Suryaa.co.in

Andhra Pradesh

పశువులకు గడ్డిపెట్టలేని వ్యక్తి మూడు రాజధానులు కడతారా?

-ఉద్యోగులను బెదిరించి వారి డబ్బులు లాగేసుకుంటున్నారు
-రాష్ట్రాభికోసం పోరాడకుండా ఎంపీలు ఏం చేస్తున్నారు?
-టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన పార్టీ స్ట్రాటజీ కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలపై చర్చించి కింది నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.

ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కె. అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నిమ్మకాయల చినరాజప్ప, కేఎస్ జవహర్, కాలవ శ్రీనివాసులు, దేవినేని ఉమామహేశ్వరరావు, బీసీ జనార్థన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు, బండారు సత్యనారాయణ మూర్తి, టీడీ జనార్థన్, పి.అశోక్ బాబు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జి.వెంకట రెడ్డి, మద్దిపాటి వెంకటరాజు, చింతకాయల విజయ్ పాత్రుడు తదితరులు పాల్గొన్నారు.

ఓటీఎస్ వసూళ్ల పేరుతో పేదల మెడకు ఉరితాళ్లు బిగిస్తున్నారు. టీడీపీ హయాంలో కట్టించిన టిడ్కో ఇళ్లను పేదలకు ఇందుకు ఇవ్వడం లేదు? ఓటీఎస్ పథకం కింద పేదలెవరూ ప్రభుత్వానికి సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేదు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా ఇళ్లు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం అంటూ ప్రకటనలతో జగన్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నారు. జూనియర్ కిమ్ మాదిరిగా వ్యవహరిస్తున్నారని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు.నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గృహిణులు, పేదలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ధరల నియంత్రణలో జగన్ రెడ్డి విఫలమయ్యారని సమావేశంలో పాల్గొన్న నేతలు పేర్కొన్నారు.

రాష్ట్రాన్ని జగన్ రెడ్డి అప్పులమయం చేశారు. పుట్టే ప్రతి బిడ్డపైనా అప్పు చేస్తున్నారు. భవిష్యత్ తరాలు నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. రూ.6.8 లక్షల కోట్ల వరకు అప్పులు పెంచుకుంటూ పోయారు. ఈ నిధులన్నీ ఏయే పథకాలకు, ఎక్కడెక్కడ ఖర్చు చేశారో చెప్పలేని పరిస్థితి. ఉపాధి హామీ నిధులను పక్కదారి పట్టించడంతో పాటు కేంద్ర ప్రాయోజిత పథకాలకు మ్యాచింగ్ గ్రాంటు ఇవ్వకుండా నిర్వీర్యం చేస్తున్నారు. పంచాయతీల నిధులు దారిమళ్లించారు.

దీంతో జగన్ ప్రభుత్వాన్ని కేంద్రం నమ్మే పరిస్థితి లేదు. ప్రభుత్వ పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించడం లేదు. ప్రభుత్వ భూములు అమ్మడం అనేది డిజిన్వెస్ట్ మెంట్ విధానంలో భాగం కాదని, బిల్డ్ ఏపీ కేసులో ఇంప్లీడ్ కాలేమని కేంద్రం తేల్చి చెప్పడం జగన్ రెడ్డికి చెంపపెట్టని సమావేశంలో నేతలు అభిప్రాయ పడ్డారు.

సంక్షేమం పేరుతో జగన్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారు. ఇచ్చేది గోరంత- దోచుకునేది కొండంత. రైతు భరోసా కింద రైతుకు రూ.13,500 ఇస్తామని చెప్పి.. కేవలం రూ.7,500 మాత్రమే చెల్లిస్తున్నారు. టీడీపీ హయాంలో ఐదేళ్లలో ప్రతి రైతుకు రూ.లక్ష వరకు లబ్ధి చేకూరగా.. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కేవలం రూ.20 వేలు మాత్రమే లబ్ది చేకూరుతోంది.

డ్రిప్, యంత్ర పరికరాల సరఫరాను నిలిపివేశారు. పంట నష్ట పరిహారం అందించడంలో విఫలమయ్యారు. నవంబర్ లో కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాలలో కురిసిన భారీ వర్షాల సమయంలో సహాయక చర్యలను కూడా అరకొరగా చేశారు. పంట, ప్రాణ, పశు నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక కూడా సమర్పించలేదు. సంక్రాంతి పండుగను రైతులు ఆనందంగా జరుపుకోలేని పరిస్థితి. రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే మూడో స్థానం, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో రాష్ట్రం నిలిచింది. మరోవైపు రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. వీటన్నింటిపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని నేతలు పేర్కొన్నారు.

తిరుపతిలో జరిగిన అమరావతి రైతుల పాదయాత్ర ముగింపు సభ విజయవంతమైంది. ప్రజలు స్వచ్ఛందంగా సభకు తరలివచ్చారు. ఇందులో భాగస్వామ్యమైన ప్రతిఒక్కరికి నేతలు అభినందలు తెలిపారు. రెండున్నరేళ్ల జగన్ రెడ్డి పాలనలో అమరావతిని నాశనం చేసి రూ.2 లక్షల కోట్ల సంపదను నిర్వీర్యం చేస్తున్నారు. రాజధానిని మూడు ముక్కలాటగా మార్చి జగన్ రెడ్డి చేస్తున్న ద్రోహాన్ని రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు.

దేశంలోనే అత్యధికంగా మద్యం వినియోగిస్తున్న రాష్ట్రాల్లో ఏపీ అగ్రభాగాన ఉంది. మద్యం ధరలు షాక్ కొట్టేలా ఉండాలని, మద్యపానాన్ని నిరుత్సాహపరిచేందుకే 75శాతం మేర ధరలు పెంచామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి నేడు మాట తప్పారు. దశలవారీ మద్య నిషేధం హామీకి తూట్లు పొడిచారు. ఇప్పుడు ప్రభుత్వం మద్యం ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇది మరో తుగ్లక్ నిర్ణయమని నేతలు ఖండించారు.

రాయలసీమ అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది. జగన్ చర్యలతో ఏ ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రానికి రావడం లేదు. సాగునీటి ప్రాజెక్టుల పట్ల జగన్ రెడ్డి పూర్తి నిర్లక్ష్యం వహించారు. వచ్చిన పరిశ్రమలను కూడా తరిమి వేస్తున్నారు. ఇవన్నీ మేధావులకు, పేటీఎం బ్యాచ్ లకు కనిపించడం లేదా? టీడీపీ హయాంలో రాయలసీమ అభివృద్ధికి విశేషంగా కృషిచేయడం జరిగింది. అభివృద్ధి వికేంద్రకీరణ చేపట్టడం జరిగింది. కియా, సిమెంట్, సోలార్, సెల్ ఫోన్ వంటి పరిశ్రమల ద్వారా యువతకు ఉద్యోగాలతో పాటు ఇరిగేషన్ కు ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. రాయలసీమకు జగన్ రెడ్డి ద్రోహంపై క్షేత్రస్థాయిలో పర్యటనలు చేపట్టాలని సమావేశంలో నేతలు తీర్మానించారు.

ప్రత్యేక హోదా, వెనుకబడిన జిల్లాలకు నిధులు, పోలవరం, రైల్వేజోన్, కడప స్టీల్ ఫ్యాక్టరీ, ఇతర విభజన హామీల అమలులో జగన్మోహన్ రెడ్డి తీవ్ర నిర్లక్ష్యం వహించారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి నిధులు సాధించడంలో విఫలమయ్యారని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు.

మంత్రి కొడాలి నాని, అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా వ్యాఖ్యానించిన ప్రకాశం జిల్లా ఒంగోలు వైసీపీ నేత సుబ్బారావు గుప్తా ఇంటిపై దాడికి పాల్పడటాన్ని సమావేశం ఖండించింది. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని, ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడటం హేయమని నేతలు అభిప్రాయపడ్డారు. సుబ్బారావు గుప్తా ఇంటిపై మూకదాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు.

జగన్మోహన్ రెడ్డి తీరుతో ప్రభుత్వ ఉద్యోగులు రోడ్లపైకి వచ్చారు. ఉద్యోగులను బెదిరించి వారి డబ్బులు లాగేసుకుంటున్నారు. సీపీఎస్ ను వారంలో రద్దు చేస్తామని చెప్పి.. రెండున్నరేళ్లు గడిచినా అతీగతీ లేదు. పీఆర్సీపై దోబూచులాట ఆడుతున్నారు. మరోవైపు ఆర్టీసీ భవిష్య నిధి రూ.1600 కోట్లను కూడా దారిమళ్లించడం పాలనావైఫల్యానికి నిదర్శనమని నేతలు అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చాలని సమావేశంలో నేతలు డిమాండ్ చేశారు.

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం జల్లేరు వాగులో బస్సు బోల్తా ఘటనకు ప్రభుత్వానిదే బాధ్యత. బస్సు గేర్ బాక్స్ మార్చడానికి కూడా జగన్ రెడ్డి వద్ద డబ్బులు లేవు. ప్రభుత్వ నిర్లక్ష్యం, ఉదాసీనత వల్లే ప్రమాదం సంభవించింది. మరోవైపు విశాఖ రామానంద ఆశ్రమంలో గోవులు చనిపోతున్నా పట్టించుకోవడం లేదు. పశువులకు గడ్డిపెట్టలేని వ్యక్తి మూడు రాజధానులు కడతారా? ఆయా ఘటనల్లో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సమావేశంలో నేతలు ఖండించారు.

జగన్ రెడ్డి సొంత బాబాయి అయిన వివేకానందరెడ్డి హత్య కేసును కుట్రపూరితంగా దారి మళ్లిస్తున్నారు. బాధితులనే దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుండటాన్ని సమావేశం తీవ్రంగా ఖండించింది. అసలు దోషులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు.బీసీ జనగణన జరపాలి. ఓటర్ ఐడీతో ఆధార్ ను అనుసంధానించి బోగస్ ఓట్లను ఏరివేయాలి.

LEAVE A RESPONSE