న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో చట్టబద్దత కల్పించిన నాలుగు లేబర్ కోడ్స్‌పై ఇప్పటికే అనేక రాష్ట్రాలు నియమ, నిబంధనలను నోటిఫై చేసినట్లు కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలి వెల్లడించారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు ఆయన జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. కోడ్ ఆన్ వేజెస్ 2019కి సంబంధించి కేంద్రాపాలిత ప్రాంతాలతోపాటు 28 రాష్ట్రాలు నియమ నిబంధనలను నోటిఫై చేశాయి. ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్‌కు సంబంధించి 23 రాష్ట్రాలు, సోషల్ సెక్యూరిటీ కోడ్‌కు సంబంధించి 22 రాష్ట్రాలు, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం కోడ్‌కు సంబంధించి 18 రాష్ట్రాలు ఇప్పటి వరకు నియమ నిబంధనలను నోటిఫై చేసినట్లు మంత్రి చెప్పారు.
లేబర్ కోడ్స్‌పై ఆయా రాష్ట్రాలు రూల్స్‌ను నోటిఫై చేసేందుకు గడువు విధించే అంశం కేంద్ర ప్రభుత్వం పరిశీనలో ఉందా అన్న మరో ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ కార్మిక శాఖ అనేది రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో అంశం. కార్మికులకు సంబంధించి నియమ నిబంధనలు రూపొందించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. అందువలన కేంద్రం లేబర్ కోడ్స్‌పై చట్టం చేసిన తర్వాత వాటికి సంబంధించిన నియమ నిబంధనలను రూపొందించేందుకు ఆయా రాష్ట్రాలు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. దీనిపై కేంద్రం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో తరచుగా సమావేశాలు నిర్వహిస్తోందని చెప్పారు.