– మంత్రి సవితతో పేదలు, కార్మికులు
– విజయవాడ రాణిగారితోట అన్న క్యాంటీన్ ను సందర్శించిన మంత్రి
– భోజనం చూస్తున్న వారితో మాటామంతి
– రూ.5ల భోజనంతో కడుపు నింపుకుంటున్నాం
– ఇంటి భోజనంలా ఉంది
– కూలి డబ్బులు మిగిలుతున్నాయి
– చంద్రబాబుకు, పవన్ కు, లోకేశ్ కు ధన్యవాదాలు
– పాలనలో చంద్రబాబే నెంబర్ వన్
విజయవాడ: భోజనం చాలా బాగుంది… ఇంటి భోజనంలా రుచిగా ఉంది… అన్న క్యాంటీన్ వల్ల కడుపు నిండా భోజనం చేస్తున్నాం… చిన్న చిన్న షాపులో పనిచేస్తున్న మాలాంటి వాళ్లకు రూ.5 లకే భోజనం దొరుకుతుండడంతో డబ్బులు మిగులుతున్నాయి… చాలా ఆనందంగా ఉంది… సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కు, మంత్రి లోకేశ్ కు మా ధన్యవాదాలు… పాలనలో సీఎం చంద్రబాబే నెంబర్ వన్… అని అన్న క్యాంటీన్ లో భోజనం చేస్తున్న పేదలు, కార్మికులు కొనియాడుతున్నారు.
మంగళవారం గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వస్తున్నారు. మార్గంలోని విజయవాడలోని రాణిగారితోట బాలాజీ నగర్ లో ఉన్న అన్న క్యాంటీన్ ను సందర్శించారు. అక్కడ భోజనం చేస్తున్నవారితో ముచ్చటించారు. సామాన్యురాలిలా తాను కూడా లైన్ లో నిల్చొని, రూ.5ల టోకెన్ తీసుకుని భోజనం చేశారు.
తనతో పాటు భోజనం చేస్తున్న వారిని పేరు పేరునా అప్యాయంగా పలుకరించారు. భోజనం ఎలాగుంది… ఏం చేస్తున్నారు.. ఎక్కడి నుంచి వచ్చారు…? అంటూ కుశల ప్రశ్నలు వేశారు. అందుకు అన్న క్యాంటీన్ లో భోజనం చేస్తున్నవారంతా సంతృప్తి వ్యక్తం చేశారు.
‘ఇంటి భోజనంలా రుచిగా ఉంది.. కూలి పనిచేసుకుంటున్న మాలాంటి వారికి అన్న క్యాంటీన్ వల్ల ఎంతో మేలు కలుగుతోంది.. రూ.5లకే కడుపు నింపుగా భోజనం చేస్తున్నాం… బయట హోటల్ లో తినలేక ఆకలితో కడుపు మాడ్చుకునేవాళ్లం… ఇప్పుడు కూలి డబ్బులు మిగులుతున్నాయి… మా కష్టాన్ని తెలుసుకుని అన్న క్యాంటీన్లు ప్రారంభించిన సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు, మంత్రి లోకేశ్ కు ధన్యవాదాలు… చంద్రబాబు వల్ల మా కడుపు నిండుతోంది…. పాలనలో సీఎం చంద్రబాబే నెంబర్ వన్..’ అంటూ తమ ఆనందాన్ని అక్కడి వారంతా వ్యక్తంచేశారు.
తల్లికి వందనం, ఉచిత గ్యాస్ పథకాలు అందాయా… ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం వినియోగించుకున్నారా..? అని అక్కడ భోజనం చేస్తున్న మహిళలను అడిగి మంత్రి తెలుసుకున్నారు. ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం వల్ల ఛార్జీలు మిగిలాయని, ఆ డబ్బులతో కుటుంబ అవసరాలు తీరుతున్నాయని మహిళలు ఆనందం వెలిబుచ్చారు.
సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న మరిన్ని పథకాల గురించి మంత్రి సవిత వివరించారు. చంద్రబాబు పాలనపై ప్రజల నుంచి వచ్చిన సానుకూల స్పందనపై మంత్రి సవిత ఆనందం వ్యక్తంచేశారు. అంతకు ముందు అన్న క్యాంటీన్ సందర్శనకు వచ్చిన మంత్రి సవిత పరిసరాలను, పాత్రలు శుభ్రం చేసే గదిని పరిశీలించారు.
అన్న క్యాంటీన్ ను, ఎప్పటికప్పుడు ఆహార పదార్థాల పాత్రలను, ప్లేట్లను శుభ్రం చేస్తున్న సిబ్బందిని మంత్రి సవిత అభినందించారు. పేదలకు, కార్మికులకు రూ.5లకే భోజనం అందించాలన్న సీఎం చంద్రబాబు లక్ష్య సాధనలో భాగమైన సిబ్బంది సేవలను కొనియాడారు. మంత్రి సవిత వెంట పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.