– అటవీ సిబ్బందిపై దాడి చేసిన ఎమ్మెల్యేను ఎందుకు అరెస్ట్ చేయలేదు?
– కూటమి పాలనలో పోలీసులకు కనీస గౌరవం లేదు
– ఎమ్మెల్యే ‘బుడ్డా’ పై చర్యలు తీసుకునేందుకు భయపడుతున్న సర్కార్
– అటవీ సిబ్బందిపై దాడిలో పాల్గొన్న జనసేన నేతపై హత్యాయత్నం కేసు పెట్టాలి
– పోలీసుల్ని దుర్భాషలాడిన స్పీకర్ అయ్యన్నపైనా కేసు నమోదు చేయాలి
– తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్
తాడేపల్లి: కూటమి పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు, పోలీసులకు కనీస గౌరవమే కాదు, రక్షణ కూడా లేదని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… నాడు వైయస్సార్సీపీ హయాంలో గర్జించే పులిలా ఉన్న పోలీసులు.. నేడు చంద్రబాబు పాలనలో కోరలు పీకేసిన పాములుగా వారిని మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమాజంలో శాంతి భద్రతలను పరిరక్షించే పోలీస్ వ్యవస్థతో ఆడుకుంటున్నారని ధ్వజమెత్తారు. డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న అటవీ సిబ్బందిపై దాడి చేసిన టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై చర్య తీసుకునే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. తన శాఖ సిబ్బందికే రక్షణ కల్పించలేని పవన్ కళ్యాణ్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
టీడీపీ శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, స్థానిక జనసేన నాయకుడితో కలిసి అటవీ అధికారులను జీపులో తిప్పుతూ రాత్రంతా వేధించి హింసించాడు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనలో నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందిపోయి అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఒక చిన్న ట్వీట్‌తో సరిపెట్టాడు.
అటవీ అధికారులు నేరుగా వచ్చి పవన్ కళ్యాణ్‌ని కలిసి తమ వేదనను చెప్పుకున్నా ఆయనలో చలనం లేదు. ఆ ఘటన గురించి అటవీశాఖ అధికారులు పవన్ కళ్యాణ్ తో చెబుతుంటే కనీసం తలెత్తి చూసే స్థితిలో కూడా ఆయన లేడు. ప్రెస్ మీట్ పెట్టి నిందితులను కఠినంగా శిక్షిస్తామని చెప్పే ధైర్యం కూడా పవన్ కళ్యాణ్‌కి లేదు.
ప్రభుత్వంలో కీలకమైన స్పీకర్ స్థానంలో ఉన్న చింతకాయల అయ్యన్నపాత్రుడు సభ్యత, సంస్కారం మరిచి పోలీసులను అందరి ముందూ బహిరంగంగా తిట్టి తన సంస్కారహీనతని ప్రదర్శించుకున్నారు.
అధికార మదంతో పోలీసుల్ని నోటికొచ్చినట్టు తిట్టి వేధించాడు. పోలీసులను అంత దారుణంగా దుర్భాషలాడిన అయ్యన్నపై కేసు నమోదు చేయలేదు. శ్రీశైలం ఘటనలో కేసు నమోదు చేసిన ఎమ్మల్యే బుడ్డా, జనసేన నాయకులను అరెస్ట్ చేయలేదు. తూతూమంత్రంగా ఎఫ్ఐఆర్ కట్టి చిన్న కేసు పెట్టి మూలన పడేశారు. బుడ్డాపై కిడ్నాప్, హత్యాయత్నం, విధులకు ఆటంకం కలిగించిన సెక్షన్ల కింద కేసులు పెట్టాలి. అటవీ శాఖ అధికారులను కొట్టిన నిందితులపై చర్యలు తీసుకుంటామని తక్షణమే ప్రెస్‌మీట్ పెట్టి ఆ శాఖ మంత్రి పవన్ స్పష్టమైన ప్రకటన చేయాలి. వారిని అరెస్ట్ చేయించాలి.
ప్రతిభావంతులైన పోలీసులను వీఆర్లకు పంపుతున్నారు. కొంతమందికి పోస్టింగ్ ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తున్నారు. ఇంకొంతమందిని సస్పెండ్ చేస్తున్నారు. మరికొంతమందిని దుర్మార్గంగా జైళ్లకు కూడా పంపుతున్నారు. ఈ బాధలన్నీ పడలేక ఐపీఎస్‌లే రాష్ట్రం వదిలి బదిలీపై వెళ్లిపోతున్నారు. కొందరైతే ఈ ప్రభుత్వం పెట్టే టార్చర్ తట్టుకోలేక ఏకంగా రాజీనామా ఇచ్చేసి వెళ్లిపోతున్నారు. ప్రభుత్వానికి ఇంతకన్నా సిగ్గుతక్కువ పని ఇంకోటి ఉంటుందా?
వేటాడే పులుల్లా ఉండాల్సిన పోలీసుల్ని చంద్రబాబు కోరలు పీకేసిన పాములుగా మార్చేసి ఆడిస్తున్నాడు. పోలీసులకు నాలుగు సరెండర్లు, ఐదు అడిషనల్ సరెండర్లతో పాటు, టీఏ, డీఏలు పెండింగ్‌లో పెట్టి వేధిస్తున్నారు. పోలీస్ వ్యవస్థ సక్రమంగా పనిచేసినప్పుడే రాష్ట్రంలో శాంతిభద్రతలు సరైన మార్గంలో ఉంటాయని ఈ ప్రభుత్వం తెలుసుకోవాలి. పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసే చర్యలు రాష్ట్రానికి ప్రమాదకరం.
గతంలో పోలీసులపై ఏదైనా దాడులు చేసినప్పుడో, లేదా వారిని అవమానిస్తే పోలీస్ యూనియన్ తక్షణమే స్పందించేది. కానీ కూటమి ఎమ్మెల్యేలు ఏకంగా దాడులు చేసి కొడుతున్నా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం ఆందోళన కలిగిస్తోంది. ఇలా మిన్నకుండిపోతుంటే కూటమి నాయకుల ఆగడాలు మరింత పెచ్చుమీరే ప్రమాదం ఉందని పోలీసులు గుర్తించాలి.