– ఈఎస్ఆర్ గ్రూప్ ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ భేటీ
ముంబయి: గ్లోబల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టిమెంట్ ప్లాట్ ఫాం ఈఎస్ఆర్ గ్రూప్ ఇండియా ఇన్వెస్టిమెంట్స్ హెడ్ సాదత్ షా, డైరెక్టర్ (లీజింగ్) ప్రకృత్ మెహతాతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముంబయిలోని తాజ్ ల్యాండ్స్ హోటల్ లో భేటీ అయ్యారు. ఈఎస్ఆర్ గ్రూప్ ఆసియా-పసిఫిక్ లో 154 బిలియన్ డాలర్ల ఆస్తులు, భారత్ లో 1.7 బిలియన్ డాలర్ల ఆస్తులతో 2.8 మిలియన్ చదరపు మీటర్ల గ్రాస్ ఫ్లోర్ ఏరియా కలిగి ఉంది.
రియల్ ఎస్టేట్, లాజిస్టిక్స్, డేటా సెంటర్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ, ఇండస్ట్రియల్ పార్కులపై ఈఎస్ఆర్ గ్రూప్ దృష్టిసారిస్తోంది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… విజనరీ సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఇటీవల ఏపీ ప్రభుత్వం ఆమోదించిన ప్లగ్, ప్లే ఇండస్ట్రియల్ పార్క్స్ పాలసీ 4.0 పెట్టుబడులకు అనుకూలంగా ఉంది. విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి మార్గాల్లో 1,000 ఎకరాలకు పైగా మెగా ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేస్తున్నాం. ఏపీఐఐసీతో కలిసి పారిశ్రామిక పార్కుల అభివృద్ధిలో భాగస్వామ్యం వహంచండి.
ఆంధ్రప్రదేశ్ లోని పోర్టుల సమీపంలో 3-5 పెద్ద లాజిస్టిక్స్ పార్కులను అభివృద్ధి చేయబోతున్నాం. విశాఖపట్నం పోర్టు, కాకినాడ పోర్టు వద్ద మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్కులు ఏర్పాటు చేయండి. దేశంలో 70 శాతం రొయ్యలను ఉత్పత్తి చేస్తున్న ఏపీలో కోల్డ్ చైన్ మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు పెట్టండి. ఆంధ్రప్రదేశ్ సముద్ర ఎగుమతుల కోసం కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లు, గిడ్డంగుల నిర్మాణం, పోర్టు ఆధారిత లాజిస్టిక్స్ లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఈఎస్ఆర్ ప్రతినిధులకు మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు.