గిరిజన సంక్షేమశాఖ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పీడిక రాజన్నదొర

• గిరిజన ప్రాంతాల్లో రహదార్లు,విద్యా,వైద్యం,తాగునీటికి అత్యంత ప్రాధాన్యత
• చెంచు,కోయ,సవర గిరిజన తెగల అభ్యున్నతికి ప్రత్యేక ప్రణాళికలు
• గిరిజన సహకార సంస్థలో కారుణ్య నియామకాలు,గిరిజన ప్రాంతాల్లో దేశీయ కోళ్ళ
పెంపకం,ఐదుగురు డిప్యూటీ డైరెక్టర్లకు జెడిలుగా పదోన్నతి దస్త్రాలపై తొలి సంతకం

అమరావతి,21 ఏప్రిల్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పీడిక రాజన్నదొర.అమరావతి సచివాలయం మూడవ బ్లాకులో గురువారం వేద పండితుల ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం ఆయన గిరిజన సంక్షేమశాఖ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

అనంతరం మూడు దస్త్రాలపై ఆయన తొలి సంతకం చేశారు,అవి గిరిజన సహకార సంస్థలో కారుణ్య నియామకాలకు సంబంధించి,గిరిజన సంక్షేమ శాఖలో 5 గురు డిప్యూటీ డైరెక్టర్లకు సంయుక్త సంచాలకులుగా పదోన్నతులు కల్పించడం, గిరిజన ప్రాంతాల్లో దేశీయ కోళ్ళ పెంపకానికి సంబంధించిన దస్త్రాలపై ఆయన తొలి సంతకం చేశారు.

ఈసందర్భంగా ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర మీడియాతో మాట్లాడుతూ కొండకోనల్లో మారుమూల ప్రాంతాల్లో నివశించే నాలాంటి వ్యక్తికి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డికి తన కుటుంబం తరుపున యావత్తు గిరిజన ప్రజలందరి తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు.

గ్రామ,వార్డు సచివాలయాలు,వాలంటీర్ వ్యవస్థ ద్వారా దేశం గర్వించే రీతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి మనుషుల్లో దేవునిగా పేదల పెన్నిదిగా పరిపాలన సాగిస్తున్నారని రాజన్న దొర కొనియాడారు.ముఖ్యంగా గిరిజన ప్రజల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించి నవరత్నాలు సహ ప్రతి పధకం గిరిజనులకు సక్రమంగా అందేలా కృషి చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ కింద పట్టాలు ఇచ్చి అక్కడ గిరిజనులు అనేక రకాల పంటలు పండించుకునేందుకు అవకాశం కల్పించడంతో నేడు గిరిజనులు అన్నివిధాలా ప్రగతి పధంలోకి వస్తున్నారని తెలిపారు.

గిరిజన ప్రాంతాల్లో రహదారులు,విద్య,వైద్యం,తాగునీటి కల్పనకు అధిక ప్రాధాన్యత
గిరిజన ప్రాంతాల్లో రహదారులు,విద్య,వైద్యం తాగునీరు వంటి కనీస సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర స్పష్టం చేశారు.తన నియోజకవర్గంలో 11 ప్రధాన రహదారులు మంజూరు అయ్యాయని అటవీ క్లియరెన్సులు రావాల్సి ఉందని చెప్పారు.అలాగే 100 పడకల ఆసుపత్రి నిర్మాణంలో ఉందని, గిరిజన ప్రాంతాల్లో ఏరియా ఆసుపత్రి వంటి పలు ఆసుపత్రుల సేవలు అందుబాటులోకి వస్తున్నాయని అన్నారు.

గిరిజన ప్రాంతాల్లోని ప్రజలందరికీ సురక్షితమైన తాగునీటిని అందించేందుకు ప్రయత్నం జరుగుతోందని ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లోని మారుమూల ప్రాంతాల్లో సహితం విద్యాపరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడంతో నేడు గిరిజనుల పిల్లలంతా పాఠశాలలకు వెళుతున్నారని ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర పేర్కొన్నారు.

చెంచులు,కోయలు,సవర గిరిజన తెగల అభ్యున్నతికి ప్రత్యేక ప్రణాళికలు
రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లోని 60 మండలాల్లో 9 సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థలు (ఐటిడిఏ)ఉండగా సుమారు 28 లక్షల మంది గిరిజన జనాభా ఉన్నారని ప్రస్తుత లెక్కల ప్రకారం ఆసంఖ్య 30 లక్షలుగా ఉంటుందని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ఉప ముఖ్యమంత్రి పి.రాజన్నదొర చెప్పారు.ముఖ్యంగా గిరిజన తెగల్లోని చెంచులు,కోయ,సవరలపై ప్రత్యేక దృష్టిపెట్టి వారి సంక్షేమానికి ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేసి అమలు చేయనున్నట్టు ఆయన చెప్పారు.

ఇప్పటికే గిరిజన పక్షపాతిగా సియం జగన్మోహన్ రెడ్డి గిరిజనుల సంక్షేమానికి అనేక పధకాలు అమలు చేస్తున్నారని రాజన్నదొర పేర్కొన్నారు.ఆర్ఓఎఫ్ఆర్ కింద ఇచ్చిన పట్టా భూముల్లో నేడు అనేక రకాల చిరుధాన్యాల పంటలు పండిస్తూ గిరిజనులు జీవనం సాగిస్తున్నారని అన్నారు.వీటిని మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని చెప్పారు.గిరిజనుల సంక్షేమానికి కేంద్రం నుండి రావాల్సి నిధులను సకాలంలో తీసుకువచ్చేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు పాల్గొని ఉప ముఖ్యమంత్రి రాజన్న దొరకు పుష్ప గుచ్చాన్ని అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.గిరిజన సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి కాంతిలాల్ దండే,గిరిజన సంక్షేమశాఖ సంచాలకులు,గంధం చంద్రుడు,ఎంఎల్ఏలు జోగారావు,అదీప్ రాజు,కళావతి,అప్పల నాయుడు తదితర ప్రజా ప్రతినిధులు,పలువురు అధికారులు ఉప ముఖ్యమంత్రి రాజన్నదొరకు పుష్ప గుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply