– రాయలసీమకు నీళ్ళివ్వాలని చంద్రబాబు ఏనాడు ఆలోచించలేదు
– కుప్పం బ్రాంచ్ కెనాల్ పనుల పేరుతో నాడు యథేచ్ఛ దోపిడి
– సీఎం రమేష్‌కు చెందిన కాంట్రాక్ట్ సంస్థకు అడ్డగోలు బిల్లులు
– ఇప్పుడు కూడా కాల్వకు లైనింగ్ పనుల పేరుతో దోపిడికి స్కెచ్
– రూ.161.78 కోట్లకు రిత్విక్ కన్స్ట్రక్షన్స్కే పనులు.. అంతా దోపిడీ
– తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి, పార్టీ గుంటూరుజిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు
తాడేపల్లి: సుగాలి ప్రీతి కేసును పవన్ కళ్యాణ్ రాజకీయంగా వాడుకున్నారు. తాను అధికారంలోకి వస్తే ఈ కేసును విచారించి, దోషులను కఠినంగా శిక్షిస్తానని గొప్పగా ప్రకటించారు. కర్నూలు పబ్లిక్ మీటింగ్‌లో ఊగిపోతూ ఇదే అంశంపై మాట్లాడారు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు.
కేంద్రంలోనూ భాగస్వామిగా ఉన్నారు, ఎందుకు సీబీఐ ఎంక్వయిరీ కోరడం లేదు? సుగాలి ప్రీతి తల్లి రోదనలు చూసి పవన్ కళ్యాణ్ సిగ్గు పడాలి. దీర్ఘకాలం సీఎంగా పని చేసినా కూడా రాయలసీమకు నీళ్ళివ్వాలనే ఆలోచనే ఏనాడు చంద్రబాబు చేయలేదని మాజీ మంత్రి, వైయస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు.
తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. చివరికి చంద్రబాబు ప్రాతినిధ్యం వహించిన కుప్పానికి కూడా సీఎంగా వైయస్ జగన్ కృష్ణా జలాలను అందించారని గుర్తు చేశారు.
2024 ఫిబ్రవరి 26వ తేదీన హంద్రీనీవా నుంచి కుప్పానికి కృష్ణా జలాలను సీఎంగా వైయస్ జగన్ విడుదల చేశారు. ఆ కార్యక్రమంలో జలవనరుల శాఖమంత్రిగా నేను కూడా పాల్గొన్నాను. శ్రీశైలం నుంచి కుప్పంకు 720 కిలోమీటర్ల దూరం. ఆనాడు సీఎంగా వైయస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే పుంగనూరు వరకు హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి నీటిని తీసుకువెళ్ళారు.
ఆ తరువాత చంద్రబాబు పుంగనూరు నుంచి బ్రాంచ్ కెనాల్ ద్వారా కుప్పానికి నీటిని తీసుకువెళతానంటూ కాలువ పనులకు రెట్టింపు అంచనా వ్యయాన్ని పెంచి, తనకు అనుకూలమైన వారికి కాంట్రాక్ట్‌లు ఇచ్చుకున్నారు. కాంట్రాక్టర్ నుంచి కమీషన్లు దండుకున్నారే తప్ప, కుప్పానికి నీటిని మాత్రం తీసుకువెళ్ళలేకపోయారు.
వైయస్ జగన్ సీఎం అయిన తరువాత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి నీటిని అందించేందుకు పుంగనూరు నుంచి కుప్పానికి బ్రాంచ్ కెనాల్ పనులను శరవేగంగా పనులు చేయించి, నీటిని కూడా విడుదల చేశారు, ఇదీ వాస్తవం.
విభజిత ఆంధ్రప్రదేశ్‌లో నాటి సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఇదే కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్ కంపెనీకే ఇచ్చింది. 2016, జనవరి 4న మొదలుపెట్టి, అదే ఏడాది అక్టోబర్ 3 నాటికి పూర్తి చేయాలనేది కాంట్రాక్ట్ ఒప్పందం. అయితే ఆ గడువుకు పనులు చేయకపోవడంపై చర్యలు తీసుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం.. సీఎం రమేష్ సంస్థకు అనుకూలంగా 2016, అక్టోబర్ 4 నుంచి 2019, ఏప్రిల్ 30 వరకు ఐదుసార్లు గడువు పెంచింది. అయినా పనులు పూర్తి చేయలేదు.
మరోవైపు దోపిడికి పథకం వేసిన రిత్విక్ సంస్థ, కాలువ తవ్వడం కాకుండా, డిజైన్ మార్చి ఎంబాక్‌మెంట్ (మట్టి కట్టలతో గట్టు) ద్వారా పనులు చేయడం వల్ల అధికంగా మట్టి పనులు చేశామని రూ.160కోట్లు అదనంగా చెల్లించమని కోరారు. ఆ మేరకు అధికారులు ప్రతిపాదనలు పంపగా, స్టేట్‌లెవల్ స్టాండింగ్ కమిటీ తిరస్కరించింది.
అయినా టీడీపీ ప్రభుత్వం ఆ సంస్థకు అడ్డంగా రూ.144.7 కోట్లు దోచి పెట్టింది. అందుకోసం ప్రత్యేకంగా జీఓ నెం:32 తీసుకొచ్చింది. దీనితో కుప్పం బ్రాంచ్ కాలువ వ్యయం రూ.574.96 కోట్లకు చేరింది. 2024లో అధికారంలోకి రావడంతో, కుప్పం బ్రాంచ్ కెనాల్ పనుల పేరుతో మళ్లీ దోపిడికి సీఎం చంద్రబాబు తెర తీశారు. కెనాల్ లైనింగ్ పేరుతో పనులను రూ.161.78 కోట్లకు అదే సీఎం రమేష్ రిత్విక్ సంస్థకు కట్టబెట్టారు. ఇక లైనింగ్ పనులను షార్ట్ క్రీటింగ్ పద్దతిలో కాకుండా స్టీల్ ఫైబర్ రీయిన్‌ఫోర్స్‌డ్ కాంక్రీట్‌తో అత్యంత నాసిరకంగా చేసి, యథేచ్ఛ దోపిడి చేశారు.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 72 శాతం పోలవరం ప్రాజెక్ట్ పనులు పూర్తయ్యాయని మంత్రి రామానాయుడు అంటున్నారు. మిగిలిన 28 శాతంలో వైయస్ఆర్సీపీ ప్రభుత్వం కేవలం 2 శాతమే పూర్తి చేసిందని ఆయన చెబుతున్నారు. ఆయన లెక్కల ప్రకారం చూసినా, మిగిలి 26 శాతం పనులను పూర్తి చేయడానికి ఏడాదిన్నర సమయం కూడా సరిపోలేదా? రుషికొండ రిసార్ట్స్‌కు కూటమి నేతలు క్యూ కడుతున్నారు. ఆ నిర్మాణంలో పై నుంచి పెచ్చులు ఊడిపోయాయంటూ యాగీ చేస్తున్నారు. ఇదేమైన నాసిరకంగా నిర్మించిన అమరావతి తాత్కాలిక సెక్రటేరియట్టా?