– రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఎన్టీఆర్ వంద రూపాయిల నాణెం విడుదల
– ఎన్టీఆర్ నాణెం విడుదల కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు కుటుంబ సభ్యులు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆగస్ట్ 28వ తేదీన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఎన్టీఆర్ వంద రూపాయిల నాణాన్ని విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
ఈ కార్యక్రమానికి హాజరుకావాలని ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానాలు పంపింది. అలాగే ఎన్టీఆర్‌తో పరిచయం ఉన్న పలువురు ప్రముఖులను సైతం ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలతోపాటు వారి కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లు కూడా హాజరవుతారని చెబుతున్నారు.
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ నాణెన్ని ముద్రించింది. 44 మిల్లీ మీటర్ల చుట్టుకొలతతో ఉండే ఈ వంద రూపాయిల నాణేన్ని 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్‌తో తయారు చేశారు.
అలాగే ఈ నాణేనికి ఓ వైపు మూడు సింహాలతో పాటు అశోక చక్రం ఉండగా మరోవైపు ఎన్టీఆర్ చిత్రం, ఆ చిత్రం కింద నందమూరి తారక రామారావు శతజయంతి అని హిందీ భాషలో ముద్రించారు. ఆయన శతజయంతి ఈ ఏడాదితో ముగిసింది కనుక 1923- 2023 అని ముద్రితమై ఉంటుంది.
మరోవైపు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆగస్ట్ 28వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ పర్యటనలోభాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులతో ఆయన సమావేశం కానున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో చోటు చేసుకొన్న అవకతవకలపై సీఈసీకి ఫిర్యాదు చేయడమే కాకుండా అందుకు తగిన సాక్ష్యాధారాలను సైతం, ఎన్నికల ఉన్నతాధికారులకు చంద్రబాబు అందజేయనున్నారు.
అలాగే రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అవకతవకలు చోటు చేసుకున్నాయని, వాటిపై రాష్ట్రంలోని జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోని పరిస్థితులు ఉన్నాయని, .ఈ అంశాన్ని సైతం కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల దృష్టికి చంద్రబాబు తీసుకు వెళ్లనున్నారు. అలాగే ఎన్టీఆర్ నాణెం విడుదల కార్యక్రమంలో కూడా పాల్గొంటారు.