ఎన్టీఆర్..
ఒక ఆవేశం..
ఒక అభినివేశం..
ఒక ఆలాపన..
ఒక ఆలంబన..
ఒక మెరుపు..
ఒక మైమరపు..
ఒక చరుపు..
ఉవ్వెత్తున ఎగసి పడే తరంగం
స్వేచ్ఛా విహంగం..
ఆయన ఆహార్యం విలక్షణం
వ్యవహారం సలక్షణం..
ఆయన జీవితం చరిత్ర
మరవదు ఈ ధరిత్రి!
పుట్టిన ప్రతి మనిషి గిట్టకపోడు
మళ్లీ పుట్టక పోడు..
కాని ఎన్టీఆర్ లాంటి
ఓ మనిషి ఎన్ని యుగాలైనా
మళ్లీ పుట్టుకురాడు..!
అందుకే రామారావు..
నూటికో కోటికో ఒక్కడు..
ఒకే ఒక్కడు
ఎన్టీఆర్…
ఇలాంటి ఓ వ్యక్తి పరిశ్రమకు
రానట్టయిటే..
ఏదీ ఆగదు..
కానీ చాలా పుట్టవు..
అందమైన కృష్ణయ్య అల్లరి..
సీత దూరమై
క్షోభిల్లిన రామయ్య
వదనం..
దుర్యోధనుని దర్పం..
రావణుడి రుద్రవీణ వాదనం
కీచకుని మదం..
తన వంశం నిహతం
అవుతుంటే భీష్ముని పరితాపం..
వాల్మీకి రమణీయ రామాయణ రచనా విన్యాసం..
మనోహరమైన
బృహన్నల నర్తనం..
అదే నవ్యరూపం సవ్యసాచిగా మారిన వైనం..
ఓరోరి.. మాయాజ్యూత విజయా..
మదమదోన్మత్తా
సుయోధనా..
ఆంటూ కురుసభలో వృకోదరుని వీరంగం..
దక్షయజ్ఞ వినాశ వేళ
ముక్కంటి ముక్కోపం..
ఇరువురు భామల కయ్యంలో నలిగి కరకు రాయిగా మారిన వెంకన్న
నిజరూపం..
అంత గొప్పగా..
కన్నులకింపుగా చూసే భాగ్యం మనదగునా..
అది నందమూరికి
మాత్రమే చెల్లిన విశ్వరూపం..
అలా కుదిరింది
ఆయన రూపం..!
అంతేనా..
చదువు రాని వాడని దిగులు
చెందిన అమాయక మోము..
అలిగిన వేళనే చూడాల్సిన
గోకుల కృష్ణుని అందాలు..
అంతకు మునుపే అంజిగాడి
పిండి రుబ్బుడు..
కసిగా ఉంది..కసికసిగా ఉందంటూ వాణిశ్రీని
కుమ్మేసిన ఓ రకం పోకిరీ..
దేవుడు చేసిన మనుషుల్లారా..
అదే పాటలో వివేకానంద..
హిప్పీ.. బాండు బాబు..
అబ్బో..అదెంత డాబు..
పాపారాయుడి ఉగ్రరూపం..
కోర్టు బోనులో
బొబ్బిలిపులి గాండ్రింపులు..
చండశాశనుడి మీసాలు..
వీరబ్రహ్మేంద్రస్వామి
నిండైన గెటప్పు..
విశ్వామిత్రుని సెటప్పు..
మేజర్ చంద్రకాంతుని గాంభీర్యం..
పనిలో పనిగా వీరపాండ్య..
అల్లూరి..భగత్ సింగ్..
నేతాజీ…ఎన్ని అవతారాలు..
మురిసిపోయేలా తరాలు..!
తారక రామారావు…
పురుషులందు పుణ్యపురుషుడు..
నూటికో కోటికో ఒక్కడు..
ఎక్కడో ఎప్పుడో పుడతాడు
అది మీరే మీరే మాస్టారు..!
నందమూరి తారక రామారావు
జయంతి సందర్భంగా ప్రణామాలు..
-ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286