జగన్ కు ప్రతిపక్ష హోదా కూడా అనుమానమే

-ప్రమాణ స్వీకారం సంగతి తర్వాత ముందు గెలవాలిగా జగన్?
-ప్రాజెక్టులు కట్టే వారిని ఎన్నుకుంటారా?, సొంతంగా ప్యాలెస్లను కట్టుకునే వారిని గెలిపించుకుంటారా??
-ఎన్నికల కోడ్ ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తోన్న రాష్ట్ర ప్రజలు
-వైఎస్ వివేకా హత్యపై సాక్షి దినపత్రికవి అవే తప్పుడు రాతలు
-వైయస్ సునీతా రెడ్డి, ఆమె భర్త హత్య చేసి ఉంటే… పోస్టుమార్టం చేయాలని ఎందుకు పట్టుబడతారు?
-సిబిఐ విచారణ కోసం హైకోర్టును ఎందుకు ఆశ్రయిస్తారు?
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిట్టలదొరలా మాట్లాడడం దురదృష్టకరం. విశాఖలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బెండపూడి ఇంగ్లీష్ యాసలో విశాఖపట్నమే రాష్ట్ర రాజధానని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది. విశాఖపట్నంలోనే మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానన్న జగన్మోహన్ రెడ్డికి, రానున్న ఎన్నికల్లో అసలు ప్రతిపక్ష నేత హోదా నైనా దక్కుతుందా? అని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు.

ఇప్పటివరకు విశాఖపట్నం వాసులు 25 నుంచి 30 శాతం మంది తెలిసో, తెలియకో వైకాపాకు ఓటు వేస్తారని భావించాను. ఇప్పుడు ఆ ఓట్లు కూడా పడేలా లేవని ఆయన అన్నారు. మంగళవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామ కృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… విశాఖపట్నంలో అన్న… వస్తున్నారంటే పారిపోయే పరిస్థితి నెలకొంది. జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత ప్రకటన , విశాఖపట్నం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయనున్న బొత్స ఝాన్సీ పై తీవ్రంగా పడే అవకాశం ఉంది.

పొలాలలో ఏనుగులు వచ్చి పడినప్పుడు రైతుల పరిస్థితి ఎలా ఉంటుందో, ఇప్పుడు విశాఖ వాసుల పరిస్థితి అలాగే తయారయ్యింది. ఏనుగులే మేము వస్తున్నామని ప్రకటించిన తరువాత , ఇప్పుడు విశాఖ వాసుల పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదని రఘురామకృష్ణం రాజు అన్నారు.

విశాల హృదయాన్ని చాటుకున్న జగన్మోహన్ రెడ్డి
విశాఖపట్నం రాష్ట్ర రాజధానిగా కొనసాగుతుందని పేర్కొన్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, తన విశాల హృదయాన్ని చాటుకుంటూ శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూల్ కు తాను వ్యతిరేకం కాదని చెప్పారని ఎద్దేవా చేశారు.

న్యాయస్థానంలో మాత్రం కర్నూలు న్యాయ రాజధాని కాదని చెబుతూనే, వీధుల్లో మాట్లాడేటప్పుడు మాత్రం న్యాయ రాజధానిగా కర్నూలు చేస్తామని ప్రకటించడం పరిశీలిస్తే ప్రజలు ఏమైనా బుజ్జి కన్నలని అనుకుంటున్నారా అని ఆయన మండిపడ్డారు. ఇలా ఎవరిని మోసం చేయడానికి చేస్తున్నారని నిలదీశారు.

ఓడిపోతామని తెలిసికూడా మేకపోతు గాంభీర్యం
ఒకవైపు కూలిపోతున్న స్వప్న సౌధాలు, మరొకవైపు తెచ్చి పెట్టుకున్న మేకపోతు గాంబీర్యం. ఇక పారిశ్రామికవేత్తలకు అలవి కాని హామీలు. రాష్ట్ర పరిస్థితి చూస్తుంటే, ఇటీవల గుంటూరు తెలుగు సినిమాలో కుర్చీ మడత పెట్టి … మడత పెట్టి అనే పాట గుర్తుకు వస్తుందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. రాష్ట్రంలోనే అద్భుతమైన అమర్ రాజా బ్యాటరీ కంపెనీ విస్తరణను ప్రస్తుత పాలకులు అడ్డుకున్నారు.

అమర్ రాజా కంపెనీనే రాష్ట్రంలో లేకుండా చేయాలని చూశారు. ప్రస్తుతం అమర్ రాజా కంపెనీ తెలంగాణలో పెట్టుబడులను పెట్టి, వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. అమర్ రాజా బ్యాటరీ కంపెనీ అధినేత గల్లా జయదేవ్ ఐదేళ్లపాటు రాజకీయాలనుంచి విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించారు. జయదేవ్ కచ్చితంగా తిరిగి రాజకీయాల్లోకి వస్తారు. జయదేవ్ లాంటి వారు ప్రస్తుత రాజకీయాలలో ప్రజల కోసం కొనసాగడం ఎంతో అవసరం.

విశాఖ జిల్లా వాసులు వైకాపాకు డిపాజిట్లు రాకుండా ఓడించాలని రఘురామకృష్ణం రాజు కోరారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వంటి వారు దుష్టులతో కలిసినప్పటికీ, తమ వ్యక్తిగత ఇమేజ్ తో గెలిచే అవకాశం ఉంది. కూటమి అభ్యర్థిగా ఎవరు ఉంటే వారి గుర్తు అయిన సైకిల్, గాజు గ్లాసు, కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు.

14 లేదా 15వ తేదీలలో ఎన్నికల కోడ్ వచ్చే ఛాన్స్
ఈనెల 14 వ తేదీ, లేదంటే 15వ తేదీన ఎన్నికల కోడ్ వచ్చే ఛాన్స్ ఉందని రఘు రామ కృష్ణంరాజు తెలిపారు. ఎన్నికల కోడ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఎన్నికల కోడ్ గురించి ఎప్పుడు కూడా అడగని సామాన్య ప్రజలు , ఇప్పుడు ఎన్నికల కోడ్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.

ఎందుకంటే, ఈ దుర్మార్గుడి పాలనను భరించలేకపోతున్నామని, ఇంకెన్నాళ్లపాటు భరించాలని సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఎన్నికల కోడ్ వస్తే ధైర్యంగా బ్రతకగలమని, ఈ పోలీసు గొడవలు, వారి అకృత్యాలు ఉండవని ఆశిస్తున్నారన్నారు.

ఒక రెడ్డికి మరొక రెడ్డి చెబితే… నారాయణ అల్లుడు ఇంటి పై, ఆఫీసు సిబ్బంది ఇళ్లపై దాడులా?
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డికి చెబితే, సజ్జల రామకృష్ణారెడ్డి, డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి కి చెబితే, రాజేంద్రనాథ్ రెడ్డి, రఘురామిరెడ్డికి చెబితే, రఘురామి రెడ్డి, తిరుమలేశ్వర్ రెడ్డి కి చెబితే… తిరుమలేశ్వర్ రెడ్డి తన సిబ్బందితో మాజీ మంత్రి నారాయణ అల్లుడి ఇంటిపై, ఆయన ఆఫీసు సిబ్బంది ఇళ్లపై దాడులు చేయడం ఏమిటని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు.

అసలు నారాయణ అల్లుడు ఇంటి పై, ఆయన సిబ్బంది ఇళ్లపై దాడులు చేయడానికి మీకేమిటి సంబంధమని నిలదీశారు. ఇంకొక వారం రోజులపాటు మీకు పూర్తిస్థాయి అధికారం ఉంటుందని, ఆ వారం రోజుల్లో దరిద్రాన్ని అంతా చేయాలని, ఒక సామాజిక వర్గం అధికారులు దారుణాలకు, హింసకు దిగడం క్షమించరాని నేరం అన్నారు . పాలకుల కనుసనల్లో కొనసాగుతున్న కొంతమంది పోలీసు అధికారుల అకృత్యాన్ని ప్రశ్నిస్తే, మమ్మల్ని బెదిరించాడు సార్… బెయిలు రద్దు చేయండి అని అంటారన్నారు.

అధికార పార్టీ నేతల కను సన్నల్లో అకృత్యాలకు పాల్పడుతున్న అధికారులకు చెప్పేది ఏమీ ఉండదని, చేసి చూపించడమేనని రఘురామ కృష్ణంరాజు హెచ్చరించారు. మీరు అనుకునే నాయకుడు అతి దారుణంగా ఓడిపోబోతున్నారని, ఇప్పటికైనా అధికారాన్ని అడ్డం పెట్టుకొని బరితెగిస్తున్న అధికారులు బుద్ధి తెచ్చుకోవాలన్నారు. ఒక సీఐ స్థాయి అధికారి తన వాహనానికి జగన్మోహన్ రెడ్డి కి ఓటు వేయాలని కోరుతూ ఉన్న స్టిక్కర్ ను అతికించుకుని తిరుగుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

ఇటువంటి పనికిమాలిన వారిని ఏమి చేయాలి. రక్షకభటులు భక్షకబటులై, పాలకులు కీచకులైన వేళ వారిని ప్రశ్నిస్తే ఒక ఎంపీ ని అయినా సరే, తప్పుడు కేసులు, రాజా ద్రోహం వంటి అతి తీవ్రమైన కేసులను పెట్టి ఈ దొంగ నా కొడుకులు హింసించారన్నారు. ఇవన్నీ చూసి జనం ఇప్పటికే విసుగెత్తిపోయారని, ఎన్నికల కోడ్ వస్తే, ఎన్నికల కమిషన్ చేతుల్లోకి అధికారాలు వెళ్తాయని, అప్పుడు ప్రశాంతంగా జీవించవచ్చునని భావిస్తున్నారన్నారు. తాత్కాలిక డీజీపీగా కొనసాగుతున్న రాజేంద్రనాథ్ రెడ్డి ని ఎన్నికల కమిషన్ బదిలీ చేస్తుంది.

ఆయన స్థానంలో కొత్తవారికి డీజీపీ బాధ్యతలను అప్పగిస్తారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కూడా తప్పించే అవకాశాలు లేకపోలేదనే ఆలోచనల్లో ప్రజలు ఉన్నారన్నారు. పేరు చివరన రెండు అక్షరాలు ఉన్న వారిలో రెండు శాతం మందితోనే అసలు సమస్య అని, మిగిలిన 98 శాతం మంది ఎటువంటి సమస్య లేదన్నారు.

రికార్డు చేసి ప్రజలకు వినిపిస్తా
రెగ్యులర్ ఫోన్ నెంబర్ ద్వారా కాకుండా ఇటీవల కొంతమంది మెసేజ్ ల ద్వారా బండ బూతులు తిడుతున్నారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. రచ్చబండ కార్యక్రమం స్టార్ట్ చేసిన మొదట్లో ఇలాగే తిట్టేవారని, మధ్యలో కొన్నాళ్లపాటు ఊరుకున్నారని, ఇప్పుడు వైకాపా దారుణంగా ఓడిపోతుందని చెప్పడంతో మళ్లీ పేటీఎం కూలీలు రెచ్చిపోతున్నారన్నారు.

గోదావరి జిల్లాకు చెందిన వాడినే, కడప బ్యాచ్ పట్టుకున్నట్లుంది. వాడు అతి నీచమైన భాషను, మాటల్లో చెప్పడానికి కూడా వీలు లేని బూతు పదజాలాన్ని ఉపయోగిస్తున్నాడు. ఇటువంటి దరిద్రపు నా కొడుకులను ప్రోత్సహించే వారిని ఎన్నుకుంటారా? అని ప్రశ్నించిన రఘురామకృష్ణంరాజు, ఈసారి నాకు ఫోన్ చేస్తే… రికార్డ్ చేసి రచ్చబండ కార్యక్రమంలో వినిపిస్తానని చెప్పారు.

నేను ఎవరిని ఏమీ చేయను… ఎందుకంటే నాది గాంధేయ మార్గం. ప్రజల కోసం ధైర్యంగా పోరాడుతున్న నన్ను తిట్టి మీరు ఏమి సాధిస్తారని ప్రశ్నించారు. ఎన్ని బూతులు తిట్టినా ప్రతి ఒక్కరి ఫోను వింటున్నానని పేర్కొన్న ఆయన, మీకు ఎన్ని ఛాలెంజ్ లు చేసినా వేస్ట్… ఈ దరిద్రం వదలాలంటే, ఎన్నికల కోడ్ ఎప్పుడు వస్తుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు.

నేను ఊహించిన దానికంటే అతి పెద్ద విజయం ఖాయం
నేను ఊహించిన దానికంటే రానున్న ఎన్నికల్లో కూటమి అతిపెద్ద విజయాన్ని సాధించబోతుందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. తాజాగా టీ కొట్టు ల వద్ద, పదిమంది గుమికూడిన చోట ప్రజల వద్ద నుంచి శాంపిల్స్ సేకరించడం జరిగింది. నరసాపురం నియోజకవర్గ పరిధిలోని ఉండి లో దాదాపు 200 మందిని ప్రశ్నించగా, 127 మంది టిడిపి, జనసేన కూటమి ఉందని చెప్పారు.

మిగిలిన వారు మిగతా పార్టీల పేర్లను ప్రస్తావించారు. దాదాపు నూటికి 70 శాతం మంది టిడిపి, జనసేన కూటమి గెలుపు ఖాయమని చెబుతున్నారు. నరసాపురం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కూటమి అభ్యర్థులకు 70% ఓట్లు పోలవడం ఖాయం. రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాలలో ఎక్కడా కూడా 60 శాతానికి తగ్గే అవకాశం లేదు. ఇక వైకాపా ఎక్కడ చూసినా 30 నుంచి 40 శాతం వరకు ఓట్లను సాధించవచ్చు. ఎన్ని ఓట్లను సాధించినప్పటికీ, వైకాపా పరాజయం ఖాయమన్నారు.

పనికిమాలిన ఈ పరిపాలకుడిని వదిలించుకోవాలని ఎదురు చూస్తున్న జనం
ఎన్నికల కోడ్ ఎంత తొందరగా వస్తే, అంత తొందరగా ఈ పనికిమాలిన పరిపాలకుడిని వదిలించుకోవాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. గత నాలుగేళ్లుగా ఈ ప్రభుత్వంలో నానా అగచాట్లను పడ్డామని ప్రజలు చెబుతున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టును ఆపేస్తారా?, అమరావతి రోడ్లను తవ్వేసి కంకర, మట్టి అమ్ముకుంటారా? పోలవరం ప్రాజెక్టు అక్కడక్కడ కూలిపోయింది. ప్రాజెక్టులు కట్టమంటే, ప్రజాధనం 500 కోట్ల రూపాయలు వెచ్చించి ప్యాలెస్ నిర్మించుకుంటారా? అని ప్రజలు నిలదీస్తున్నారన్నారు.

ప్రాజెక్టులు కట్టేవారు కావాలా? సొంతంగా ప్యాలెస్ లు నిర్మించుకునేవారు కావాలా? అన్నది ఆలోచించి, ప్యాలెస్ ప్రభుత్వాన్ని సమాధి చేయాలని, ప్రాజెక్టులు కట్టే ప్రభుత్వాన్ని తీసుకురావాలని కోరారు. ప్రాజెక్టుల నిర్మాణం ద్వారానే రాష్ట్ర భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుంది. ప్రాజెక్టులు కట్టే ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం మీ చేతుల్లోనే ఉంది. ప్రజలకు సేవకుడిలా ఉండే నాయకుడిని ఎన్నుకుంటారా? ప్రజల రక్తాన్ని తాగే వాడిని ఎన్నుకుంటారా? అన్నది ప్రజల చేతుల్లోనే ఉందన్న రఘురామ కృష్ణంరాజు , అఫ్ కోర్స్ ప్రజాపాలకుడి ని ఎన్నుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

ఎన్నికల తేదీ సమీపించగానే ఈ దుర్మార్గపు పాలకుడిని ఇంటికి సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్నికల కోడ్ ఈనెల 14 లేదా 15వ తేదీలలో రానుండగా, ఏప్రిల్ 25 నుంచి మే 5వ తేదీ మధ్యలో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశం ఉందని రఘురామకృష్ణంరాజు తెలిపారు.

వైకాపాను ఓడించేందుకు సిద్ధమైన పురుషులు
వైకాపాను రానున్న ఎన్నికల్లో ఓడించేందుకు రాష్ట్ర పురుషుల్లో 75 శాతం మంది సిద్ధంగా ఉన్నారని రఘు రామ కృష్ణంరాజు తెలిపారు. నాసిరకమైన మద్యాన్ని సరఫరా చేసి త్వరలోనే పరలోక యాత్రకు ఎంతోమందిని ఈ ప్రభుత్వం సిద్ధం చేసింది. మద్యం ద్వారా ప్రజల జేబులను దోచుకున్న రాష్ట్ర ప్రభుత్వం, ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ బకాయిలను కూడా చెల్లించడం లేదు.

ఆరోగ్యశ్రీ బకాయిలను అడిగితే, కమీషన్లను అడుగుతున్నట్లు తెలిసింది. పురుషులను మటాష్ చేయాలనుకున్న ఈ ప్రభుత్వాన్ని వారు కూడా మటాష్ చేయడానికి సిద్ధమయ్యారు. 18 నుంచి 25 ఏళ్ల మధ్య యువతకు ఎలాగో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు కాబట్టి వారు కూడా వైకాపాకు ఓటు వేసే అవకాశం లేదు. పురుషుల కంటే స్త్రీలే కాస్త ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి మాయలో ఉన్నట్లు తెలిసింది. మహిళలు దైవ స్వరూపులు, వారికి జాలి గుణం కాస్త ఎక్కువ.

తాగొచ్చి సంసారాన్ని సర్వనాశనం చేసే భర్త లాగే, జగన్మోహన్ రెడ్డి కూడా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. తాగుబోతు అయిన భర్త పండగకో , పబ్బానికో చీరే, ఓ మూరెడు మల్లెపూలు తీసుకొని పెందరాలే ఇంటికి రాగానే భర్త మారిపోయాడని ప్రతి భార్య సంతోషిస్తుంది. భర్త మారిపోయాడని సంతోషిస్తే సరే సరి. సంసారం వంటి రాష్ట్రాన్ని గుల్ల చేస్తున్న ప్రభుత్వ పెద్ద పై మాత్రం జాలి చూపెట్టడం కరెక్ట్ కాదు. రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి చిన్నాభిన్నం చేశారు. అటువంటి వ్యక్తి మీ అకౌంట్లో డబ్బులు వేశారనుకుంటే పొరబడినట్లే అవుతుంది.

ఎందుకంటే గతంలో ఇదే స్కీమ్ ద్వారా ముఖ్యమంత్రులుగా చంద్రబాబు నాయుడు, వైయస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డిలు నేరుగా కాలేజీలకు ఫీజులు చెల్లించేవారు . అప్పుడు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడానికి కాలేజీల యాజమాన్యాలు ఎటువంటి ఇబ్బందులు పెట్టలేదు. ఇప్పుడు ఓట్ల కోసం జగన్మోహన్ రెడ్డి కాలేజీలకు నేరుగా ఇచ్చే డబ్బులనే, తల్లుల అకౌంట్లో జమ చేస్తున్నారు. ఒక రకంగా పండుగకో, పబ్బానికో చీరే, మల్లె పువ్వులు తీసుకువచ్చి భార్యను సంతోష పెట్టాలన్న భర్త ఉద్దేశమే, జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిలో కనిపిస్తుంది.

లావణ్య అనే ఒక విద్యార్థిని ఇటీవల డిగ్రీ ఉత్తీర్ణురాలయింది. అయినా ఆమెకు కాలేజీ యాజమాన్యం సర్టిఫికెట్లను ఇవ్వలేదు. ఎందుకంటే, కాలేజీ యాజమాన్యానికి ప్రభుత్వం నేరుగా ఫీజు చెల్లించి ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదని లావణ్య చెప్పిందన్నారు.

విద్యుత్ బిల్లులు, మద్యం ఖర్చులతో మీ అకౌంట్ లో వేసే సొమ్ముతో సరి చూసుకోండి
ప్రతి ఇంటికి వచ్చే విద్యుత్ బిల్లులు, మద్యం కోసం మీ భర్తలు చేస్తున్న ఖర్చులతో, జగన్మోహన్ రెడ్డి మీ అకౌంట్ లో జమ చేస్తున్న డబ్బులతో సరి చూసుకోవాలని మహిళలను రఘురామకృష్ణం రాజు కోరారు. అమ్మ ఒడి, ఆసరా పేరిట జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న దాని కంటే, ఒక్క మద్యం ద్వారానే మూడింతల డబ్బులు మీ వద్ద నుంచి లాగేస్తున్నారు. ఈ విషయాన్ని ఎన్నోసార్లు రచ్చబండ కార్యక్రమం ద్వారా వివరించానన్నారు .

పాత చీరలు కొంటాం… తపాలాలు ఇస్తాం అని తిరిగే బృందం వంటిది జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజల్ని కాపాడడానికి మహిళలు మహిషాసుర మర్దిని, రాణి రుద్రమదేవి అవతారం ఎత్తాలన్నారు. కూటమి విజయం ఖాయమని, కాకపోతే రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన పాలకుడు కోలుకోలేని వరాజయాన్ని మూట కట్టుకోవాలన్నదే తన ఆకాంక్షని పేర్కొన్నారు. రాష్ట్ర మహిళల సహకారంతో కూటమి అప్రహతీత విజయం సాధించాలన్నారు.

కట్లు కట్టింది ఎవరు?… కుట్లు వేసింది ఎవరు?
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డిని దారుణంగా హత్య చేసిన అనంతరం ఆయన శవానికి కట్లు కట్టింది ఎవరు? కుట్లు వేసింది ఎవరు? అని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు.

కట్లు కట్టి, కుట్లు వేసిన వారి ఆయన హత్యకు పథక రచన చేశారు.. వైఎస్ వివేకానంద రెడ్డి రాసిన లేఖ ముందుగా చూపెట్టకపోవడం వల్లే, అది హత్య అని గుర్తించలేకపోయామన్న సాక్షి దినపత్రిక రాతలు హాస్యాస్పదంగా ఉన్నాయి. వైయస్ వివేకానంద రెడ్డి చనిపోయిన తర్వాత లేఖ రాసే అవకాశమే లేదు. ఆయన లేఖలో పేర్కొన్నట్లుగా ప్రసాద్ అనే వ్యక్తి అప్పుడు అక్కడ లేనే లేరు.

అందుకే డాక్టర్ సునీతా రెడ్డి భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి లేఖను దాచి పెట్టాలని వివేకానంద రెడ్డి వ్యక్తిగత సహాయకుడైన కృష్ణారెడ్డికి సూచించారు. అయినా, ఒకవైపు తలలోని పుచ్చ లేచిపోయి, ఒళ్లంతా చీరేసి ఉంటే గుండెపోటు అని ఉదయం 8 గంటల వరకు సాక్షి మీడియా, విజయసాయి రెడ్డిలు ఎందుకు ప్రజలని మభ్య పెట్టాలని చూశారు. సాక్షి దినపత్రికలో రాసినట్లుగా ఒకవేళ డాక్టర్ సునీతారెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసి ఉంటే, వారే ఎందుకు పోస్టుమార్టం చేయాలని పట్టుబడుతారు.

లేఖను దాచి పెట్టమని కృష్ణారెడ్డి కి ఎందుకు సూచిస్తారు. వైఎస్ వివేకా హత్య జరిగిన రోజు, హంతకులు వైయస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి ఇంట్లోనే ఉన్నట్లుగా గూగుల్ టేక్ అవుట్ ఆధారంగా సిబిఐ నిర్ధారించింది. అలాగే ఉదయం ఐదున్నర గంటలకు హైదరాబాదులోని జగన్మోహన్ రెడ్డి నివాసమైన లోటస్ పాండ్ కు ఫోన్ వచ్చినట్లుగా రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లం రెడ్డి సిబిఐ కి వాంగ్మూలాన్ని ఇచ్చారు.

ఐదున్నర గంటలకే వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురైనట్టు తెలిసినప్పటికీ, ఏడు గంటల వరకు ఆ నిజాన్ని వైయస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు ఎందుకు దాచి పెట్టారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన తీరును జగన్మోహన్ రెడ్డి కళ్ళకు కట్టినట్లుగా, గొడ్డలితో చంపారని ఎలా చెప్పగలిగారని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు.

తొలుత సిబిఐ విచారణ కోరిన వారు… పోలీసులతో విచారణ ఎందుకు చేపట్టారు?
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య అనంతరం సిబిఐతో విచారణ జరిపించాలని కడప ప్రస్తుత ఎంపీ అవినాష్ రెడ్డి అప్పుడు డిమాండ్ చేశారు. అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ పై తమకు నమ్మకం లేదన్నారు. ఎన్నో కేసులలో అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ లు ఎటువంటి ఫలితాలను సాధించలేదని పేర్కొన్నారు.

గతంలో సిబిఐ విచారణకు డిమాండ్ చేసిన వారే, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు రాష్ట్ర పోలీసులతో విచారణ చేపట్టారు. వైయస్ సునీతా రెడ్డి సిబిఐ విచారణ ఆదేశించాలని ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డిని కోరితే, ఇప్పటికే నాపై 11 సిబిఐ కేసులు ఉన్నాయని, ఇది 12వది అవుతుందని ఎలా చెప్పారు. అప్పుడే ఆయన తన మెడకు ఈ కేసు చుట్టుకుంటుందని ఊహించారా? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.

ఒకవేళ సునీతా రెడ్డి, ఆమె భర్త హత్య చేసి ఉంటే… సిబిఐ విచారణ కోరుతూ, హైకోర్టును ఎందుకు ఆశ్రయించి ఉండేవారని నిలదీశారు. వైయస్ వివేకానంద రెడ్డిని ఎవరు హత్య చేశారో అందరికీ తెలిసిపోయిందని, అయినా సాక్షి దినపత్రిక తన తప్పుడు రాతల ద్వారా ఇంకా ప్రజల్ని మభ్య పెట్టాలని చూస్తోందని రఘురామకృష్ణం రాజు విమర్శించారు.

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య మిస్టరీని ఆధారంగా చేసుకుని సినిమా తీసి ఉంటే కలెక్షన్ల వర్షం కురిసేదన్నారు. వ్యూహం పేరిట ప్రజలు ఛీత్కరిస్తున్న వ్యక్తి జీవిత గాధను తెర కు ఎక్కించడం వల్ల అతి తక్కువ కలెక్షన్లు నమోదు చేసిన సినిమాగా గిన్నిస్ బుక్ రికార్డును సృష్టించిందని అపహాస్యం చేశారు.

వ్యూహం సినిమా చూసిన ప్రేక్షకుల కంటే, రచ్చబండను ప్రతిరోజు తిలకించే వీక్షకులే ఎక్కువ అని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. అన్ని వేదికల ద్వారా రచ్చబండ కార్యక్రమానికి మిలియన్ మంది వ్యూవర్స్ ఉన్నారన్నారు.

Leave a Reply