– ఏ పార్టీలో కి వెళ్ళినా, కేసుల్లో నుండి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన కొడుకు తప్పించుకోలేరు
– బాలినేని చేసిన అక్రమాలను బయటకు తీస్తాం
– మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పై ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ ఫైర్
ఒంగోలు: వైసీపీకి రాజీనామా చేసి, త్వరలో జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై.. ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత ఐదేళ్ల వైసీపీ హయాంలో.. బాలినేని చేసిన అక్రమాల నుంచి ఆయనను జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా కాపాడలేరన్న సంచలన వ్యాఖ్య ఒంగోలు రాజకీయాలను వేడిపుట్టిస్తోంది. అవసరమైతే రాజకీయాలు విరమించుకుంటానన్న జనార్దన్ వ్యాఖ్య, టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశమయింది.
ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ ఏమన్నారంటే.. వైసీపీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు పోరాటం చేశాం.ఒంగోలులో టీడీపీ శ్రేణులు పై బాలినేని అక్రమ కేసులు పెట్టించారు. నాపై 32 కేసులు పెట్టారు. మా నాయకుడు చంద్రబాబుని కూడా బాలినేని దూషించారు. అధికారం పోయి 100 రోజులు గడవకముందే బాలినేని పార్టీ మారుతున్నారు.
ప్రకాశం జిల్లాలో వైసీపీ ని బాలినేని సర్వనాశనం చేశాడు. జనసేనలో చేరకముందే బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఏ పార్టీలో కి వెళ్ళినా, కేసుల్లో నుండి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన కొడుకు తప్పించుకో లేరు. గత ఐదేళ్లలో బాలినేని చేసిన అక్రమాలను బయటకు తీస్తాం. బాలినేని చేసిన అక్రమాల నుండి పవన్ కళ్యాణ్ కూడా కాపాడలేరు.
ఎన్నికల్లో కష్టపడి పని చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులకి అండగా ఉంటాం. పార్టీలు మారే పరిస్థితి వస్తే మేము రాజకీయాలు కూడా మానుకుంటాం.