–పేదల పక్షమా.. పెత్తందార్ల పక్షమా..?
– సుప్రీం తీర్పుపై వామపక్షాలు, ప్రజా సంఘాలు ఎందుకు స్పందించవు..?
– రాజధాని అంటే బాబు దృష్టిలో గేటెడ్ కమ్యూనిటీ ఏరియానా..?
– రాజధానిలో పేదలుండకూడదని మరోమారు ‘సుప్రీం’కి వెళ్లడం దుర్మార్గం
– పేదలపక్షాన పోరాడుతూ కొట్లాడుతున్న ప్రభుత్వం మాది
– పెత్తందార్ల కోసమే పనిచేసిది టీడీపీ
– అందుకే, జీవోనెం.45పై హైకోర్టు తీర్పును స్వాగతించలేదు
– పైగా, పేదలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు
– పేదలకు సమాన అవశాలుండాలనే అంబేద్కర్ సిద్ధాంతమే మా జగన్ ఆలోచన
-ఃఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్
హైకోర్టు ధర్మాసనం తీర్పును స్వాగతిస్తున్నాంః
మన రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్రప్రభుత్వం పేద ప్రజలకు ఇళ్లస్థలాలివ్వడా న్ని.. జీవో నెంబర్ 45ను సమర్ధిస్తూ పేదలకు అనుకూలంగా హైకోర్టు ధర్మాసనం నిన్న తీర్పునివ్వడాన్ని మేం స్వాగతిస్తున్నాం. ఈ రాష్ట్రంలో పేద ప్రజానీకానికి ఇళ్లుండాలని.. పేదలు నివాసం లేకుండా ఎక్కడా ఉండకూడదని ఒక మహాయజ్ఞంలా సుమారు 30 లక్షలమందికి ఇళ్లస్థలాలు పంపిణీ చేసిన ఘనత దేశచరిత్రలోనే ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి గారికే దక్కుతుంది. ఇందులో భాగంగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పేదలకివ్వడానికి భూములు అందుబాటులో లేకపోవడంతో అమరావతి ప్రాంతంలో కొంత భాగాన్ని ఎంపికచేసి పేదలకు నివాసం ఏర్పాటు చేస్తుంటే, దానిని టీడీపీ వ్యతిరేకించడం సమంజసం కాదు. ప్రభుత్వం తలపెట్టిన పేదలకు నివాసాల్ని అమరావతి ప్రాంతంలో కేటాయిస్తే ఇక్కడ డెమోగ్రఫిక్ ఇం బ్యాలెన్స్ వస్తుందనే వాదనతో వాళ్లు దాఖలు చేసిన పిటీషన్లను నిన్న హైకోర్టు ధర్మాసనం కొట్టేసింది.
పేదలకు వ్యతిరేకంగా టీడీపీ అప్పీల్ దుర్మార్గంః
పేదలకు, అణగారిన వర్గాల వారికి అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై నోరుమెదపకుండా టీడీపీ మరలా సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడం చాలా దారుణం, దుర్మార్గం, అన్యాయం. ఇది పేదప్రజలకు వ్యతిరేకమని నేను తెలియజేస్తున్నాను. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇళ్లు ఇస్తే దాన్ని సమర్ధిస్తూ ఇంతవరకు టీడీపీ ప్రకటన ఎందుకు ఇవ్వలేకపోయారు..? పేద ప్రజలకు ఇళ్లు కట్టడాన్ని టీడీపీ స్వాగతించకపోగా, తగుదునమ్మా.. అంటూ మళ్లీ సుప్రీంకోర్టుకి వెళ్లి పేదలకు ఇళ్లస్థలాలివ్వకూడదంటూ, తమ వాళ్ళ చేత అప్పీల్ పిటీషన్ వేయడం ఎంతవరకు సబబు..? అని ప్రశ్నిస్తున్నాను.
జగన్ చెప్పింది అక్షరాలా నిజంః
ఈరోజు పేదప్రజలకు వ్యతిరేకంగా టీడీపీ వ్యవహరిస్తున్న దుర్మార్గమైన తీరును చూస్తుంటే, ‘ఇది పేదలకు, పెత్తందార్లకు మధ్య జరుగుతున్న ‘క్లాస్‌వార్’ అని.. మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి గారు చెబుతున్న మాట వాస్తవమేనని మేం నమ్ముతున్నాం. ఈసందర్భంగా ఆయన మాటల్ని మనం గుర్తు చేసుకుంటే.. ‘పేదల పక్షాన నడుస్తున్నాను.. డబ్బున్న భూస్వాములకు వ్యతిరేకంగా నేను పోరాడుతున్నాను. కనుక, మీరంతా నా పక్కన ఉండి నాకు అండగా నిలబడండి. ఇది క్లాస్‌వార్..’ అని చెబుతున్నారు.
క్లాస్‌వార్‌లో టీడీపీ ఎటువైపు..?
ముఖ్యమంత్రి జగన్ గారు చెబుతున్న ఈ క్లాస్‌వార్‌లో టీడీపీ, చంద్రబాబు ఎటువైపు ఉన్నారు..? పేదల పక్షాన ఉన్నారా..? పేదలకు వ్యతిరేకంగా ఉన్నారా..? మీకు రాబోయే ఎన్నికల్లో పేద ప్రజల ఓట్లు కావాలంటే, ఇప్పుడు పేదలకు అనుకూలంగా ఇచ్చిన హైకోర్టు ధర్మాసనం తీర్పును స్వాగతించకుండా.. పేదలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు ఎందుకు అప్పీల్‌కు వెళ్లారో అనేది ప్రజలకు సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అసలు, మీ ఉద్దేశమేంటి..? పేదలనేవారు ఈ రాజధాని ప్రాంతంలో ఉండకూడదా..? మీ ఆలోచనల్లో రాజధాని ప్రాంతం అంటే, ఒక గేటెట్ కమ్యూనిటీ ఏరియా అనుకుంటున్నారా..? మీరనుకున్న ప్రత్యేక సామాజికవర్గానికి చెందిన వారే ఇక్కడ ఉండాలనుకుంటున్నా రా..? అమరావతైనా.. హైదరాబాదైనా.. రాజధాని ప్రాంతంలో అన్ని వర్గాల ప్రజలు నివసిస్తారు. అందులో తప్పేంటి..? ఇటువంటి విషబీజాల్ని టీడీపీ ఎందుకు పెంచిపోషిస్తుంది.
పేదలకు ఇళ్లు ఉండకూడదన్నదే టీడీపీ ఉద్దేశంః
రాజధాని అంటే ఇక్కడకు ఎస్ఆర్ఎం, విట్ ఏపీ వంటి యూనివర్శిటీలు, హైక్లాస్ వర్గాలే రావాల్నా.. పేదప్రజలు ఇక్కడకు రావడానికి వీల్లేదా..?. హైక్లాస్ ఇక్కడున్నప్పుడు లోక్లాస్ కుటుంబాలు ఇక్కడకు ఎందుకు ఉండకూడదు..? ఒకప్పుడు అమరావతి రాజధాని ప్రాంతంలో ఎటువంటి మౌలికసదుపాయాలు అభివృద్ధి చేయకుండానే, విట్ ఏపీ, ఎస్ఆర్ఎం తదితర యూనివర్శిటీలకు పెద్ద ఎత్తున స్థలాల్ని చంద్రబాబు ప్రభుత్వం ఎలా కేటాయించారు..? అని ప్రశ్నిస్తున్నాను. అప్పుడు రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేకుండా యూనివర్శిటీలకు స్థలాలివ్వకూడదు అనే వ్యతిరేకత అప్పట్లో ఎందుకు రాలేదు..? కేవలం, ఇప్పుడు పేదలకు ఇళ్ల స్థలాలు ఇక్కడ ఉండకూడదనేదే టీడీపీ ఉద్దేశంగా ఉంది.
కులమత, పేద, ధనికవర్గాలనే భేదం లేకుండా అన్నివర్గాల ప్రజలకు నివాసం కల్పించడంలో హైకోర్టు ఆర్డర్‌ను పాటించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉంది. అశ్వినీకుమార్ అనే కేసులో సుప్రీం కోర్టు ‘పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వండి..’ అని చెబుతుంది. ఆ సుప్రీంకోర్టు తీర్పును మా జగన్మోహన్రెడ్డి గారి ప్రభుత్వం శిరసావహిస్తుంది. అందరికీ ఇళ్లు వచ్చే కార్యక్రమం నిరంతరాయంగా చేస్తూ ఉంది. ఇక్కడ అన్నివర్గాలకు ఇళ్లు ఇస్తే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. ప్రభుత్వం కూడా మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టిపెడుతుంది. తద్వారా అందరికీ బెనిఫిట్ కలుగుతుంది కదా.. టీడీపీ బినామీలు అనుకునే విధంగా రియల్ ఎస్టేట్ కూడా పెరుగుతుంది కదా..? ఇంత జరిగే అవకాశం ఉన్నచోట.. పేదలకు ఇళ్లు ఇస్తామంటే టీడీపీ ఎందుకు వ్యతిరేకిస్తుంది..?
అందరికీ సమాన అవకాశాలు ఉండాలన్నదే మా నాయకుడి ఆలోచనః
పెద్దలు ఉండే చోట పేదలు ఉండకూడదనే.. టీడీపీ ఉద్దేశాన్ని మా నాయకుడు జగన్ గారు ఒప్పుకోరు. ప్రతీ పేద కుటుంబానికి ఇంటి స్థలం ఉండాలి. అది రాజధానైనా.. అమరావతైనా.. వైజాగ్ అయినా.. అది ఎంత పవిత్రమైన స్థలమైనా సరే, ఆ ప్రాంతంలో పేదలకు కూడా స్థానం ఉండాలి. వారికి సమప్రాధాన్యం ఉండాలనేది మా నాయకుడు జగన్ గారి ఉద్దేశం. అది భారతీయతత్వం కదా..? అందరూ గౌరవించే ఈ సోషలిస్టు సమాజంలో ప్రతీ ఒక్కరికీ జీవించే హక్కు, నివాసం ఉండే హక్కు ఉండాలనే తపనతో జగన్మోహన్రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. అందరికీ సమాన అవకాశాలుండాలని అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పారు. ఆమేరకు అంబేద్కర్ గారు ఎంచుకున్న సిద్ధాంతాన్నే మా నాయకుడు జగన్‌గారు నేడు అమలు చేస్తున్నారు. గతంలో పాలించిన టీడీపీ ప్రభుత్వం.. ఒక ప్రత్యేకమైన సామాజికవర్గాన్ని గేటెట్ కమ్యూనిటీ ఏరియాగా పెట్టుకుంటామంటే ఎలా కుదురుతుంది..? అందువలన పేద ప్రజలకు వ్యతిరేకంగా టీడీపీ తీసుకునే ఆలోచనల్ని ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
వామపక్షాలు, ప్రజాసంఘాలు స్పందించాలిః
కార్ల్‌మార్క్స్, గౌతమబుద్ధుడి జయంతిని ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నారు. అదేరోజైన నిన్న ప్రభుత్వ జీవోనెంబర్ 45ను సమర్ధిస్తూ రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం జడ్జిమెంట్ ఇచ్చింది. రాజధాని ప్రాంతంలో పేద ప్రజలు నివాసం ఉండవచ్చు.. వారికి కూడా ఇళ్లు కేటాయించండని ప్రభుత్వానికి హైకోర్టు తీర్పు ద్వారా తోడ్పాటునిచ్చింది. కనీసం, మార్క్స్, గౌతమబుద్ధుడి జయంతి రోజున పేదలకు ఇళ్లస్థలాలివ్వాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని.. పేదలపక్షాన తరచూ మాట్లాడే వామపక్షాలు నిన్న స్పందించాలి కదా..? మిగతా ప్రజాసంఘాలు కూడా దీనిపై వాయిస్ వినిపించాలి కదా..? వాళ్లు మాట్లాడకపోతే పేదలకు ఎలా న్యాయం జరుగుతుంది..? మార్క్స్, బుద్ధుడి చిత్రపటాలకు దండలేస్తే సరిపోతుందా..? రాజకీయాంశాలు ఎలా ఉన్నప్పటికీ, పేద ప్రజలకు ప్రభుత్వం అండగా ఉండి నివాసాల్ని కల్పించే క్రమంలో వామపక్షాలు, ప్రజాసంఘాలు సమర్ధించకపోతే పేదలకు న్యాయం జరిగే అవకాశమే లేదు. కనుక, పేదలపక్షాన ఉండేవారంతా నిన్న హైకోర్టు తీర్పును స్వాగతించాలని, జగన్మోహన్రెడ్డి గారి నాయకత్వాన్ని సమర్ధించాల్సిన అవసరం ఉందని నేను మనవిచేస్తున్నాను. పేదలకు వ్యతిరేకంగా.. ధనికవర్గాలకు అనుకూలంగా మాత్రమే పనిచేయాలనుకునే పురాతనమైన, పాడుబడ్డ ఆలోచనను టీడీపీ వెనక్కితీసుకోవాలని మేం డిమాండ్ చేస్తున్నాం.