– రాష్ట్ర సంపదైన రామోజీరావును కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగు జాతిపై ఉంది
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత రామోజీరావు అత్యంత గౌరవనీయమైన వ్యక్తి, ఆయన మన రాష్ట్ర సంపద, ఆయనను కాపడుకోవాల్సిన బాధ్యత తెలుగుజాతిపై ఎంతైనా ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య పిలుపునిచ్చారు.
‘ఈనాడు’ను ఎదుర్కునే దమ్ము, ధైర్యం లేక రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. సమాజానికి మార్గదర్శకుడిగా ఉన్న మార్గదర్శి అధినేతపై బురదజల్లడం ఎంతవరకు సబబు? రాష్ట్ర ప్రభుత్వం జగన్ నేతృత్వంలో మార్గదర్శిని మట్టుబెట్టాలి, అభాసుపాలు చేయాలని కుట్ర పన్నింది, అందులో భాగంగానే సీఐడీ చే ప్రెస్ మీట్ లు పెట్టడం, లేనిపోని రాద్ధాంతాలు చేయడం చేస్తోంది.
చందాదారులే మార్గదర్శిపై ఎదురుతిరిగేలా కుట్రలు చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం. ఈనాడు లో జగన్ అసమమర్థ, అవినీతి, అప్రజాస్వామిక, రాజ్యంగ వ్యతిరేక, అవగాహనా రాహిత్య పరిపాలనను ఎండగడుతున్నందుకే మార్గదర్శిపై ఈ కక్షగట్టారు. సమాజంలో రామోజీరావును అభాసుపాలు చేయాలన్నది ఈ కుట్రలో భాగమే. సజ్జల రామకృష్ణారెడ్డి, రఘురామిరెడ్డి లాంటి పోలీసు అధికారులు, ఇంటలిజెన్స్ అడిషనల్ డీజీ, సీఐడీ డీజీ సంజయ్, జగన్ అందరూ కలిసి ఈ కుట్ర పన్నారు.
పాత విషయాలనే సీఐడీ సంజయ్ మళ్లీ మళ్లీ వల్లెవేస్తున్నారు. చందాదారుల్లో అపోహలు సృష్టించాలని సీఐడీ ప్రయత్నిస్తోంది. దేశ వ్యాప్తంగా 6 దశాబ్దాలుగా మార్గదర్శిపై చిన్న ఆరోపణ కూడా రాలేదని ఆల్ ఇండియా అసోసియేషన్ ఆఫ్ ఛిట్ ఫండ్స్ చెప్పింది. అసోసియేషన్ వాదనను ఏపీ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడంలేదు. మార్గదర్శిని మట్టుబెట్టాలని సీఐడీ ఎందుకు ఇంతగా అత్యుత్సాహం చూపుతోందో అర్థం కావడంలేదు.
ఆంధ్రప్రదేశ్ అంటే గంజాయి, గంజాయి అంటే ఆంధ్రప్రదేశ్ లా ఉంది. ఎక్కడ గంజాయి పట్టుబడినా మూలాలు ఆంధ్రప్రదేశ్ లోనే దొరుకుతున్నాయి. దీనిపై సీఐడీ సంజయ్ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టరు? సీఎం ఇంటి సమీపంలో రేప్ జరిగితే, నిందితుడు ఇంతవరకు దొరక్కపోతే దానిపై సీఐడీ డీజీ సంజయ్ ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టారా? రాష్ట్రంలో అనేక నేరలు, ఘోరలు జరుగుతున్నా దానిపై ఏనాడు సీఐడీ ప్రెస్ మీట్ పెట్టలేదు.
దళిత రైతుల చేతులకు బేడీలు వేసి ఊరేగించినా ఏనాడు సీఐడీ ప్రెస్ మీట్ పెట్టలేదు. సీఎం ఏదైనా పెద్ద పోస్టు ఇస్తానని సంజయ్ కు ఆశ ఏమైనా చూపారా? మరెందుకంత మీ అత్యుత్సాహం సంజయ్ గారూ! పద్మవిభూషణ్ గ్రహీత రామోజీరావును మానసిక క్షోభకు గురి చేయడం తగునా?
జగన్ మోహన్ రెడ్డి అవినీతి, అప్రజాస్వామిక, రాజ్యంగ వ్యతిరేక, అవగాహనా రాహిత్య పరిపాలన గురించి అడుగడుగునా వారి పత్రికలో ఎండగడుతున్నారు గనుక ఏదో ఒక రకంగా రామోజీరావును దెబ్బతీయాలని కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగమే మార్గదర్శిపై దాడి. ఈనాడు పత్రిక ద్వారా ప్రజలను చైతన్యం చేస్తున్నారనే అక్కసుతోనే మార్గదర్శిపై దాడి. ఎలాగైనా రామోజీరావును సమాజంలో అభాసుపాలు చేయాలకోవడం ఒట్టి భ్రమే. ఎందుకిలా వ్యవహరిస్తున్నారు?
ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకురండని కోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసినా బుద్ధి రావడంలేదు. మార్గదర్శి అంటే ప్రజల్లో ఒక రకమైన యేహ్య భావాన్ని సృష్టించాలనుకుంటే వారు తవ్విన గోతిలో వారే పడతారు. 6 దశాబ్దాలుగా రామోజీరావు కూడగట్టుకున్న నమ్మకాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారు. పుంఖాను పుంఖానులుగా ప్రభుత్వ అవినీతిని బయటపెట్టినందుకే ఈ కక్ష. ఈనాడు పత్రిక ముక్కుసూటిగా వెళ్లడంతోనే అత్యధిక సర్క్యులేషన్ తో ముందుకు వెళ్లగలుగుతోంది. అందరు ప్రజల మన్ననలను పొందగలిగింది. అయితే దురుద్ధేశంతో జగన్ ఆ పత్రికపై కక్షగట్టి ఏమీ చేసుకోలేక రామోజీరావును దెబ్బతీయాలని ఆయనకు సంబంధించిన మార్గదర్శిపై పడ్డారు.
కక్ష, కార్పణ్యం, పగ, ధ్వేషం, అసూయ రామోజీరావుపై చూపడం కరెక్టు కాదు. ప్రజాస్వామ్యవాదులు, ప్రతి పౌరుడు కూడా మార్గదర్శిపై బురద జల్లడాన్ని గర్హించాలి. సీఐడీ చేష్టలను, మార్గదర్శిపై దొడ్డి దారిన, దొంగ దారిన దాడి చేయడాన్ని ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలి. పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత రామోజీరావు అత్యంత గౌరవనీయమైన వ్యక్తి, ఆయన మన రాష్ట్ర సంపద, ఆయనను కాపడుకోవాల్సిన బాధ్యత తెలుగుజాతిపై ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు.