మంత్రి అనగాని సత్యప్రసాద్
అమరావతి: పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తొందని రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఇచ్చిన హామీల్లో కేవలం 13 శాతం మాత్రమే అమలు చేసి ప్రజలకు పంగనామాలు పెట్టిన జగన్ కు హామీల అమల్లో చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు లేదన్నారు.
జగన్ ను రాష్ట్ర ప్రజలు మాత్రమే కాదు.. ఆయన పార్టీ నేతలు కూడా వద్దనుకుంటున్నారని చెప్పారు. అందుకే పొలోమని పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు రాజీనామాలు చేసి ఇతర పార్టీల్లో చేరుతున్నారని చెప్పారు. ఈ కారణంగానే విశాఖ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్లోనే కాదు.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ వైసీపీకి ఓటమి ఖాయమని అన్నారు.
వరుసగా అన్ని ఎన్నికల్లో ఓడిపోతున్నా జగన్ కు తత్వం బోధపడడం లేదని, ఓటమి నుండి పాఠాలు నేర్చుకోలేదని ధ్వజమెత్తారు. ఓటమిని జీర్ణించుకోలేని జగన్ రెడ్డి అధికారం కోల్పొయి కొద్ది రోజులు కూడా కాకముందే అప్పుడే తాను మళ్లీ సిఎం కుర్చిపైన కూర్చొంటానంటూ పగటి కలలు కంటున్నారని అన్నారు. జగన్ మానసిక స్థితి బాగోలేదని ఆయన చెల్లెలు చెప్పింది నిజమే అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారని అన్నారు.
ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలలకే అన్ని వ్యవస్థలూ విఫలమయ్యాయంటూ జగన్ పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ పాలన చేసిన గాయాల నుండి ప్రజల ఇంకా కోలుకోలేదని, 11 సీట్ల మాత్రమే ఇచ్చి ఆ పార్టీని అధ:పాతాళానికి తొక్కిన ప్రజలు.. జగన్ పై ఇంకా కోపంగానే ఉన్నారని, ఆ విషయాన్ని గుర్తించని జగన్ అబద్దాలు వల్లె వేసే అలవాటు ప్రకారం చంద్రబాబు ప్రభుత్వంపై బురద చల్లాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
నిజంగా జగన్ ప్రజలకు బిర్యానీనే పెట్టి ఉంటే ఎన్నికల్లో ప్రజలెందుకు దారుణంగా ఓడించారని ప్రశ్నించారు. ప్రజలకు తక్కువ అంచనా వేయడం మంచి కాదని జగన్ గ్రహించాలని, ఎవరినైనా ఒక్కసారే మోసం చేయగలమని, ఎల్లవేళలా కాదని జగన్ తెలుసుకోవాలని హితవు చెప్పారు. గత ప్రభుత్వంలో ఆకలి మంటలతో భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు జగన్ మర్చిపోయినా ప్రజలు మర్చిపోలేదని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు.