జనుల జీవన విధానం- కర్మ ఫలితాలు

పార్వతీ దేవి : ప్రభూ! జగములోని జనుల జీవన విధానా లెట్టివో వివరింపుము.
శివుడు : దేవీ! మానవ లోకం కర్మభూమి. దేవత్వం సుఖాలకూ, పశు పక్ష్యాదులుగా జన్మించుటకు, దుఖాలనుభవించడానికి కారణ మౌతున్నాయి. మానవులు సుఖాలు అనుభవించ వలెనన్నా, కోరికలు తీర్చుకోవలెనన్నా, ధనం అవసరమౌతుంది. ఏ పని చేయాలన్నా ధనమే మూలం కాబట్టి పెట్టుబడితో వచ్చే లాభం, అందుకు అయ్యే వ్యయం తెలియడం శుభాన్ని కలిగిస్తాయి. పశు పోషకుడు విసుగు విరామ మెరుగక వాటి కష్టాలు గమనిస్తూ వుండే వాడు ధనంతో పాటు కీర్తిని కూడా గడిస్తాడు.”
‘వంచనయును జాడ్యంబును నించుకయును లేక ప్రభువు నిష్ఠ మెఱిఁగి తాఁ
బంచిన పని వెరపునఁ గావించిన కర్మకరుఁ డొందు విపుల ధనంబుల్'”
“శాంకరీ! మోసం, సోమరితనము, లేకుండా యజమానుడి పనిని అతడి ఇష్ట ప్రకారం నెరవేర్చే సేవకుడు విస్తారమైన ధనం పొందుతాడు. పరధనాన్ని, పరసతిని కోరకుండా దేవతలను, పితృదేవతలను ఆరాధించడం, దయకలిగి వుండడం, అతిథి సేవ చేయడం అందరూ ఆచరించ వలసిన ధర్మాల’ని విశద పరచి కులకర్మ(ధర్మా)లను కూడా తేట తెల్లం చేశాడు.”

“దాక్షాయణీ! ఆయా కులాలకు విధింపబడిన కర్మలను శ్రద్ధతో చేసే వారు స్వర్గలోకంలో సుఖ మనుభవిస్తారు. వారు చేసిన పుణ్యం అంతరించగానే తిరిగి భూలోకాన మునుపటి కులాలలోనే జన్మించి అభివృద్ధి సాధిస్తారు. కుల ధర్మాలను వదలిన వారు యే యే కర్మలు చేస్తారో వారి కర్మలను బట్టి ఆయా కులాలో జన్మిస్తారు. ఎవడు ఎంత పుణ్యం చేస్తాడో వాడికి ఆపాటి ఉత్తమ కులం లభిస్తుంది. అధిక పుణ్య ఫలంగా బ్రాహ్మణ జాతిలో జన్మిస్తే వాడికి నిత్యానందమయమైన ఉత్తమలోక ప్రాప్తి కలుగుతుంది. (చేసుకొన్న వాడికి చేసుకొన్నంత).”

“దేవీ! దేవతల అంశలో జన్మించిన వాడు ఆపదల యందు చలించడు. సంపదల యందు గర్వించడు. పరాక్రమంతో పాపులను (శత్రువులను) జయిస్తాడు. బంధు జనులపట్ల, పెద్దలపట్ల ఋజు వర్తనముతో మెలుగుతాడు. దీనుల యందు దయకలిగి ప్రవర్తిస్తాడు. కోపతాలకు తావివ్వకుండా మెలుగుతాడు.”
“పరమేశ్వరి : హృదయేశ్వరా! భూమిపై కొంత మంది సిరిసంపదలతో తులతూగుతూ సుఖాలనుభవిస్తారు. మరికొందరు పేదరికంతో కృంగిపోయి దుఃఖిస్తూ వుంటారు. ఇందుకు కారణమేమిటి?”

“హరుడు : గౌరీ! గత జన్మలో భూతములకు బలి సమర్పణ చెయ్యడానికి, యాచకులకు భిక్ష వెయ్యడానికి, ఏమీలేక బాధ పడుతున్న తన మిత్రులను,చుట్టాలను రమ్మని చేరదీసి వారి పేదరికాన్ని తొలిగించి పుణ్య ప్రవర్తనతో మెలగిన మానవుడికి బ్రహ్మదేవుడు అధికంగా సిరి సంపదలిచ్చి కాపాడుతాడు. అలా కాకుండా గతంలో దయా విహీనుడై పరమ లుబ్ధుడై, జీవితం గడిపిన వాడిని ఈ జన్మలో కష్టాల పాల్జేసి దుఃఖాలు కలిగిస్తాడు ఆ బ్రహ్మ. బ్రహ్మదేవుడికి ఏ జీవి పట్ల కోపంగానీ, ప్రేమగానీ వుండవు, కానీ ఆయా జనులు పూర్వజన్మలో చేసుకొన్న కర్మఫలం అనుభవించ వలసిన వేళ రాగానే వారి అనుభవానికి వస్తుంది. ఇంతకూ మించి వేరే కారణమంటూ ఏమీ లేదు.”

“దేవీ! పూర్వ జన్మలో ఇరుగు పొరుగు వారు పలుమార్లు చెప్పడం వలన వారి మాటలను కాదనలేక ఉపకారం చేస్తూ బ్రతికిన వారు ఇప్పుడు సంపద కలిగి యున్నప్పటికీ రుచికరమైన భోజనము తినక, మంచి వస్త్రాలు కట్టక నీచంగా జీవిస్తారు. ఇప్పుడు తమవద్ద ధనం లేకపోయినప్పటికీ ఇతరుల సహాయ సహకారాలతో సుఖాలు అనుభవిస్తున్న జనులు వెనుకటి జన్మలో తాము పేదవారై నప్పటికీ తమ మనస్సులలో పేదసాదలకు పెట్టి పోయాలన్న తలంపు కలిగిన వారే సుమా!”

“ఈశ్వరీ! ఎక్కువ శ్రమ పడకుండా ధనం ఎవరికీ లభిస్తుందో, అట్టి వారు తొల్లిటి జన్మలో యోగ్యులైన వారిని తమంతట తామే రండని ఆహ్వానించి దానం చేసిన దయా హృదయులే. ఇప్పుడు ఎక్కువ ప్రయాసతో ధనం సంపాదించు వారు పూర్వజన్మలో వారి వాద్దకు ఎవరైనా యాచనకు వచ్చినప్పుడు మళ్ళీ మళ్ళీ రమ్మని త్రిప్పు కోకుండా దాన మిచ్చిన వారే. ఇప్పుడు ఏమాత్రం సంపాదన లేక యాతన చెందు తున్నవారు గతజన్మలో యాచకుల్ని పలుమార్లు త్రిప్పుకొని కూడా ఏమీ ఇవ్వకుండా పంపిన లోభులే. వార్ధక్యంలో కుబేరులైన వారు గత జన్మలో వయసులో వున్నప్పుడు ఎవ్వరికీ ఏమీ దానం చేయకుండా వార్ధక్యంలో మాత్రమే దానం చేసిన వారే.”

“గిరికుమారీ! పూర్వజన్మలో రోగగ్రస్తులై చనిపోయే ముందు దానం చేసిన వారు ఈ జన్మలో ధనము కలిగి ఉన్నప్పటికీ అనుభవించడానికి నోచుకోలేరు.”
“అధిక సౌందర్యములు గల యట్టి జనులు తొల్లి మాంస భోజనములఁ దొఱఁగి యున్న
వారు రూప విహీనులు దారు రూపు గలిగి తొలుమేనఁ గొనటులఁ బలికినారు.'”
“సతీదేవీ! అందచందాలు కలిగి వున్నవారు పూర్వజన్మలో మాంసం తినకుండా మాని వేసిన వారే సుమా! నేడు వికృత స్వరూపులై వున్నవారు గత జన్మలో అంద చందాలు కలవారై కురూపులను పరిహసించిన వారే.”

“పార్వతీ! పూర్వ జన్మలో తన పత్ని యందు పరమ ప్రీతి కలిగిన పురుషుడు ఏక పత్నీ వ్రతుడై సౌందర్య వతిని ఇల్లాలుగా పొందుతాడు. తొలిజన్మలో భార్యను నిర్లక్ష్యము చేసి స్వేచ్చగా విహరించినవాడు మరుజన్మలో సౌభాగ్య హీనుడౌతాడు.”

“ఓ పద్మనయనీ! తొలి జన్మలో ధర్మాలు తెలిసి కూడా ఏమాత్రం దానం చేయని వాడు మరు జన్మలో ఆధ్యాత్మ జ్ఞానము,శాస్త్రజ్ఞానము కలిగి ఉండి కూడా పేదరికముతో అలమటిస్తాడు. పూర్వ జన్మలో వివేక హీనుడై వుండి కూడా కనికరించి దరిద్రులను రక్షించినవాడు ఈ జన్మలో తగినంతగా తెలివి తేటలు లేకున్నప్పటికీ మెండైన సంపద కలవాడుగా జన్మిస్తాడు.”

“బుద్ధి మంతుడై శాస్త్ర శ్రవణం చేసి శోభిల్లె మానవుడు గత జన్మలో గురువును పరమ భక్తితో ఆరాధించి, తాను నేర్చిన విద్యను ఇతరులకు నేర్పి వారిని పండితులను చేయాలన్న సంకల్పము కలిగినవాడే. ఆలు బిడ్డలు మూర్ఖులై ఒకప్రక్క పేదరికంతో, మరోప్రక్క రోగాలతో అల్లాడుతూ కష్టాలు అనుభవించే మనుష్యులు గత జన్మలో కోపం, దురాశ, దేవుడు లేడని మూర్ఖంగా వాదించడం వంటి దుర్గుణాలతో బాధిస్తూ విజృంభించిన వారే సుమా!”

“పార్వతీ! ఈ జన్మలో కుష్టు రోగిగా వున్నవాడు గత జన్మలో పరులను కొట్టి, కట్టి వేసి వారి అందాలను పాడు చేసిన వాడే సుమా! తొలుత పరుల కాళ్ళూ, చేతులు కట్టివేసి వక్రంగా విరిచిన వాడు ఈ జన్మలో కుంటి వాడే. చర్మ రోగాలతో, కణుతులతో బాధపడే వారు పూర్వజన్మలో సజ్జనులను బడితెతో బాది మచ్చరంతో పిడికిలితో గ్రుద్ది నొప్పించినవారే. ఏ తప్పూ చేయక పోయినా పొగరెక్కి కాళ్ళతో తన్నిన వాళ్ళు, కాళ్ళు పరిశుభ్రంగా కడగ కుండా దేవాలయాలకు వెళ్ళిన వాళ్ళ పాదాలు కాలి జబ్బులతో బాధ పడుతుంటారు.”
“జ్వరం, కడుపులో బల్ల, విరోచనాలు,కురుపులు మహోదరం అనే పొట్ట పెరిగే వ్యాధి ‘వాత పిత్త శ్లేష్మం’, అనే త్రిదోషాలవలన కలిగే రోగాలతో నిరంతరం తల్లడిల్లే వారు పూర్వజన్మలో జంతువులను వరుస బెట్టి చంపిన వారే, గురువును దుఃఖ పెట్టిన వారే. గత జన్మలో ధాన్యంలో తాలు, తబక కలిపి అమ్మినవాడు, తప్పుడు తూనికలు తూచి వస్తువులు అమ్మినవాడు ఈ జన్మలో గూనివాడుగానూ, మరుగుజ్జుగానూ, తొడలు లేనివాడుగానూ ఉంటాడు.”

“పార్వతీ! ఇప్పుడు పిచ్చివాళ్ళుగా వున్న వాళ్ళు ముందటి జన్మలో వంచనతో సజ్జనుల ధనం కాజేసిన వారే. ఇప్పుడు సంతానము లేని వారు ముందటి జన్మలో తల్లి దండ్రులకు శ్రాద్ధ కర్మలు నిర్వర్తించని వారు, పిల్లలను చంపిన పాత్ములే సుమా! పూర్వ జన్మలో ఎద్దును కట్టి పడవేసి దాని వృషణాలు నలగ గొట్టిన వారూ, వాటి ముడ్డి పూస విరగ గొట్టిన వారు ఈ జన్మలో నపుంసకులుగాను, రతి సౌఖ్యానికి నోచుకోని వారూ అయి వున్నారు. క్రితం జన్మలో భర్తను మోసం చేసి, పొగరెక్కి మరొక దాని భర్తను తన స్వంతం చేసుకొని ధనార్జన చేసిన స్త్రీ ఈ జన్మలో చిన్న వయసులోనే విధవగును సుమా!”

“విశాలాక్షీ! పరిశుద్ధులై జన్మించి నప్పటికీ, రోత కలిగించే పనులు చేస్తూ జీవించే వారు తొలి జన్మలో గొప్పవాళ్ళమనే అహంకారులై, పొగరు బోతు తనంతో,మదమెక్కి సత్పురుషులను అవమాన పరచిన వారే. పూర్వ జన్మలో మిక్కిలి గర్వంతోనూ, వదరు బోతులై వాగుతూ నిరపరాధులను ఇష్టాను సారం నిందిస్తూ కొట్టిన వారు ఈ జన్మలోసేవకులై పరుల నాశ్రయించి వారి బెదిరింపులను, దూషణలను, వారు పెట్టె బాధలనూ సహించే అధములై వుంటారు.”

“పూర్వ జన్మలో ఎవరైనా తమ వద్ద దాచమని ఇచ్చిన ధనము వస్తువులను తిరిగి వాళ్లకు ఇవ్వకుండా ఏదో ఒక సాకుతో కాజేసిన అసత్యవాదులు, లోభులు కపటులు ఈ జన్మలో సర్వం కోల్పోయి అల్లాడుతారు. పూర్వజన్మలో ఏమాత్రం కృప, దయ లేకుండ ఇతరులను చంపిన వారు ఈ జన్మలో తామూ, తమ చుట్టాలు అంతా ఒకేసారి మరణిస్తారు.”

“ఉమాదేవీ! ఇంతవరకు నేను చెప్పిన ఈ పాపు లందరికీ నరకం తప్పదు. పూర్వం తాము చేసిన పాపాల వలన నరక లోకంలో నానా బాధలనుభవించి మళ్ళీ వీరు భూమిపై నరులుగా జన్మించినపుడు వారికి ఈ చెప్పబడిన గతులు కలుగుతాయి. ఎక్కువ పాపాలు చేయని వారికి మనుష్య జన్మ కలుగుతుంది కానీ ఆ శరీరంతో తాము చేసిన కర్మ ఫలాలు అనుభవించక మరు జన్మలో అనుభవిస్తారు. అయితే మునులు యక్ష, గరుడ, గంధర్వ, కిన్నర, కింపురుషాది దేవయోని జనితులు మాత్రం వారు చేసినన తపోఫలితాలను ఆ దేహములతోనే అనుభవిస్తారు’ అని పరమేశ్వరుడు పలుకగా పార్వతీ దేవి దేవా! మీ దయవలన పెక్కు సంగతులను తెలుసుకొని ధన్యురాల నైతిని అని పలికింది.

Leave a Reply