– బెజవాడ రౌడీలు గో బ్యాక్ అంటూ నినాదాలు
– టీడీపీ కార్యాలయం వైపు దూసుకెళ్ళిన జనం
– పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత
– టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ సభ్యుల అరెస్ట్
– ఫలించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహం
గుడివాడ, జనవరి 21: తెలుగుదేశం పార్టీ నిజ నిర్ధారణ కమిటీ పర్యటన నేపథ్యంలో గుడివాడ నియోజకవర్గంలో శాంతి కోరుతూ నియోజకవర్గ ప్రజలు అన్ని వైపుల నుండి ర్యాలీలను నిర్వహించారు. మెయిన్ రోడ్డులోని టీడీపీ కార్యాలయానికి చేరుకున్న కమిటీ సభ్యులకు పెద్దఎత్తున నిరసన తెలిపారు. ఒక దశలో టీడీపీ కార్యాలయం వైపు దూసుకు రావడంతో పోలీసులు రెండు వైపులా బారిగేట్లను ఏర్పాటు చేసి అడ్డుకోవడం జరిగింది. మరోవైపు వైసీపీ శ్రేణులు కూడా అడ్డుకున్న పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ప్రజల ఆగ్రహాన్ని దృష్టిలో పెట్టుకుని టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. గుడివాడ పట్టణం లింగవరం రోడ్డులోని మంత్రి కొడాలి నానికి చెందిన కే. కన్వెన్షన్లో ఈ నెల 11 వ తేదీ నుండి 15 వ తేదీ వరకు జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్లబండ లాగుడు ప్రదర్శన పోటీలను నిర్వహించడం జరిగింది. రాష్ట్ర నలుమూలల నుండి దాదాపు లక్ష మందికి పైగా పశు పోషకులు, రైతులు, ప్రజలు విచ్చేసి ఈ ప్రదర్శన పోటీలను వీక్షించారు.
అయితే ఇక్కడ క్యాసినో వంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగాయంటూ ఇటీవల టీడీపీ నాయకులు జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ మేరకు జిల్లా ఎస్పీ విచారణకు ఆదేశిస్తూ, నూజివీడు డీఎస్పీని విచారణ అధికారిగా నియమించడం జరిగింది. ఫిర్యాదు చేయడంతో పాటు టీడీపీ నిజ నిర్ధారణ కమిటీని నియమించింది. సభ్యులుగా నక్కా ఆనంద్ బాబు, వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, బొండా ఉమా,
ఆలపాటి, తంగిరాల సౌమ్యలను నియమించింది. వీరు క్యాసినో నిర్వహించిన ప్రదేశాన్ని పరిశీలించి పూర్తిస్థాయి నివేదకను అధిష్టానానికి ఇచ్చేందుకు ఎన్టీఆర్ భవన్ నుండి బయటుదేరారు. టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ పర్యటన నేపథ్యంలో వైసీపీ శ్రేణులు కే కన్వెన్షన్ కు భారీగా చేరుకున్నాయి. వైసీపీ శ్రేణులకు నియోజకవర్గ నలుమూలల నుండి స్వచ్చంధంగా వచ్చిన ప్రజలు మద్దతుగా నిలిచారు. వీరంతా కే. కన్వెన్షన్ నుండి ర్యాలీగా బయలుదేరి నాగవరప్పాడు సెంటర్ కు చేరుకున్నారు. అక్కడ పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో కొద్దిసేపు రోడ్డుపైనే బైఠాయించారు.
బెజవాడ రౌడీలు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అక్కడి నుండి భారీ ర్యాలీగా మెయిన్ రోడ్డుకు చేరుకున్నారు. అదే రోడ్డులో ఒకవైపు టీడీపీ కార్యాలయం కూడా ఉంది. టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారన్న సమాచారంతో ఒక్కసారిగా అక్కడున్న వారంతా టీడీపీ కార్యాలయం వైపు పరుగులు పెట్టారు. పోలీసులు టీడీపీ కార్యాలయానికి రెండు వైపులా బారిగేట్లను
ఏర్పాటు చేసి అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొద్దిసేపటికి పోలీసులు టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడి నుండి ప్రజలతో కలిసి వైసీపీ శ్రేణులు ర్యాలీగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాయి. తిరిగి అక్కడి నుండి మెయిన్ రోడ్డు వైపు బయలుదేరారు. టీడీపీ కార్యాలయం మీదుగా వెళ్ళేందుకు పోలీసులు అనుమతించలేదు. దీంతో ఏలూర్ రోడ్డు మీదుగా వైసీపీ శ్రేణులు కే. కన్వెన్షన్ కు చేరుకున్నాయి. ఎట్టకేలకు టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులను గుడివాడలో పర్యటించనీయకుండా ప్రజలు కూడా తిరగబడడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రచించిన వ్యూహం ఫలించినట్టయింది.