జన సైనికుల క్షేమం కోసం పవన్ కళ్యాణ్ తపిస్తారు

జనసేన పార్టీ కోసం నిస్వార్థంగా పని చేస్తున్న జనసైనికుల క్షేమాల కోసం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తపిస్తున్నారని పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చెప్పారు. పార్టీ క్రియాశీలక సభ్యత్వం ఉన్న కార్యకర్తలకు ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే బీమా అందేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం నూతలపాడు గ్రామానికి చెందిన జనసేన క్రియాశీలక సభ్యుడు గ్రంథి వెంకటరాయుడు ఇటీవల ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన కుటుంబాన్ని జనసేన పార్టీ పి.ఏ.సి. ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు పరామర్శించారు. వెంకటరాయుడు చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తల్లి గ్రంథి లక్ష్మీ, తండ్రి రాంబాబు, సోదరుడు రాజశేఖర్ ఇతర కుటుంబ సభ్యులను మనోహర్ గారు ఓదార్చి ధైర్యం చెప్పారు. పార్టీ తరపున రూ. 5 లక్షల బీమా చెక్కును అందజేశారు. అనంతరం నూతలపాడులో ఏర్పాటు చేసిన పార్టీ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు పర్చూరు సెంటర్ కు చేరుకున్న మనోహర్ గారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహానికి, వంగవీటి రంగా గారి విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.విజయ్ కుమార్, ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, జిల్లా నాయకులు డా. పాకనాటి గౌతం రాజ్, బెల్లంకొండ సాయిబాబు, చిట్టెం ప్రసాద్, కంచర్ల శ్రీకృష్ణ, ఆళ్ల అనిల్, చీకటి వంశీ తదితరులు పాల్గొన్నారు.
పూల వర్షంతో ఘన స్వాగతం
గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మూడు రోజుల పర్యటన నిమిత్తం విచ్చేసిన నాదెండ్ల మనోహర్ కి ఘనస్వాగతం లభించింది. ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందిన జనసేన కార్యకర్త కుటుంబాన్ని ఓదార్చి, పరిహారం అందించేందుకు హైదరాబాద్ నుంచి పర్చూరు బయలుదేరిన నాదెండ్ల మనోహర్ కి గుంటూరు జిల్లా నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు ఘన స్వాగతం పలికారు. నాగార్జున సాగర్ చెక్ పోస్టు దగ్గర నుంచీ ఆయనకు పెద్ద సంఖ్యలో జనసేన శ్రేణులు పూలవర్షంతో ఆహ్వానించాయి. పార్టీ శ్రేణుల నినాదాలు, భారీ ర్యాలీ నడుమ ఆయన కొత్తపల్లి చేరుకున్నారు. అక్కడ సమావేశం అనంతరం పర్చూరు బయలుదేరిన మనోహర్ కి మాచర్ల, నర్సరావుపేట, చిలకలూరిపేట, పర్చూరులో జనసేన శ్రేణులు డప్పు వాద్యాలు, బాణాసంచా కాల్చి ఆహ్వానం పలికాయి. పదుల సంఖ్యలో కార్లు, వందల సంఖ్యలో యువకులు బైకులతో ర్యాలీగా మనోహర్ గారిని అనుసరించారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస యాదవ్, జిల్లా పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు జిలానీ, బేతపూడి విజయ శేఖర్, రావి రమ, పాకనాటి రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply