నాగార్జున సాగర్ ,పులిచింతల ప్రాజెక్ట్ ల రూప శిల్పి పద్మభూషణ్ డా.కె.ఎల్.రావు

కానూరి లక్ష్మణరావు అంటే ఒక్కరికి కూడా తెలియదుకాని డా.కె. ఎల్ రావు గా జగద్విఖ్యాతులు. కృష్ణాజిల్లా కంకిపాడులో జూలై 15, 1902 జన్మించారు. ఆయన సోదరి ప్రముఖ వైద్యులు డా కొమర్రాజు అచ్చమాంబ. గ్రామకరణం అయిన తండ్రి గారు 9 వ ఏటనే గతించారు. చిన్నతనంలో బడిలో ఆటలాడుతుండగా దెబ్బ తగిలి ఒక కంటి చూపు పోయింది. ప్రాధమిక విద్య పూర్తి చేసి మద్రాస్ ప్రెసిడెన్సి కాలేజిలో చేరి ఇంటర్ చదివి పాసై ,గిండీ ఇంజనీరింగ్ కాలేజీ లో మొదటి బాచ్ విద్యార్ధిగా చేరి ఇంజనీరింగ్ లో మాస్టర్ డిగ్రీ పొందారు .లండన్ వెళ్లి బర్మింగ్ హాం యూనివర్సిటి నుంచి 1939 లో పి.హెచ్ .డి .తీసుకున్నారు.కే సి చాకో మార్గదర్శకం లో ఎంతో పరిశోధన చేశారు. మద్రాస్ యూనివర్సిటి నుంచి మొదటి ఎం.ఎస్ .డిగ్రీ అందుకున్న ఘనత సాధించారు. రంగూన్ బర్మాలలో ప్రొఫెసర్ గా పని చేశారు .

లండన్ లో కాంక్రీట్ కు సంబంధించిన అంశాలపై తీవ్ర అధ్యయనం ,పరిశోధనలు చేశారు .అమెరికా వెళ్లి సెల్యులర్ ,కాఫర్ శైలీ నిర్మాణం మీద సాధికారత సాధించి ఉమ్మడి మద్రాస్ ప్రభుత్వానికి సమర్పించారు.మద్రాస్లో కూవం నదిపై ఉన్న పురాతన ఇనుప బ్రిడ్జి తుప్పు పట్టి కూలిపోయే పరిస్థితి వస్తే ,దాన్ని అలాగే ఉంచి కాంక్రీట్ తో పునర్నిర్మించి దేశాన్నీ ప్రపంచాన్నీ దిగ్భ్రాంతికి గురి చేసిన సమర్ధులైన ఇంజనీర్ రావు గారు .అప్పటికి ప్రపంచం లో ఒక్క ఫ్రాన్స్ దేశం లో మాత్రమే కాంక్రీట్ కట్టడాలు నిర్మించేవారు.

ఫ్రాన్స్ వెళ్ళకుండానే, ఆ కట్టడాలను చూడకుండానే తన అసాధారణ మేదస్సుతో కాంక్రీట్ వంతెన నిర్మించి ,రైల్వే చీఫ్ ఇంజనీర్ ప్రశంసలు అందుకున్న సమర్ధులు .ఈ బ్రిడ్జి నిర్మాణం అయ్యాకనే రావు గారు ఫ్రాన్స్ వెళ్లి ,ప్రసిద్ధ ఇంజనీర్ ఫ్రేన్సియనేట్ వద్ద శిక్షణ పొంది తన కౌశల్యానికి మెరుగులు దిద్దుకున్నారు .అక్కడి నుంచి లండన్ వెళ్లి కాంక్రీట్ ఇంజనీరింగ్ సంస్థలో చేరి పరిశోధనలు కొనసాగించారు .మద్రాస్లో సుఖంగా గడుపుతున్న ‘’జీత జీవితాన్ని’’ వదలి, మళ్ళీ లండన్ వెళ్లి అష్టకష్టాలు పడుతూ కాంక్రీట్ పరిశోధన చేశారు. లండన్ లో థేమ్స్ నది పై కట్టిన వంతెనను సాకల్యంగా పరిశీలించి తన సృజనాత్మక శక్తితో నూతన పరిశోధనలు చేశారు .

ప్రముఖ ఇంజనీర్ జే.ఏ. సాలేజ్ వద్ద అసిస్టెంట్ గా చేరి వంతెనల నిర్మాణాలకు సలహాలిస్తూ సహాయమందించారు. ఆంధ్రుల చిరకాల కల శ్రీరామ పాద సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణ ప్రణాళిక కోసం మద్రాస్ ప్రభుత్వ చీఫ్ ఇంజనీర్ గోవిందరాజు అయ్యంగార్ కలిసి లండన్ ప్రాజేక్ట్ డిజైనింగ్ పై విస్తృత అధ్యయనం చేసి ఒకే ఒక్క ఏడాదిలో డాం డిజైన్ రూపొందించారు .ఆ డిజైన్ లపై ప్రభుత్వానికి శ్రద్ధ లేకపోవటం వలన అవి దుమ్ము కొట్టుకు పోయాయి .లేకపోతె అప్పుడే అది సాకారమయి ఉండేది .నాగార్జున సాగర్ నిర్మాణం లో రాతికట్టడం నమూనాను అమెరికా డెన్మార్క్ ప్రయోగశాలలకు పంపి,పరిశోధనా ఫలితాలను తెప్పించారు.

విశాఖ ,రంగూన్,మద్రాస్ లలో నీటి పారుదల శాఖ లో పని చేశారు. లండన్ లొఘ్ బోరో ఇంజనీరింగ్ కాలేజి లెక్చరర్ గా ఉన్నారు .మద్రాస్ ప్రభుత్వ డాం లను రూపొందించే ఇంజనీర్ గా సేవలందించారు .1962 లో కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ వాటర్ అండ్ పవర్ మంత్రిత్వ శాఖ లో డిజైన్ అండ్ రిసెర్చ్ విభాగ సభ్యుడిగా ఉన్నారు .విద్యుత్ శక్తి సహాయ మంత్రిత్వ శాఖ ఇంజనీర్ గా ,ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వ డైరెక్టర్ ఆఫ్ డిజైన్ గా, చీఫ్ ఇంజనీర్ గా చిరస్మరణీయ సేవలందించారు .1954 లో సెంట్రల్ వాటర్ అండ్ పవర్ కమీషన్ చీఫ్ ఇంజనీర్ ,1959 లో విద్యుచ్చక్తి ,నీటి పారుదల కేంద్ర మండలి అధ్యక్షులుగా ఉన్నారు.

రావుగారి విశేష విజ్ఞతకు సామర్ధ్యానికి ఎన్నో విశిష్ట పురస్కారాలు పొందారు. ఇండియన్ నేషనల్ సోసైటీఆఫ్ సాయిల్ మెకానిక్స్ అండ్ ఫౌండేషన్స్ఇంజనీర్స్ ,ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ,లండన్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ స్ట్రక్చరల్ ఇంజనీర్స్ లండన్ వంటి ప్రఖ్యాత సంస్థలకు అధ్యక్షులుగా చేసిన ప్రతిభ రావు గారిది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ గౌరవాధ్యక్షులు. యునైటెడ్ నేషన్స్ కమిటీ ఆఫ్ నాచురల్ రిసోర్సెస్ కు చైర్మన్.

ప్రపంచంలోనే అతిపొడవైన రాతి కట్టడమైన నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ల నిర్మాణ రూప శిల్పి రావు గారు. ఒరిస్సా లోని హీరాకుడ్ డాం నిర్మాణానికి సహకరించారు. ఆంధ్రుల అందులో ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లాలకు నీటి కొరత చింతలను బాపే పులి చింతలప్రాజేక్ట్ అవసరంపై ప్రభుత్వాలకు చెవిలో జోరీగగా ఎన్ని సార్లు చెప్పినా అది బధిర శంఖారావమే అయింది .అది ఆయన సారధ్యం లో నిర్మింపబడి ఉంటె ఆంధ్రప్రదేశ్ ఎప్పుడో సస్య శ్యామలమై నీటి కరువు ఎదుర్కోకుండా ఉండేది .కృష్ణా, తుంగ భద్ర, పెన్నా ప్రాజెక్ట్లకు ఎంతో చొరవ చూపిన ద్రష్ట.

భారత దేశ భారీ స్థాయి జలవిద్యుత్ పధకాలను విస్తృతంగా ప్రభావితం చేసిన మేధావి ఇంజనీర్ సాంకేతిక నైపుణ్యం ఉన్న పరిశోధక పరబ్రహ్మ డా. రావు గారు. తన అనుభవం పరిశీలన పరిశోధన విస్తృత అధ్యయనాలతో 300 కు పైగా పరిశోధనా పత్రాను పరమ ప్రామాణికంగా రాశారు .రీ ఇన్ ఫోర్స్ డ్ కాంక్రీట్ పై రావు గారు రాసిన గ్రంధం ఉత్తమోత్తమ ప్రామాణిక గ్రంధంగా ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. ఈ గ్రంధం అనేక దేశాలలో ఇంజనీరింగ్ విద్యార్ధులకు, పరిశోధకులకు పాఠ్య గ్రంధంగా ఉంది .’’జర్నల్ ఆఫ్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ ఇండియన్ ఇంజనీర్స్’’ లో రావు గారు రాసిన ప్రామాణిక వ్యాసాలకు రాష్ట్ర పతి చేతులమీదుగా మూడు సార్లు బంగారు పతకం పొందారు .

ఆంధ్ర విశ్వ విద్యాలయం 1960 లో, రూర్కీ యూని వర్సిటి ,జవహర్ లాల్ టెక్నలాజికల్ యూనివర్సిటీ లు రావు గారి అశేష ప్రతిభా సామర్ధ్యాలను గుర్తించి డాక్టర్ ఆఫ్ సైన్స్ ,గౌరవ డాక్టరేట్ లు అందించి సన్మానించాయి. 1963లో కేంద్ర ప్రభుత్వం ’’పద్మభూషణ్ ‘’ పురస్కారంతో గౌరవించింది. అమెరికాలోని కొలరాడో నదిపై నిర్మించిన డాం కు రూప శిల్పి డాక్టర్ రావు గారని మనకు తెలియదు .రావు గారి చిరకాల వాంచితం గంగా కావేరీ నదుల అనుసంధానం. అది కలగానే ఇంకా మిగిలి ఉండటం దురదృష్టం.

మొదటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న కె.ఎల్ .రావు గారు 1961 లో రాజకీయాలలో చేరి విజయవాడ పార్లమెంట్ కుమూడు సార్లు ఎన్నికయ్యారు.ప్రధాని నెహ్రు మంత్రి వర్గం లో 1963 జులై 20 నుంచి పదేళ్ళపాటు 1973 వరకు కేంద్ర నీటిపారుదల జలవిద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు. తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి , ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు కూడా ఇదే శాఖామాత్యులుగా ఉన్నారు .ఆయన పదవీ కాలం లో ఆంధ్రరాష్ట్ర అభ్యుదయంకోసం ఎంతో కృషి చేశారు .విజయవాడ లో ‘’గాంధీ హిల్ ‘’ఆవిర్భావానికి ,అక్కడ సైన్స్ మ్యూజియం ,కృత్రిమ వాటర్ ఫాల్స్ ఏర్పాటుకు రావు గారే ముఖ్య కారకులు.

కానీ అక్కడ ఆయన పేరు ఎక్కడా కనిపించదు. కనకదుర్గ గుడి ఘాట్ రోడ్ నిర్మాణానికి సలహాలిచ్చారు .బుడమేరు వరదల నుండి కాపాడటానికి, వంతెన నిర్మాణానికి ఆయన ఇచ్చిన సలహాలు వరదల్లో కొట్టుకు పోయాయి .భవానీపురం లో అండర్ టన్నెల్ రూప శిల్పి ఆయనే. 2006 లోగుంటూరు జిల్లా బెల్లంకొండ వద్ద నిర్మించిన పులిచింతల ప్రాజేక్ట్ కు ‘’డా .కె.ఎల్.రావు సాగర్ ప్రాజెక్ట్ ‘’గా నామకరణం చేసి రావు గారిని చిరస్మరణీయం చేసింది ప్రభుత్వం .

నిర్మాణాలే కాదు జాతి పునర్నిర్మాణానికి డా రావు గారు చేసిన సేవలు చిరస్మరణీయమైనవి .డా. కె .ఎల్. రావు గారు మే 18, 1986 న 84 వ ఏట మరణించారు. భారత రత్న మోక్ష గుండం విశ్వేశ్వరయ్య జయంతి సెప్టెంబర్ 15 ను ఇంజనీర్స్ డే గా జరుపుతూ రావు గారినీ మొక్కుబడి గా స్మరిస్తున్నారు. బెజవాడలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ సంస్థ కె.ఎల్. రావు స్మారక భవనం నిర్మించి ఆయన కాంస్య విగ్రహం ప్రతిష్టించింది.

నిష్కళంక ప్రజాసేవకులుగా, జాతి నిర్మాతగా కె. ఎల్. రావు గారు నైతిక విలువలకోసం అహర్నిశలు కృషి చేశారు .ఖద్దరు పాంటు షర్ట్ లనే ఎప్పుడూ ధరించే రావు గారిని ‘’ఖద్దర్ ఇంజనీర్ ‘’అంటారు.
తండ్రి రావు గారికున్న సద్గుణాలన్నీ పుణికి పుచ్చుకున్న కుమార్తె శ్రీమతి సుజాతా రావు ఐ. ఏ. ఎస్. ఆఫీసర్ గా కలెక్టర్ గా తన సమర్ధత, నిర్భీకత నిజాయితీలను రుజువు చేసుకొని రిటైరయ్యారు .

(ఆంధ్ర శాస్త్రవేత్తలు పుస్తకం నుండి దుర్గాప్రసాద్ గారి సేకరణ)

Leave a Reply