఆచరణలోకి తీసుకొస్తోంది.
ఈ బాలు విగ్రహ ప్రతిష్ఠ విషయంలో జరుగుతున్న రచ్చకు గత ప్రభుత్వ పార్టీ ప్రోద్బలం, రాజకీయ దురుద్దేశం ఉన్నాయని అనుకోవచ్చు కదా? ‘రవీంద్రభారతిలో ఆంధ్ర వ్యక్తి విగ్రహం ఉండకూడదు’ అని అరుస్తున్న వాళ్లు బుద్ధితో, చదువుతో, విజ్ఞతతో ఆలోచించి ప్రవర్తించాలి. రవీంద్రభారతి అన్న పేరులోని రవీంద్ర అన్నది తెలంగాణ వ్యక్తిదా? అసలు హైదరాబాద్ అన్న పేరు తెలంగాణాదా? తెలుగుదా? తెలంగాణాలో ముస్లీమ్ పేర్లతో ఉన్న ఊర్ల పేర్లు తెలంగాణావో, తెలుగువో కావు కదా? మరి అవీ ఉండకూడదు కదా? రవీంద్రభారతిలో ఎస్.పీ.బీ. విగ్రహం ఉండకూడదు అన్నదానికి ప్రాంతీయతను కారణంగా చేసి రచ్చ చేస్తున్న శక్తులు అదే బాలుకు తమిళ్షులు, కన్నడిగులు తమ తమ ఊర్లలో ఇచ్చిన స్థానం తెలుసుకుని సిగ్గుపడాలి.
ఆ తమిళ్షులు, కన్నడిగులకు లేని ప్రాంతీయతా ఉన్మాద వ్యాధి తెలంగాణా ప్రాంతీయతా వాదులకు మాత్రం ఎందుకు ఉంది? అసలు ఈ తెలంగాణా వాదులు నిజమైన తెలంగాణా వాదులేనా? ఈ ప్రాంతీయతా ఉన్మాదాన్ని, తెలంగాణా వాదులు అన్న ముసుగులో ఉన్న దుష్టశక్తుల్ని తెలంగాణా ప్రజలు పూర్తిగా తిరస్కరిస్తున్నారు! సోషల్ మీడియా ఈ నిజాన్ని గట్టిగా తెలియజేస్తోంది. తెలంగాణా ప్రజలందరూ బాలు వైపున నిలబడ్డారు! ఈ రచ్చ వెనుక హిందూ వ్యతిరేక శక్తులు ఉన్నాయేమో అన్న ఆలోచన కూడా కలిగి భయం వేస్తోంది.
బాలు స్వచ్ఛమైన హిందువు. బాలు నక్సలైట్, కమ్యూనిస్ట్ కాదు కనుక ఈ విషయంగా దేశ, సమాజ వ్యతిరేక శక్తులు, కులోన్మాదులు తెలంగాణా వాదం ముసుగులో రాద్ధాంతం చేస్తున్నాయా? బాలు కమ్యూనిస్ట్, నక్సలైట్ అయుంటే అసలు ఈ రచ్చ జరిగేదా? బాలు ముస్లీమ్ అయుంటే ఈ రచ్చ జరిగేదా? బాలు హిందువు, బ్రాహ్మణుడు అవడం వల్ల ‘అగ్రవర్ణం, ఆధిపత్య వర్గం అంటూ కంపు కొట్టే పాత కుళ్లు మాటలతోనూ కొందరు తమ వికారాన్ని వెళ్లగక్కుకుంటున్నారు. బాలు దళితుడు కాదు కాబట్టి ఆయన విగ్రహం ఉండకూడదట. హిందీ సినిమా సంగీత దర్శకుడు శంకర్ (జైకిషన్) అన్న తెలుగు దళితుడి విగ్రహం ఉండాలట. దేశంలోని అత్యున్నత సంగీత దర్శకుడు శంకర్ తెలుగు వ్యక్తో, దళితుడో కాదు. శంకర్ పంజాబీ వ్యక్తి. ఆయన హైదరాబాదులో కొంత కాలం వసించారు.
ఆయన పూర్తి పేరు శంకర్ సింహ్ రామ్ సింహ్ రఘువంశీ. రఘువంశీ అన్న వంశ లేదా కుటుంబ నామం ఉన్న వ్యక్తి తెలుగు దళితుడు అవడు. ‘తెలుగు కులోన్మాదులకు, ప్రాంతీయతా ఉన్మాదులకు చదువు, తెలివిడి, లోక జ్ఞానం ఉండవు’ అన్న క్షేత్ర వాస్తవాన్ని ఈ శంకర్ తెలుగు దళితుడు అనడం అనే వికారం తెలియజేస్తోంది. దేశంలోని ఇతర భాషల్లో లేనంతగా కుల వక్రీకరణ, కులోన్మాదం, ప్రాంతీయతా ఉన్మాదం తెలుగులో మాత్రం ఎందుకు పేరుకొనిపోయాయి? ‘బాలు విగ్రహ ప్రతిష్ఠ రాద్ధాంతం ఒక హైందవ వ్యతిరేక కుట్ర’ గా కూడా పరిగణించాలేమో? హిందూ సమాజంపై విదేశీ మతోన్మాదం చేసిన కుట్రా ఇది? ఈ విషయంగా తెలంగాణా ప్రజలు బాలు వైపు నిలబడి ఉండడం ఈ సందేహానికి ఊతం ఇస్తోంది.
‘తెలంగాణా తెలుగు ప్రజలకు వ్యతిరేకంగా జరిగిన కుల, మత కుట్ర ఈ ఉదంతం’ అని తెలుసుకోవాలేమో? కుల, భాష, ప్రాంతీయతా ఉన్మాదాలకు అతీతంగా తమిళ్ష్ చెన్నైలో ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం వీధి ఉంది. ఇది నగరంలోని ఒక ప్రధానమైన ప్రదేశంలో ఉంది. ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం వీధి పేరు పెట్టడానికి ప్రతిపాదనలు, ఫైల్ పుటప్, లాబీయింగ్, ఆరేడేళ్ల నిరీక్షణ వంటివి లేవు. స్వయంగా ముఖ్యమంత్రి స్టాలిన్ నిర్ణయం తీసుకుని అమలు చేసేశారు. ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం వీధి పేరు పలకను ఉపముఖ్యమంత్రి ఉదయనిది ఆవిష్కరించారు. ఆ స్ఫుర్తితో డిసెంబర్ 15న (?) రవీంద్రభారతిలో తెలంగాణా ముఖ్యమంత్రి స్వయంగా బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఆవిష్కరిస్తే ఎంతో గొప్పగా ఉంటుంది.
రాష్ట్రానికి, దేశానికి ఒక గొప్ప సందేశం వెళుతుంది. ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ప్రతిష్ఠ విషయంలో తెలంగాణా ప్రజా వ్యతిరేక కులోన్మాదులు, ప్రాంతీయతా ఉన్మాదులు, హైందవ వ్యతిరేక దుష్టశక్తులు తెలంగాణా తెలుగు ప్రజల చేతిలో ‘చెప్పుదెబ్బ కాదు.. చావుదెబ్బ’ తిన్నారు. ఆనందకరమైన పరిణామం ఇది. ‘తెలంగాణా స్పృహ’ అవసరం; తెలంగాణా ఉన్మాదం హానికరం. ఈ విజ్ఞతతో తెలంగాణా తెలుగు ప్రజలు దేశ ప్రజల్లో గౌరవనీయమైన స్థానాన్ని పొందాలి.
తథాస్తు.
– రోచిష్మాన్ 9444012279

