Suryaa.co.in

Political News

ఒపీనియన్ పోల్స్..ఎగ్జిట్ పోల్స్

(రమేష్)

శనివారం(జూన్ 1)తో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగియనుండటంతో అందరి దృష్టి ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్‌పై పడింది. వాస్తవ ఫలితాలు వెలుబడటానికి ముందే సర్వే సంస్థలు, మీడియా చేసే హడావుడే.. ఈ ఎగ్జిట్ పోల్స్‌. వీటిని నమ్మొచ్చా..! అంటే అది చెప్పడం కాస్త కష్టం. అచ్చం వాతావరణశాఖ అంచనాల మాదిరిగానే ఉంటాయి. వర్షం పడొచ్చు.. పడకపోవచ్చు అన్నది ఎంత నిజమో.. ఓటర్ నాడి పట్టేశామని సర్వే సంస్థలు చెప్పే ఫలితాలు అంతే వాస్తవం. అలా అని పూర్తిగా కొట్టిపారేయలేం. నిజమైన సందర్భాలు ఉన్నాయి. వ్యతిరేక ఫలితాలు వచ్చిన జాడలూ ఉన్నాయి.

అసలేంటి ఈ పోల్స్.. ఎన్నికల ముందు, తరువాత ఈ హడావుడి ఏంటి..? వీరు నిజంగా ప్రజల నాడి పట్టేస్తారా..! అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. ఓటర్ అభిప్రాయాన్ని సేకరించడంలో రెండు రకాలు ఉన్నాయి. అందులో ఎన్నికలకు ముందు జరిగేది ఒపీనియన్ పోల్స్ అయితే, ఎన్నికల తరువాత జరిగేది.. ఎగ్జిట్ పోల్స్.

ఒపీనియన్ పోల్స్..
జాతీయ ఎన్నికల కమిషన్ నిబంధనలకు లోబడి ఒపీనియన్ పోల్స్ సర్వేలు ఏ దశలోనైనా జరగొచ్చు. అంటే, ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందు, వచ్చాక.. పొత్తులు గట్రా తేలక ముందు, ఎవరు ఎవరితో జట్టు కడుతున్నారో స్పష్టత రాకముందు కూడా ప్రీ పోల్స్ సర్వేలు చేపడతారు. రాజకీయ ప్రాధాన్యతలపై ప్రజల సెంటిమెంట్‌ను సేకరించడమే ఈ సర్వేల లక్ష్యం.

ఒపీనియన్ పోల్స్ సర్వేలో ఎవరిని ప్రశ్నించాలి..? ఎవరి అభిప్రాయాలు తప్పనిసరి..? అనేది నిర్వాహకులు ముందే నిర్ణయించుకుంటారు. రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, యువత, వికలాంగులు, వృద్ధులు ఇలా అందరిని కలిసి వారి అభిప్రాయాలు తెలుసుకుంటారు. కులం, మతం ప్రాతిపదికన సమాచారాన్ని సేకరిస్తుంటారు. ఈ రకం సర్వేలు ఎక్కువుగా రాజకీయ పార్టీలు చేపడుతుంటాయి. ప్రజల్లో తమపై విశ్వసనీయత ఉందా..? లేదా..? అనేది తెలుసుకునేందుకు ఫ్రీ పోల్స్ పేరుతో హడావుడి చేస్తుంటాయి.

ఎగ్జిట్ పోల్స్..
పోలింగ్ ముగిశాక వెలువడేవి.. ఎగ్జిట్ పోల్స్. పోలింగ్ రోజే సమాచారాన్ని సేకరిస్తారు. బూత్‌లో ఓటేశాక ఓటర్లు ఇచ్చే సమాధానాలను బట్టి ఏ పార్టీకి ఎక్కువ మంది ఓటేశారు అనే వివరాలను లెక్కగడతారు. ఆ సమాచారం ఆధారంగా పార్టీల ఓటింగ్ శాతం, గెలిచే సీట్ల సంఖ్యను అంచనా వేసి ఎగ్జిట్ పోల్స్ ప్రకటిస్తారు.

ఇటీవల కాలంలో ఈ రకం సర్వే సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. కొన్ని కేవలం ఎన్నికల సమయంలో కనిపిపించి.. ఎన్నికలు ముగియగానే కనుమరుగు అవుతుంటాయి. అందునా, రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ సర్వేలు చేపిస్తున్న సందర్భాలూ లేకపోలేదు.

ఏది ఖచ్చితత్వం?
ఒపీనియన్ పోల్ సర్వేలతో పోలిస్తే ఎగ్జిట్ పోల్స్‌ పట్ల ప్రజలకు నమ్మకం ఎక్కువ. అందులో వాస్తవం లేకపోలేదు. ప్రీ పోల్ సర్వేలో ఓటర్ చెప్పిందే తుది నిర్ణయమని తేల్చేయలేం. అతను ఆ సమయానికి సందిగ్ధంలో ఉండొచ్చు. ఎవరికి ఓటేయాలనేది దానిపై నిర్ణయం తీసుకొని ఉండకపోవచ్చు. అదే ఓటేశాక ప్రశ్నిస్తే కొంతమేర ఖచ్చితత్వం ఉంటుంది.

నిజంగా ప్రజల నాడి పట్టేస్తారా ?
ప్రజల నాడి పట్టేశాం అని సర్వే సంస్థలు చెప్పేటప్పటికీ.. అందులో వాస్తవమెంత అనేది మాత్రం ఒక్క ఓటరుకే తెలుస్తుంది. పార్టీల కార్యకర్తలు మినహా తాము ఫలానా నాయకుడికి ఓటేశామని సాధారణ ఓటరు బహిరంగంగా నోరు మొదపట్లేరు. ఇరు పార్టీల నేతలు అడిగినప్పుడు ‘మీకే వేశాం..’ అని బదులిస్తున్నారు. కావున పోల్స్ తమకు అనుకూలంగా వచ్చాయని సంబరాలు చేసుకోకుండా.. పలితాలు వచ్చేవరకు ఆగగలరని మనవి.

LEAVE A RESPONSE