Suryaa.co.in

Andhra Pradesh

పవన్‌కళ్యాణ్‌ ఆరోపణలు అవాస్తవాలు

– విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో దాదాపు రూ.4-5వేల కోట్లు విలువైన 8వేల టన్నుల పట్టుబడ్డ ఎర్రచందనం
– పవన్‌కళ్యాణ్‌ తన పలుకుబడిని ఉపయోగించి దీన్ని రాష్ట్రానికి రప్పించడంపై దృష్టిపెట్టాలి
– పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డిపై పవన్‌కళ్యాణ్‌ చేస్తున్న ఆరోపణల ప్రకారం…. 2010 నుంచి జరిగిన అక్రమ రవాణాకు చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డిలు ఇద్దరూ భాగస్వాములని అనవచ్చా?
– వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్

తాడేపల్లి: 2010 నుంచి 2020 మధ్య కాలంలో ఎర్ర చందనం చైనాకు వయా నేపాల్‌ నుంచి అక్రమంగా రవాణా జరుగుతుందని, ఇందులో భాగంగా 173 టన్నుల ఎర్ర చందనం పట్టుకున్నామని నేపాల్‌ ప్రభుత్వం ప్రకటించిందని నాగార్జున యాదవ్‌ చెప్పారు. అక్రమ రవాణా ద్వారా చైనాకు వెళుతున్న ఎర్ర చందనం దుంగల్ని తిరిగి భారతదేశానికి ఇచ్చేస్తున్నట్లు నేపాల్‌ మంత్రి గోకుల్‌ ప్రసాద్‌ బస్కోట ప్రకటన చేసిన విషయం, దానికి సంబంధించిన పత్రికా కథనాలు ఆయన మీడియాకు చూపారు.

పవన్‌ కళ్యాణ్‌ ఆరోపించినట్లు ఎర్రచందనం దుంగలు దొరికింది 2020 జనవరిలో అంటే జగన్‌ ప్రభుత్వం వచ్చిన కొత్తలో అని నాగార్జున అన్నారు. అంతకుముందు పదేళ్ళుగా జరిగిన క్రమంలో ఆ దుంగలు దొరికాయని నేపాల్‌ ప్రభుత్వం స్పష్టం చేసిందని, కానీ ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ ఏదో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌ రెడ్డి అక్రమ రవాణా చేస్తూ దొరికినట్లు అసత్య ప్రచారం, అభూత కల్పనలు చేస్తున్నారని మండిపడ్డారు.

కానీ నేపాల్‌ ప్రభుత్వం దుంగలపై మన కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చిన తర్వాత జగన్‌ సీఎంగా ఉన్న సమయంలో కేంద్రానికి లేఖ రాసిన విషయం గుర్తుచేశారు. ఒక్క నేపాల్‌లోనే కాదు, దుబాయ్, శ్రీలంక, మలేషియా, పక్క రాష్ట్రాలు తమిళనాడు, ఒడిశా, కర్ణాటకలలో కూడా ఏపీ నుంచి అక్రమంగా తరలిస్తున్న ఎర్ర చందనం ఉంది.

దయచేసి సుమారుగా 8 వేల టన్నుల ఎర్ర చందనం అక్రమంగా రవాణా జరిగింది, ఇదంతా వివిధ రాష్ట్రాలలో, దేశాల్లో ఉంది కాబట్టి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి దీనిపై దృష్టిపెట్టి ఈ 8 వేల టన్నులు ఏపీకి రావాలని, దీని ద్వారా సుమారు నాలుగైదు వేల కోట్లు విలువ చేసే ఎర్ర చందనం ఏపీకి రావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం లేఖలు రాసిందన్నారు.

పవన్‌ కళ్యాణ్‌ తన శాఖలపై దృష్టిపెట్టాలని, అటవీ శాఖ ఆయన ఆధ్వర్యంలో ఉందని, ఏపీ ప్రభుత్వం కేంద్రంతో చేసిన ఉత్తర ప్రత్యుత్తరాలు ఆయన మంత్రిత్వ శాఖలలోనే ఉన్నాయన్నారు. ఫైల్స్‌ చదువుకోవచ్చని, ఈ లేఖలు మీరు పట్టించుకోకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం ద్వారా పవన్‌కళ్యాణ్‌ నైతికతకు భంగం వాటిల్లుతుందనే విషయాన్ని గుర్తించాలని నాగార్జున అన్నారు.

నేపాల్‌లో పట్టుబడిన 173 టన్నుల ఎర్రచందనం తిరిగి తీసుకురావడానికి అధికారుల బృందం అక్కడికి వెళ్ళి చెక్‌ చేసి , వారి దగ్గర నుంచి ఏపీకి తీసుకురావడానికి నేపాల్‌ ప్రభుత్వం దగ్గర రెండు నెలల క్రితమే మే నెలలో అనుమతులు తీసుకున్న విషయాన్ని తెలిపారు. నేపాల్‌ ప్రభుత్వం కూడా అనుమతులు మంజూరు చేసిందని, ఆ అనుమతులు మంజూరు చేసిన విషయం ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా ప్రముఖంగా వచ్చిందన్న విషయాన్ని పవన్‌ కళ్యాణ్‌ గారు గమనించాలని నాగార్జున అన్నారు.

నేపాల్‌ ప్రభుత్వం కానీ ఇతర ప్రభుత్వాలు 2010 నుంచి 2020 వరకూ ఎర్ర చందనం అక్రమ రవాణా జరిగిందని అప్పుడు సీఎంగా ఉన్నది పవన్‌ కళ్యాణ్‌కు అత్యంత ఇష్టులైన నారా చంద్రబాబు నాయుడు, మరొకరు కిరణ్‌కుమార్‌ రెడ్డి నని నాగార్జున చెప్పారు. నిజంగా ఎర్ర చందనం అక్రమ రావాణా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి- మిథున్‌రెడ్డి చేసి ఉంటే.. చిత్తూరు జిల్లాలో ఉన్న చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి, గల్లా అరుణకుమారి, ఇటీవల చనిపోయిన వ్యక్తి గాలి ముద్దుకృష్ణమనాయుడు వీరు కూడా పవన్‌కళ్యాణ్‌ సూత్రం ప్రకారం చేసిఉంటారని అనుకోవచ్చా? అన్నారు.

పవన్‌కళ్యాణ్‌ మీరు రాష్ట్రంలో చాలా పవర్‌ఫుల్‌ అని చెప్పుకుంటున్నారు, కేంద్రంలో నరేంద్రమోదీ కి, అమిత్‌షా కి దగ్గర అని చెప్పుకుంటున్నారు, వేర్వేరు దేశాల్లో, రాష్ట్రాలలో ఉన్న ఎర్రచందనం విలువ సుమారు రూ. నాలుగైదు వేల కోట్లు ఉంటుంది, ఇది తిరిగి తీసుకురండి, దానిని వేలం ద్వారానో లేక ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా అమ్మడమో ఏదో ఒకటి చేసి వచ్చిన డబ్బు ఏపీ అభివృద్దికి వినియోగించుకోవాలని సూచించారు.

అంతేకానీ పెద్దిరెడ్డి ని, మిధున్‌రెడ్డి ని డీఫేమ్‌ చేయాలని తద్వారా జగన్‌ ని డీఫేమ్‌ చేయాలన్న ప్రయత్నం మీరు చేస్తే సూర్యుడిపై ఉమ్ము వేసే ప్రయత్నం లాంటిదేనన్నారు. ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడాలి, ప్రజాజీవితంలో రీటేక్‌కు అవకాశం ఉండదన్నారు. మేం సాక్ష్యాదారాలతో మీకు చెప్పాం. కాబట్టి మీరు అసత్యాలు, అభూతకల్పనలు చేయకుండా పరిపాలనపై దృష్టిపెట్టాలని డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ ని కోరుకుంటున్నామని నాగార్జున చెప్పారు.

LEAVE A RESPONSE