Suryaa.co.in

Features

ఊయల ఊగుదామా?

మనిషి జీవితంలో ప్రారంభ దశ ఊయల తోనే మొదలౌతుంది. ఊయలలో నిద్రపుచ్చితే బిడ్డకి నిద్ర వస్తుంది. బిడ్డ పుట్టిన 21వ రోజున ఉయ్యాలలో వేసి పేరంంటాలు ఉత్సవాలు జరుపుకుంటారు. ప్రసిద్ధ ఆలయాల్లో విగ్రహమూర్తికి ఊంజల్ ఊయల సేవలు జరుపుతారు. శ్రీకృష్ణాష్టమి రోజున చిన్ని కృష్ణుణ్ణి చిన్న ఊయలలో ఊపడం పరిపాటి. అన్ని పార్కులలో జారుడు బల్లలతో పాటు ఊయలలు కూడా ఉంటాయి.

పిల్లలు ఉత్సాహంగా ఊగుతుంటారు. అట్లతదియ నాడు కన్నెపిల్లలు కేరింతలు కొడుతూ రాబోయే భర్తలను ఊహించుకుంటూ ఊయలలూగుతారు. ఇక మన సినిమాలలో ఊయల పాటలకి కొదవే లేదు. చక్రపాణి, బొబ్బిలి యుద్ధం, గృహలక్ష్మి చిత్రాల్లో పి భానుమతి ఉయ్యాల పాటలు మరువలేం. ఆడపడుచు, పవిత్రబంధం, జీవితచక్రం, వారసత్వం, భక్త ప్రహ్లాద, పుట్టినిల్లు మెట్టినిల్లు ఇత్యాది చాలా సినిమాలలో ఊయల పాటలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఉయ్యాల జంపాల, ఊయల పేర్లతో సినిమాలు వచ్చాయి.

ఇన్ని విధాల అంతటి ప్రాముఖ్యత ఊయల కి ఉంది. చిన్న పిల్లలే కాకుండా పెద్దలకి కూడా ఊయలలో ఊగడం అంటే సరదానే. చాలామంది ఇళ్ళల్లో పెద్ద ఊయలలు ఉంటాయి. ఊయలలో ఊగుతూ కాలక్షేపం చేస్తుంటారు. ఊయలకి సంబంధించి కొన్ని ఇబ్బందులు కూడా లేకపోలేదు. ఊయల కట్టే విధానం సరిగా ఉండాలి.

పసిపిల్లలు ఊయలలో పడుకుని నిద్రపోతున్నా మనం ఓ కన్నువేసి ఉంచాలి.. తెలివొచ్చాక కొంచెం అటుఇటుగా అవుతుంటారు.. పడిపోయే అవకాశం ఉంటుంది గనుక మనం జాగ్రత్తగా ఉండాలి. ఓపెన్ గా ఉన్నప్పుడు కాకులు ఉయ్యాల పై వాలే అవకాశాలు ఉన్నాయి.. కేర్ ఫుల్ గా ఉండాలి. మొత్తానికి ఊయల లూగడం ఆహ్లాదకరమైన కాలక్షేపమనే చెప్పాలి. పిల్లలికి అవసరం.. పెద్దలకి టైంపాస్.

-గాదె లక్ష్మీ నరసింహ స్వామి(నాని)
విజయనగరం
ఫోన్ 99855 61852….

LEAVE A RESPONSE