లైంగికదాడులపై పెదవి విప్పండి..

– విద్యాసంస్థల్లో కౌన్సిలింగ్ లపై ‘ఏపీ మహిళా కమిషన్’ కార్యాచరణ
– చిన్నారులపై వేధింపుల పట్ల మౌనం ప్రమాదకరమన్న ‘వాసిరెడ్డి పద్మ’
– సైబర్ క్రైం, యునిసెఫ్, మానసిక నిపుణులతో కమిషన్ చైర్ పర్సన్ వర్చువల్ సమావేశం

రోజు రోజుకూ బాలలపై ఇంటా బయటా లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయని.. అఘాయిత్యాలపై చిన్నారులు, తల్లిదండ్రులు పెదవి విప్పితే రేపటికి ముందడుగు వేయొచ్చని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పిలుపునిచ్చారు. ఇటీవల విజయవాడలో లైంగిక వేధింపులతో పద్నాలుగేళ్ల విద్యార్ధిని ఆత్మహత్య నేపథ్యంలో చిన్నారులపై అనుచిత ప్రవర్తనకు సంబంధించి అప్రమత్తతకు మహిళా కమిషన్ ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించదన్నారు. ఇందులో భాగంగా విద్యాసంస్థల్లో కౌన్సిలింగ్ లపై శుక్రవారం ఏపీ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో ఆమె కమిషన్ కార్యాలయం నుంచి సైబర్ క్రైం, యూనిసెఫ్, మానసిక నిపుణులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఏడాదిపాటు జరిగే ఈ కౌన్సిలింగ్ క్యాంపెయిన్‌లో లైంగిక వేధింపులపై అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో మహిళా కమిషన్ పనిచేసేందుకు అందరూ సహకరించాలని ఆమె కోరారు.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు, కళాశాలల్లో కౌన్సిలింగ్ కేంద్రాల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నామని చెప్పారు. యునెస్కో నివేదిక ప్రకారం మానసిక వేదనతో బాలికల అక్షరాస్యత తగ్గిపోతుందనే విషయంపై సూక్ష్మ పరిశీలన అవసరమని.. వేధింపుల కట్టడికి హెల్ప్ లైన్ నెంబర్లు, పోక్సో చట్టాల అవగాహనతో విద్యార్ధినుల్లో ధైర్యం నింపేందుకు మహిళా కమిషన్ సీరియస్ గా ముందుకెళ్తుందన్నారు. బాలికల విద్యతో పాటు వారిపై వేధింపుల నిరోధానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కౌన్సిలింగ్ కేంద్రాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని వాసిరెడ్డి పద్మ వివరించారు. తొలుతగా మహిళా కమిషన్ కార్యదర్శి శైలజ సమావేశ ఉద్దేశాన్ని వివరించగా, కమిషన్ డైరెక్టర్ ఆర్ సూయజ్ వర్చువల్ కు హాజరైన వారిని చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మకు పరిచయం చేశారు.

ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ…చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడులపై మాట్లాడేందుకు భయపడొద్దని.. పిల్లల్ని రక్షించేందుకు, సమాజాన్ని మెరుగుపరిచేందుకు, లైంగిక దాడులను అరికట్టేందుకు అందరూ ధైర్యంగా ముందుకు రావాలన్నారు. వేధింపులపై మౌనం.. ప్రమాదకరమని, చిన్నారులపై ఏ విధమైన దాడులు జరిగినా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు పిల్లలు చెప్పాలన్నారు. అరమరికలు, సమస్యలు లేని బాల్యాన్ని ఇస్తే చిన్నారులు అన్ని విషయాలపై అవగాహన కలిగి ఉంటారని చెప్పారు.  ‘చైల్డ్‌ సెక్సువల్‌ అబ్యూజ్‌’పై అవగాహన ఏడాదిపాటు చేసేందుకు మహిళా కమిషన్ కృతనిశ్చయంతో ఉందన్నారు. పలువురు మానసిక నిపుణులు మాట్లాడుతూ బాలికలు చీటికిమాటికి హడలిపోతుంటే అది అసహజమైన భయం కావచ్చన్న ఆలోచన రావాలన్నారు. పిల్లల్ని

కొట్టడం, తిట్టడం, లైంగికంగా వేధించడం,  ఏ పని చేసినా విమర్శించడం, కఠినమైన శిక్షలు విధించడం, ఆఖరికి ప్రేమ చూపకపోవడం కూడా శిశుహింసేనని.. వీటిల్లో అతి ప్రధానమైన లైంగిక హింసను  నివారించేందుకు తల్లిదండ్రులకు, చిన్నారులకు కౌన్సిలింగ్ కేంద్రాల ద్వారా అవగాహన చేయడానికి తమవంతు ప్రయత్నం చేస్తామన్నారు. చిన్నపిల్లల పట్ల వేధింపులు రోజురోజుకీ పెరిగిపోవడానికి కారణాలు ముఖ్యంగా రెండు అని… వాటిలో ఒకటి పిల్లలు నోరు తెరచి తమ పట్ల జరుగుతోన్న హింసను చెప్పలేకపోవడం కాగా, పిల్లల విషయంలో ఏం జరుగుతుందో పెద్దలు గుర్తించలేకపోవడమనేది మరో సమస్య అన్నారు. ఈ పరిస్థితి మారాలంటే… తమ పిల్లల్ని ఎలా కాపాడుకోవాలో ముందు తల్లిదండ్రులు అవగాహన పెంచుకుని పిల్లలను అప్రమత్తం చేయాలన్నారు.

ఇంటికి తరచుగా వచ్చేవారు, బడిలో టీచర్లు తదితరులు పిల్లలతో ఎలా ప్రవర్తిస్తున్నారో గమనించడం, వాళ్ల ప్రవర్తనలో తేడా కనిపిస్తే వెంటనే జాగ్రత్తపడి.. అనుచితంగా ఉంటే వారిని వారించే విధానాలపై అవగాహన చేయాలన్నారు. పిల్లలపై తగని చోట తాకుతున్నా, దగ్గరకు తీసుకోవాలని ప్రయత్నించినా, ఫొటోలూ వీడియోలూ తీయాలని చూసినా.. వెంటనే చిన్నారి ప్రతిఘటించి ఫిర్యాదిచ్చేలా పాఠశాలల్లో అర్ధమయ్యే విధంగా తెలుగులో కరపత్రాలు పంపిణి చేయాలని పలువురు సూచించారు. పిల్లలు ఎక్కువగా గడిపేది తల్లితోనే ఉంటారని.. వారికి అనుకోని పరిస్థితుల్లో ఏం జరుగుతోందో, దానికి ఎలా స్పందించాలనేది అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత తల్లిదేనని పెద్దలు గుర్తుచేసుకోవాలన్నారు.

సమావేశంలో మహిళా కమిషన్ సభ్యులు గజ్జల వెంకట లక్ష్మి, కె. జయశ్రీ, సైబర్ క్రైం నిపుణులు నల్లమోతు శ్రీధర్, మాధవరెడ్డి, క్లినికల్ సైకాలజిస్ట్ శ్వేత, సురేఖ, యూనిసెఫ్ చైల్డ్ నిపుణులు సోమిజార్జి పుట్టి, మానసిక నిపుణులు నగేష్, కల్యాణి, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం కౌన్సిలర్లు డాక్టర్ సరోజ, డాక్టర్ విమల, జ్యోతి, తేజోవతి, ఏపీ చైల్డ్ లైన్ హెడ్ బి.రవికుమార్, యూనిసెఫ్ మాజీ చైల్డ్ స్పెషలిస్ట్ సుధామురళి, మాజీ డీఎస్పీ రాజ్యలక్ష్మి, యూనిసెఫ్ కన్సల్టెంట్ డేవిడ్, ఈదా ఫౌండేషన్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Leave a Reply