ఒక ఫలితం.. అనేక సంకేతాలు!

8

– వరస వెంట వరస పరాజయ బాటలో వైసీపీ
– మొన్న గ్రాడ్యుయేట్ ఎన్నికలు, నిన్న ఎమ్మెల్సీ ఎన్నికలు
– అభ్యర్ధుల ఎంపికలో ఎమ్మెల్యేల అభిప్రాయానికి చోటేదీ?
– ప్రజాప్రతినిధులకు అపాయింట్‌మెంట్లేవీ?
– సీఎం ఎక్కువా? సీఎంఓ ఎక్కువనా?
– ఎమ్మెల్యేలకు పోటీ వ్యవస్థ పెడతారా?
– రెడ్లు కూడా తిరుగుబాటు చేస్తున్నారా?
– సీఎం-నేతల మధ్య ఆత్మీయ వాతావరణం ఏదీ?
– దిద్దుబాటుకు దిగకపోతే ప్రమాదమేనంటున్న సీనియర్లు
( మార్తి సుబ్రహ్మణ్యం)

‘పాతాళభైరవి సినిమాలో మాంత్రికుడు తోట రాముడిని ఏసేద్దామని అనుకుంటాడు. కానీ తోటరాముడే మాంత్రికుడిని ఏసేస్తాడు’
– ఇది ‘ఒక్కడు’ సినిమాలో ప్రకాష్‌రాజ్‌నుద్దేశించి, మహేష్ చెప్పే డైలాగ్.

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీని ఖతం చేయాలనుకున్న వైసీపీ ప్రయత్నాలు చూస్తే, ఈ డైలాగు వైసీపీకి సరిగ్గా అతుకుతుంది. టీడీపీకి ఉన్న సంఖ్యాబలం ప్రకారం ఎన్నికలను దాని మానాన దానిని వదిలేస్తే, వైసీపీ గౌరవం నిలబడి ఉండేదేమో. ‘దాని సంఖ్యాబలం ప్రకారం అది గెలిచిందే తప్ప అందులో గొప్పతనమేదీ లేదని’ వాదించే అవకాశం, వైసీపీకి సజీవంగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రతిష్ఠకు పోయిన వైసీపీకి.. మిగిలింది అప్రతిష్ఠ మాత్రమే!

తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి ఏ లెక్క చూసినా గెలవడం దుర్లభం. అసలు ఆ పార్టీ ఏ కోణంలోనూ గెలవకూడదు. ఎందుకంటే ఆ పార్టీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు, వైసీపీ శిబిరంలో ఉన్నారు కాబట్టి. మరి టీడీపీ ఎలా గెలిచింది? వైసీపీ నాయకత్వం కూసాలు కదిలేలా ఏకంగా నలుగురు విభీషణ ఎమ్మెల్యేలు, టీడీపీ అభ్యర్ధి అనురాధకు ఎలా చేయెత్తి జైకొట్టారు? అంటే ఇది వైసీపీలో నాయకత్వంపై తిరుగుబాటా? విప్లవమా? అసంతృప్తా? అసమ్మతా? ఆగ్రహమా? ఇవన్నీ జగన్‌బాబుకు సంబంధించిన వ్యవహారాలు. అందులో మంత్రులు, ఎమ్మెల్యేలకు ఏమాత్రం సంబంధం లేదు.

నిజమే. వారం క్రితమే మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో, వైసీపీ భోషాణం బద్దలయింది. టీడీపీ అనూహ్యంగా మూడు చోట్లా గెలిచింది. అందులో అన్నియ్యకు బాగా బలం ఉందనుకుంటున్న, రాయలసీమలోనూ వైసీపీ మాడు పగిలింది. వైఎస్ ఫ్యామిలీ తప్ప, పులివెందులలో పుట్టిన ఎవరూ సాధించని అద్వితీయ విజయాన్ని, టీడీపీ అభ్యర్ధి రాజగోపాల్‌రెడ్డి సొంతం చేసుకున్నారు. మళ్లీ ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇదో వజ్రాఘాతం. ఎందుకిలా? తేల్చుకోవలసింది జగనన్నే!

యస్. గ్రాడ్యుయేట్ ఎన్నికలు గానీ, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు గానీ, అన్నీ జగనన్న నిర్ణయమే తప్ప అందులో ఎవరి ప్రమేయం లేదు. ఒక పెద్దిరెడ్డి, ఇంకో వైవి సుబ్బారెడ్డి, మరో ప్రభాకర్‌రెడ్డి తప్ప.. ఒక్క మంత్రితో గానీ, ఒక్క ఎమ్మెల్యే అభిప్రాయాన్ని అడిగిన దాఖలాలు లేవు. ఎవరెన్ని చెప్పినా పీకే టీమ్ సిఫార్సు అంతిమం. సో.. జయాపజయాలకు జగనన్నే బాధ్యుడు.

రాజకీయ నాయకులు గౌరవం కోసమే బతుకుతారు. తమ నాయకత్వాల నుంచి దానినే ఆశిస్తారు. అయితే అది జగన్ దగ్గర చెల్లని రూపాయి. అసలు మంత్రులు-ఎమ్మెల్యేలు-నాయకులకు అపాయింట్‌మెంట్లే ఉండవు. నాయకత్వం అంచనాలు-వ్యూహాలేమిటో నాయకులకు తెలియవు. నాయకులకు ఎలాంటి సొంత ఆలోచనలు ఉండవని క్యాడరుకూ తెలుసు. అసలు నాయకులతో జగన్‌కు అవసరం లేదు. ఎందుకంటే ఆయనకు పీకే ఉన్నారు. ఆయనతోపాటు సొంత మీడియా ఉంది. నేరుగా బటన్ నొక్కడం వల్ల లబ్దిపొందేవారంతా ఓటేస్తారు. ఇదీ జగన్ ఆలోచనా శైలి. అందువల్ల ఎమ్మెల్యేలుగా ఎవరున్నా వారంతా ఉత్సవ విగ్రహాలే.

అందువల్లే జగన్- నాయకుల మధ్య ఆత్మీయ వాతావరణం లేదు. మంత్రుల మాట కలెక్టర్లు-ఎస్పీలు వినరు. ఇక ఇలాంటి పరిస్థితిలో ఎమ్మెల్యేల గోస ఎంత తక్కువ చెబితే అంత మంచిది. అంతా సీఎంఓ దిశానిర్దేశమే. క్షేత్రస్థాయి వాస్తవాలు తెలియని అధికారులే, జగనన్నకు దిశానిర్దేశకులు. ఇప్పుడు జిల్లాల్లో పార్టీని నడిపిస్తోంది మంత్రులు-ఎమ్మెల్యేలు కాదు. సీఎంఓ అధికారులే.

ఆ ప్రకారంగా సీఎంఓ ఉండగా, వైసీపీ పతనానికి ఎవరినీ బాధ్యులను చేయడం కష్టం. ప్రజాప్రతినిధులకు కనీస గౌరవం ఉండదు. ఆత్మాభిమానం ఉన్న వాళ్లెవరూ ఈ తరహా సంస్కృతిలో ఇమడలేరు. సీనియర్ ఎమ్మెల్యేలు, మంత్రులుగా పనిచేసిన వారు సైతం, సీఎంఓలో అధికారుల అపాయింట్‌మెంట్ల కోసం గంటలు ఎదురుచూడాల్సిందే. ఆనం రామనారాయణరెడ్డి వంటి సీనియర్లు ఇలాంటి వింత పరిస్థితిని భరించలేరు. అందుకే ఆయన తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. కోటంరెడ్డి చెప్పినట్లు మిగిలిన వారికి ఆత్మ ఉందో లేదో తెలియదు. అది ఎంతకాలం అమ్ముడుపోతుందో కూడా తెలియదు. ఇంకా ఆనం, కోటంరెడ్లు పార్టీలో చాలామంది ఉన్నారు. ఇలాంటి సమయం వచ్చినప్పుడే వారంతా విభీషణుల అవతారమెత్తుతారు. అది గ్రహించకపోవడమే వైఫల్యం.

తనను తాను దైవాంశసంభూతులుగా భావించే ఏ పాలకుడికయినా,ఇలాంటి చేదు ఫలితాలు తప్పవు. ఒక్కకలం పోటుతో మంత్రులను తొలగించిన ఎన్టీఆర్ కూడా, ‘కుక్కని పెట్టి గెలిపిస్తా’నని విర్రవీగి భంగపడిన నాయకుడే. ఆ తర్వాత ఎన్టీఆర్ పతనం ఏమిటన్నది అందరికీ తెలిసిందే. మొన్నామధ్య ‘నా వెంట్రుక కూడా పీకలేరని’ నిండు సభలో చాలెంజ్ చేసిన జగనన్నకూ, ఇప్పుడు అలాంటి భంగపాటే ఎదురవడం యాధృచ్చికమే. ఎమ్మెల్యేలకు అపాయింట్లుమెంట్లు ఇవ్వకుండా అవమానించడమే కాక.. వైనాట్ 175? అని ప్రశ్నించిన జగనన్నకు, ఒకరకంగా అదే ఎమ్మెల్యేలు ఇచ్చిన నజరానా ఇది.

నిజంగా తన వెంట్రుక కూడా ఎవరూ పీకలేరని, వైనాట్ 175? అని ప్రశ్నించిన అంతటి బాహుబలి జగన్ .. ఎమ్మెల్యేలకు మాక్‌పోలింగ్ పెట్టడం ఎందుకు? 16 మంది అనుమానితులపై నిఘా వేయడం ఎందుకు? తన పాలనపై అంత నమ్మకం ఉంటే.. ఎమ్మెల్యేలు నామమాత్రా వశిష్టులనుకుంటే.. ఈ మాక్ పోలింగులు, ఎమ్మెల్యేలకు ఇన్చార్జులు ఎందుకు? అందరినీ ఫ్రీగా వదిలేయవచ్చు కదా? ఇవన్నీ చేశారంటే అది దేనికి సంతేకం? అన్నది బుద్ధి జీవుల ప్రశ్న.

నిజానికి మొన్న జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల పరాభవం కంటే, ఈ ఎమ్మెల్సీ ఎన్నిక పరాభవం పదింతలు ఎక్కువ. నలుగురు టీడీపీ ఎమ్మెల్యే విభీషణులు పక్కనుండగా, తన పార్టీలోని నలుగురు విభీషణులు అదే టీడీపీకి జైకొట్టడం అవమానం. మరి జగనన్న వ్యూహం ఏమైనట్లు? ఆయన నియమించిన వారి తెలివితేటలు ఏమైనట్లు? ఎట్టి పరిస్థితిలోనూ ఆనం-కోటంరెడ్డి మినహా మరెవరూ టీడీపీకి ఓటేయడానికి అవకాశం లేదు. అయినా ఇద్దరు గీత దాటారంటే.. ఆ వైఫల్యం జగనన్నదా? ఆయన నియమించిన వ్యూహబృందానిదా? కచ్చితంగా జగనన్నదే ఆ వైఫల్యం. ఒకరు గీత దాటారంటే రాజకీయాల్లో అది మరొకరికి ఆదర్శమవుతుంది. ఇది చరిత్ర చెప్పిన సత్యం.

ఎందుకంటే మొన్నటి గ్రాడ్యుయేట్ ఎన్నికల నుంచి నిన్నటి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల వరకూ, అభ్యర్ధుల ఎంపికపై జగనన్న ఎవరినీ సంప్రదించలేదు. పీకే టీమ్‌తోపాటు, తనకు సన్నిహితులైన పెద్దిరెడ్డి-సుబ్బారెడ్డి-ప్రభాకర్‌రెడ్డి సలహాలు మాత్రమే పాటించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ల అభిప్రాయలు వినలేదు. మరి పీకే వ్యూహబృందం అంత మోతుబరి అయితే, మూడు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పార్టీ ఎందుకు ఓడిపోయింది? టీడీపీకి ఓటేసే విభీష ఎమ్మెల్యేలను, ముందే ఎందుకు గుర్తించలేదన్నది వైసీపీ దళాల ప్రశ్న.

కాబట్టి ఈ పరాజయ పరంపరకు జగనన్నదే బాధ్యత. పైగా ఎమ్మెల్యేలను పూచికపుల్ల మాదిరిగా చూసినందుకు లభించిన ఫలితమిది. గెలిచిన ఎమ్మెల్యేలను అవమానిస్తూ, వారికి పోటీగా సమన్వయకర్తలను నియమించిన నిర్ణయానికి ‘ఫలితం’అనుభవించాల్సి వచ్చిందన్నది పార్టీ వర్గాల ఉవాచ. కాలం ఎప్పుడూ స్థిరంగా ఉండదు. ఎన్నికల సమయాల్లో నేతల కోరికలకు రెక్కలు వస్తుంటాయి.

నిజానికి ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలకు గౌరవం లేదు. ఇక నాయకుల గౌరవం గురించి, ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయం. పార్టీ కోసం రెక్కలుముక్కలు చేసుకుని, సొంత డబ్బు తగలేసుకున్న గ్రామ-పట్టణ స్థాయి నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్న పరిస్థితి. గ్రామాల్లో పనులుచేసిన పార్టీ నేతలకు బిల్లులు రాని స్థితి. రెడ్ల పార్టీగా పేరున్నప్పటికీ.. అదే రెడ్లు, తమ గౌరవాన్ని వాలంటీర్లు తన్నుకుపోతున్నారన్న అసంతృప్తి. జగనన్న చుట్టూ ఉన్న కొద్దిమంది రెడ్లకు తప్ప, తమకేమీ లాభం లేదన్న కనువిప్పు. టీడీపీ హయాంలో కూడా కమ్మ వ ర్గం ఇలాంటి అసంతృప్తితో రగిలిపోయింది. ఫలితంగా తమ ఓటు తాము వేసుకుని, ఇంట్లో కూర్చున్న వాస్తవ పరిస్థితి. ఇప్పుడు వైసీపీదీ సేమ్ టు సేమ్ సీన్.

రాజకీయ పార్టీలు ప్రైవేట్ లిమిటెడ్‌గా మారితే, ఫలితాలు ఇంతకుమించి భిన్నంగా ఉండవు. ప్రజాస్వామ్యంలో ఏకపక్ష నిర్ణయాలు కొంతవరకే పనికొస్తాయి. అవి సుదీర్ఘకాలం మనజాలవన్నది చరిత్ర చెబుతూనే ఉంది. వ్యక్తుల కంటే చరిత్ర గొప్పది. తాజా వైసీపీ వర స పరాభవ పరంపరలో ఇంకెంతమంది విభీషణుల అవతార మెత్తుతారన్నదే వైసీపీ వర్గాల అసలు ఆందోళన.

నిజానికి చంద్రబాబుతో 16 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు. తొలుత ఆయనను 8 మంది నేరుగా కలిశారు. ఈ బంధం ఎమ్మెల్సీ నోటిఫికేషన్ ముందు నుంచే కొనసాగుతోంది. ఆ ధైర్యంతోనే ఆయన తన అభ్యర్ధిని బరిలోకి దింపారు. ఈ సంఖ్య ఎన్నికల నాటికి పెరగవచ్చు. లేదా జగనన్న దిద్దుబాటుకు దిగితే తగ్గనూ వచ్చు.

కానీ అన్ని అధికారాలు తన దగ్గర పెట్టుకుని, వ్యక్తులను మరగుజ్జులను చేయాలన్న ప్రయత్నాలు రాజకీయాల్లోనే కాదు. ఏ వ్యవస్థలోనూ ఫలించవు. ప్రత్యామ్నాయం లేని రోజుల్లో అయితే, ఈ తరహా ఆలోచనలు పనిచేశాయి. కానీ బోలెడు ప్రత్యామ్నాయాలు కళ్లెదుట ఉంటే, ఇంకా పాతచింతకాయపచ్చడి ఆలోచనలే కొనసాగించడం అవివేకం.

తెలుగుదేశం పార్టీలో ఎన్ని అవలక్షణాలున్నప్పటికీ.. ఇన్నేళ్లయినా ఆ పార్టీ సజీవంగా నిలిచిపోవడానికి కారణం.. సమిష్ఠి ఆలోచనలు, సమిష్ఠి నిర్ణయాలే. వైసీపీలో ఇప్పుడు లోపించింది అదే. ఇప్పటిదాకా జగనన్నను ఎంత మంది ఎమ్మెల్యేలు, ఎంతమంది మంత్రులు, ఎంతమంది ఎంపీలు కలిశారన్న ప్రశ్నకు.. జవాబు చెప్పే మొనగాడే లేరు. మరి వరస పరాజయ పరాభవాల నేపధ్యంలో, జగనన్న తన పంథా మార్చుకుంటారా? లేక ఇవన్నీ అసలు పరాజయాలు కావని, పాత పంథా కొనసాగిస్తారా? చూడాలి!