– రాజకీయ–ఆర్థిక సంక్షోభంతో దాయాదిని చూసి పొరగు దేశం నేర్చుకున్నది శూన్యం
– రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి
ఇండియా ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశం అని మొన్న ఏప్రిల్ 19న ఐక్యరాజ్యసమితి (ఐరాస) అనుబంధ సంస్థ యూఎన్ ఎఫ్‌పీఏ ఇండియా అంచనా వేసింది. చైనా జనసంఖ్యను (142.57 కోట్లు)ను దాటిన ఇండియా జనాభా 142.86 కోట్లు అని ఈ సంస్థ ప్రకటించడం దేశంలో ఇది చర్చనీయాంశంగా మారింది. కొన్నాళ్లకు ఈ అంశంపై చర్చ సద్దుమణిగింది.
ఇప్పుడు మన దాయాది రాజ్యం పాకిస్తాన్ జనసంఖ్య ఎంతో లెక్క తేలడంతో అక్కడ తాజాగా దేశ జనాభా ఇంతగా పెరిగిందా? అంటూ రాజకీయ పరిశీలకులు, అర్థశాస్త్రవేత్తలు, జనాబా నిపుణులు ఎవరూ ఆశ్చర్యపడడం లేదు. దేశ జనసంఖ్య 24,95,66,743 అని ఇటీవల పాకిస్తాన్ చీప్ సెన్సస్ కమిషనర్ నయీముజ్ జాఫర్ ప్రకటించారు.
పాక్ జనాభా చెప్పుకోదగ్గ స్థాయిలో ఇలా పెరిగిందనే మాట ప్రస్తుతం తీవ్ర రాజకీయ, ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న మన పొరుగుదేశంలో వినిపించకపోవడం విశేషం. అనేక ఇబ్బందులు, కష్టాల మధ్య జనాభా ఇంతగా పెరిగిపోయిందనే చర్చ పాక్ సెంట్రల్ అసెంబ్లీ, సెనెట్, రాష్ట్రాల అసెంబ్లీల్లో గాని, సోషల్ మీడియా, సాంప్రదాయ మీడియాలో గాని జరగడంలేదు. ఇండియాలో మాదిరిగానే పాక్ లో కూడా మొదటిసారి జనాభా లెక్కల సేకరణ 1951లో జరిగింది.
అప్పటి నుంచి పాకిస్తాన్ జనాభా రెండుసార్లు రెట్టింపు అయింది. మరో 4 ఏళ్లలో (2027 నాటికి) మరోసారి ఇది రెట్టింపు అవతుందని అంచనా. అంటే 1951 నుంచి దేశ జనాభా నాలుగు రెట్లు పెరిగినట్టవుతుందని పాక్ జనాభా నిపుణుడు డా.ఫరీద్ మిధేత్ అభిప్రాయపడుతున్నారు. దేశ జనాభాలో యువత ఎక్కువ (ప్రస్తుతం 5 కోట్ల 87 లక్షలు) అనీ, ఇదే తమ అదృష్టమని పాక్ పౌర, సైనిక పాలకులు ఇప్పటి వరకూ చెబుతూ వచ్చారు.
కాని, దేశంలో కోటీ 70 లక్షల మంది యువతీయువకులు పనీపాటా లేకుండా నిరుద్యోగంతో బాధపడుతున్నారని ప్రముఖ పాక్ అర్థశాస్త్రవేత్త డా.హఫీజ్ ఏ పాషా అంచనా వేశారు. అసలే అలవికాని సమస్యలతో తలమునకలై ఉన్న ప్రభుత్వాలు యువతను పీడించే నిరుద్యోగం నిర్మూలించే కార్యక్రమం ఏదీ చేపట్టలేదు.
ఒక్క 2022లోనే 8 లక్షల మంది విద్యావంతులు దేశం విడిచిపోయారు!
పీకల లోతు అవినీతి, అవ్యవస్థలో మునిగిపోయిన పాకిస్తాన్ లో తమకు భవిష్యత్తు లేదనే నిర్ణయానికి వచ్చారు అక్కడి యువత. ప్రతిభాపాటవాలున్న విద్యావంతులైన యువతీయువకులు 8,00,000 మందికి పైగా ఇతర దేశాల్లో పనిచేయడానికి వెళ్లిపోయారు. ఇవి ప్రభుత్వం అందించిన గణాంకాలు. వాస్తవానికి దేశం విడిచి ప్రపంచ దేశాలకు వలసపోతున్న యువత సంఖ్య ఇంకా చాలా ఎక్కువ ఉండొచ్చని అంచనా. చట్టవ్యతిరే పద్ధతుల్లో కూడా పాక్ యువత ఇతర దేశాలకు పోవడానికి చేస్తున్న ప్రయత్నాల వల్ల వారిలో చాలా మంది తీవ్ర కష్టనష్టాలకు గురవుతున్నారు.
ఇలాంటి అక్రమ వలసదారులు కిందటి నెల గ్రీస్ దగ్గర పడవ ప్రమాదంలో అనేక మంది మరణించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ లోని యూనివర్సిటీ పట్టభద్రుల్లో 31 శాతానికి పైగా ఉద్యోగాలు లేకుండా ఉన్నారని పాక్ డెవలప్‌మెంట్ ఇకనామిక్స్ ఇనిస్టిట్యూట్ తన 2022 నివేదికలో తెలిపింది. ఏ దేశంలోనైనా జనాభా పెరగడం సహజమేకాని పాక్ లో ఈ పెరుగుదల (సంతానోత్పత్తి రేటు 3.32) రేటు చాలా ఎక్కువ.
అంటే ఆ దేశంలో ఒక స్త్రీ సగటున ముగ్గురు కంటే ఎక్కువ మందికి జన్మనిస్తోంది. కాని, జనసంఖ్య 142 కోట్లు దాటిన ఇండియాలో సంతానోత్పత్తి రేటు (2020) 2.05 మాత్రమే. ఈ లెక్కన పాక్ లో జనాభా నియంత్రణకు ప్రభుత్వ పరంగా జరుగుతున్న ప్రయత్నాలు అంతంత మాత్రమే. ఇండియాలో కుటుంబ నియంత్రణ పద్ధతుల వినియోగం 66.7 శాతం కాగా, పాకిస్తాన్ లో ఇది 34 శాతం మాత్రమే.
భారతదేశంలో జనాభా పెరుగుదల అదుపులో ఉండడానికి కారణాలు గర్భనిరోధకాల వాడకం, ఆడపిల్లలు తగినంతగా చదువుకోవడం. సమస్యలతో సతమతమౌతున్న పాకిస్తాన్ లో పరిస్థితులు చక్కబడాలంటే అక్కడి మహిళలు, బాలికల విద్య, ఆరోగ్యం, చైతన్య స్థాయి పెరిగేలా కృషిచేయాలని, మహిళా సాధికారత ఒక్కటే పాక్ సంక్షోభాన్ని తగ్గించగలదని పాక్ మేధావులు భావిస్తున్నారు.